అవతార్ (2009 చిత్రం)
అవతార్ Avatar | |
---|---|
దర్శకత్వం | జేమ్స్ కామెరాన్ |
నిర్మాత | జేమ్స్ కామెరాన్ జాన్ లాండౌ |
తారాగణం | సామ్ వర్థింగ్టన్ జో సల్దానా స్టీఫెన్ లాంగ్ మిషెల్ రోడ్రిగెజ్ జోయెల్ డేవిడ్ మూర్ గియోవన్నీ రిబిసి సిగోర్నీ వీవర్ |
ఛాయాగ్రహణం | మౌరో ఫియోర్ |
కూర్పు | జాన్ రెఫోవా స్టీఫెన్ ఇ. రివ్కిన్, జేమ్స్ కామెరాన్ |
సంగీతం | జేమ్స్ హార్నర్ |
నిర్మాణ సంస్థలు | లైట్‌స్టార్మ్ ఎంటర్టైన్మెంట్ డ్యూన్ ఎంటర్టైన్మెంట్ ఇంజీనియస్ ఫిల్మ్ పార్టనర్స్, ట్వంటీత్ సెంచరీ ఫాక్స్[1] |
పంపిణీదార్లు | ట్వంటీత్ సెంచరీ ఫాక్స్ |
విడుదల తేదీs | డిసెంబర్ 10, 2009 (లండన్ ప్రీమియర్) డిసెంబర్ 18, 2009 |
సినిమా నిడివి | 162 ని 171 ని (రే-రిలీజ్) |
దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
భాషలు | ఇంగ్లీష్ తెలుగు (అనువాదం) |
బడ్జెట్ | $237,000,000 +$9,000,000 (రే-రిలీజ్) |
బాక్సాఫీసు | $2,782,275,172 |
అవతార్ (ఆంగ్లం: Avatar) జేమ్స్ కామెరాన్ రచించి, దర్శకత్వం వహించిన వైజ్ఞానిక కల్పనా చిత్రం. ఈ సినిమా కథ 22వ శతాబ్దం మధ్య కాలంలో జరుగుతున్నట్టు రాయబడింది. ఆల్ఫా సెంటారీ నక్షత్ర వ్యవస్థలో వాయువులే ప్రధానంగా కలిగిన ఒక గ్రహానికి ఉప్రగ్రహమైన పండోరా గ్రహంలో మానవులు కాలు మోపుతారు. ఆ గ్రహంలో మాత్రమే అరుదుగా లభించే అనబ్టేనియం అనే ఊహాత్మక ఖనిజాన్ని సంపాదించడం వాళ్ళ లక్ష్యం.[a] వీళ్ళ ఖనిజ పరిశ్రమ విస్తరించేకొద్దీ పండోరా ద్వీపవాసులైన నావి అనే జాతి ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ చిత్రంలో మానవ శాస్త్రవేత్తలు జెనెటిక్ ఇంజనీరింగ్ సహాయంతో నావీ జాతి శరీరాన్ని తయారు చేసి దాన్ని ఎక్కడో దూరంగా ప్రయోగశాలలో ఉన్న మానవ మెదడు సహాయంతో నియంత్రిస్తూ నావి జాతి ప్రజలతో సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా కృత్రిమంగా తయారు చేసిన శరీరానికి అవతార్ అనే పేరు. అదే పేరు ఈ సినిమాకు పెట్టారు.
కథా సంగ్రహం
2154 సంవత్సరంలో భూమి మీద ఉన్న సహజ వనరులు అడుగంటిపోతాయి. రిసోర్సెస్ డెవెలప్‌మెంట్ అథారిటీ (RDA) సంస్థ తరఫున కొంతమంది ఆల్ఫా సెంటారీ నక్షత్ర వ్యవస్థలో వాయువులే ప్రధానంగా కలిగిన ఒక గ్రహానికి ఉప్రగ్రహమైన పండోరా గ్రహం మీద అరుదుగా లభించే, అమూల్యమైన అనబ్టేనియం అనే ఊహాత్మక ఖనిజం కోసం త్రవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆ గ్రహ వాతావరణం మానవులకు విషపూరితం. కానీ అక్కడ సుమారు 10 అడుగుల పొడవుతో, నీలం రంగు కలిగిన, మానవ జాతిలో ఒక ఉపజాతి అయిన, నావి అనే జాతి ప్రజలు ప్రకృతితో మమేకమై, పర్యావరణానికి హాని తలపెట్టకుండా జీవిస్తుంటారు. పండోరాలో అన్వేషణ సాగించడం కోసం జీవశాస్త్రవేత్తలు అవతార్ అనే పేరుగల నావి జాతి శరీరాలను తయారు చేస్తారు. నౌకాదళానికి చెందిన, కాళ్ళ కింది భాగం అంతా చచ్చుబడిపోయిన జేక్ సల్లీ, చనిపోయిన అతని కవల సోదరుడి స్థానంలో ఆపరేటరుగా ఈ ప్రాజెక్టులో చేరతాడు. అవతార్ కార్యక్రమానికి నాయకురాలైన డాక్టర్ గ్రేస్ అగస్టీన్ మొదట్లో ఇతను తమకు పనికిరాడని భావించినా చివరకు అతన్ని తన బాడీగార్డుగా ఎంపిక చేస్తుంది.
అవతార్ రూపంలో ఉన్న డాక్టర్ గ్రేస్, డాక్టర్ నార్మ్ స్పెల్‌మాన్ కి రక్షణగా వెళుతున్న జేక్ అవతార్ ని ఒకసారి పండోరాలోని అడవి జంతువులు దాడి చేయగా అతను అడవిలోకి పరిగెడుతాడు. అక్కడ అతని నావి జాతికి చెందిన నేతిరి అనే యువతి అతన్ని కాపాడుతుంది. జేక్ ను అనుమానిస్తూ అతన్ని తమ తెగ వద్దకు తీసుకొని వెళుతుంది నేతిరి. నేతిరి తల్లి మోవాత్ ఆ తెగకు ఆధ్యాత్మిక నాయకురాలు. ఆమె అతన్ని తమలో కలుపుకోమని కూతురికి చెబుతుంది. RDA భద్రతా దళాల ముఖ్య అధికారి అయిన కల్నల్ మైల్స్ క్వారిచ్, నావి జాతి ప్రజల గురించి, వారందరూ తరచుగా కలుసుకునే పెద్ద చెట్టు (హోం ట్రీ) గురించి సమాచారం తెలియజేస్తే తన కాళ్ళు తిరిగి పనిచేసేలా చేస్తామని జేక్ కి వాగ్దానం చేస్తాడు. ఈ పెద్ద చెట్టు కిందే అరుదైన అనబ్టేనియం ఖనిజ నిక్షేపాలు ఉంటాయి. దీన్ని గురించి తెలుసుకున్న గ్రేస్, జేక్, నార్మ్ ముగ్గురూ ఒక ఔట్‌పోస్ట్ కి మారుతారు. జేక్ ని తమ జాతిలో చేర్చుకోవడంతో, నేతిరి అతనితో ప్రేమలో పడుతుంది. నావి ప్రజలకు చెందిన ఒక ముఖ్యమైన స్థలాన్ని RDA బుల్‌డోజర్ నాశనం చేయబోతుండగా జేక్ అడ్డుకుంటాడు. పార్కర్ సెల్ఫ్‌రిడ్జ్ అనే అధికారి హోం ట్రీ ని ధ్వంసం చేయమని ఆదేశాలు ఇస్తాడు. హోం ట్రీని ధ్వంసం చేయడం వలన పండోరా జీవావరణం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించినా వినకుండా పార్కర్ ఒక గంటలో నావి ప్రజలకు నచ్చజెప్పి హోం ట్రీని ఖాళీ చేయించమని చెబుతాడు.
జేక్ తాము గూఢచారులమని నావి జాతివారికి వెల్లడించగా వారు గ్రేస్ ని, అతన్ని బంధిస్తారు. క్వారిచ్ సైనికులు హోం ట్రీని ధ్వంసం చేసి చాలా మందిని చంపేస్తారు. అందులో ఆ తెగకు నాయకుడు, నేతిరి తండ్రి కూడా ఉంటాడు. మోవాత్ జేక్ నీ, గ్రేస్ ని వదిలివేస్తుంది. కానీ వారిద్దరినీ క్వారిచ్ సేనలు వారి అవతార్ ల నుంచి వేరు చేసి బంధీలు చేస్తారు. క్వారిచ్ నిర్దాక్షిణ్యాన్ని చూడలేని పైలట్ ట్రూడీ చాకోన్ జేక్, గ్రేస్, నార్మ్ లను గ్రేస్ కి చెందిన ఔట్ పోస్ట్ కి చేరవేస్తాడు. ఈ క్రమంలో గ్రేస్ తూటా దెబ్బ తగులుతుంది. నావీ జాతి ప్రజలు భయపడే తోరూక్ అనే డ్రాగన్ లాంటి ప్రాణికి తన మైండ్ ని అనుసంధానించి జేక్ మళ్ళీ వారి అభిమానాన్ని సంపాదిస్తాడు. పవిత్రమైన ట్రీ ఆఫ్ సోల్స్ దగ్గర జేక్, గ్రేస్ ని బతికించమని మోవాత్ ని వేడుకుంటాడు. వారు గ్రేస్ ని ఆమె అవతార్ లోకి ప్రవేశపెడదామని ప్రయత్నించేలోగా ఆమె ప్రాణం పోతుంది. నావి జాతి కొత్త నాయకుడైన సూటే తో కలిసి జేక్ RDA మీ తిరుగుబాటు చేయడం కోసం వారి జాతినంతా ఏకం చేస్తాడు. క్వారిచ్ ట్రీ ఆఫ్ సోల్స్ మీద దాడి చేస్తాడు. ఆ దాడిలో సూటే, ట్రూడీ మరణిస్తారు.
ఇక నావి పని అయిపోతుందనగా పండోరాలోని క్రూర మృగాలు క్వారిచ్ సేనల మీద మెరుపు దాడి చేసి వారి సైన్యాన్ని చెల్లా చెదురు చేసి వారిని కాపాడుతాయి. అంతకు మునుపు జేక్ తమ దేవత ఐవాకు చేసిన ప్రార్థన ఫలించిందని నేతిరి అనుకుంటుంది. క్వారిచ్ నాశనమైన తన విమానం నుంచి బయటకు వచ్చి జేక్ శరీరం ఉన్న అవతార్ లింక్ యూనిట్ ని పగల గొడతాడు. దీనివల్ల జేక్ శరీరం పండోరా విషవాతావరణానికి గురి అవుతుంది. క్వారిచ్ జేక్ గొంతు కోసి చంపబోయేంతలో నేతిరి అతన్ని చంపేస్తుంది. జేక్ మానవ రూపాన్ని మొదటిసారి చూసిన నేతిరి అతనికి మాస్క్ వేసి కాపాడుతుంది. జేక్, నాం, ఇంకా కొంతమంది మనుషులు తప్ప మిగతా వారందరినీ పండోరా నుంచి వెలి వేస్తారు. జేక్ ట్రీ ఆఫ్ సోల్స్ సహాయంతో తన మానవ శరీరాన్ని శాశ్వతంగా వదిలి అవతార్ లోకి మారిపోతాడు.
తారాగణం
- జేక్ సల్లీగా శాం వర్తింగ్టన్
- నేతిరిగా జో సల్దానా
- మైల్స్ కారిచ్ గా స్టీఫెన్ ల్యాంగ్
- ట్రూడీ చాకన్ గా మిషెల్ రోడ్రిగెజ్
- పార్కర్ సెల్ఫ్‌రిడ్జ్ గా గియోవన్నీ రిబిసి
- డాక్టర్ నార్మ్ స్పెల్‌మ్యాన్ గా జోయెల్ డేవిడ్ మూర్
- డాక్టర్ గ్రేస్ అగస్టీన్ గా సిగార్నీ వీవర్
గమనికలు
మూలాలు
- ↑ LaFraniere, Sharon (January 29, 2010). "China's Zeal for 'Avatar' Crowds Out 'Confucius'". The New York Times. Retrieved January 18, 2020.
- ↑ Choi, Charles Q. (December 28, 2009). "Moons like Avatar's Pandora could be found". NBC News. Retrieved February 27, 2010.
- ↑ Horwitz, Jane (December 24, 2009). "Family Filmgoer". Boston.com. The Washington Post. Retrieved April 27, 2022.
- ↑ This property of Unobtanium is stated in movie guides, rather than in the film. Wilhelm, Maria; Mathison, Dirk (November 2009). James Cameron's Avatar: A Confidential Report on the Biological and Social History of Pandora. HarperCollins. p. 4. ISBN 978-0-06-189675-0.