ఇనవాషిరో సరస్సు

ఇనవాషిరో సరస్సు
猪苗代湖
ప్రదేశంఫుకుషిమా ప్రాదేశిక భూభాగం
అక్షాంశ,రేఖాంశాలు37°28′29″N 140°05′37″E / 37.47472°N 140.09361°E / 37.47472; 140.09361
రకంటెక్టోనిక్ సరస్సు
సరస్సులోకి ప్రవాహంనగాసె నది
వెలుపలికి ప్రవాహంనిప్పాషి నది
పరీవాహక విస్తీర్ణం711 కి.మీ2 (275 చ. మై.)
ప్రవహించే దేశాలుజపాన్
ఉపరితల వైశాల్యం103.3 కి.మీ2 (39.9 చ. మై.)
సరాసరి లోతు51.5 మీ. (169 అ.)
గరిష్ట లోతు94.6 మీ. (310 అ.)
5.40 కి.మీ3 (4,380,000 acre⋅ft)
తీరంపొడవు149 కి.మీ. (30 మై.)
ఉపరితల ఎత్తు514 మీ. (1,686 అ.)
ద్వీపములుOkinajima
1 Shore length is not a well-defined measure.

ఇనవాషిరో సరస్సు (猪苗代湖 Inawashiro-ko) జపాన్ లోని నాలుగవ అతి పెద్ద సరస్సు.[1] మూడవ అతి పెద్ద మంచినీటి సరస్సు.[2] 105 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించివున్న ఈ సరస్సు హోన్షు దీవిలోని ఫుకుషిమా ప్రాదేశిక భూభాగం మధ్యభాగంలో బందాయ్ అగ్నిపర్వతానికి దక్షిణంగా ఉంది. స్వచ్ఛమైన దీని జలాల పారదర్శకత కారణంగా ఈ సరస్సును దివ్య అద్దం (Heavenly Mirror Lake) గా పిలుస్తారు. ఈ సరస్సు జలాలు కొద్దిగా ఆమ్ల (acidic) ధర్మాన్ని కలిగివుంటాయి. ప్రముఖ విహార పర్యాటక ప్రదేశమైన ఈ సరస్సు సంవత్సరం పొడుగునా సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

ఉనికి-విస్తరణ

ఇనవాషిరో సరస్సు-నైసర్గిక స్వరూపం

ఇనవాషిరో సరస్సు జపాన్‌లోని హోన్షు దీవిలో ఫుకుషిమా (Fukushima) ప్రాదేశిక భూభాగం మధ్యభాగంలో, బందాయ్ అగ్నిపర్వతానికి (1,819 m) దక్షిణంగా ఉంది. బందాయ్-అసాహి నేషనల్ పార్క్ లోపల భాగంలో వున్న ఈ సహజసిద్ధమైన సరస్సు 105 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దాదాపుగా అండాకారంలో (oval) ఏర్పడింది. ఉత్తర-దక్షిణాలుగా 14 కి.మీ., తూర్పు-పడమరలుగా 10 కి.మీ. దూరంలో విస్తరించి ఉంది. సరస్సు ఉపరితలం సముద్రమట్టానికన్నా 514 మీటర్ల ఎత్తులో ఉంది. జపాన్ లోని ఎత్తైన సరస్సులలో ఇది ఒకటి.[3] దీని సగటు లోతు 37 మీటర్లు. చుట్టూ వున్న తీరరేఖ పొడవు 55.3 కి.మీ. ఈ సరస్సులో ఒకినా (Okina Island) అనే చిన్న దీవి వాయువ్యదిశలో ఏర్పడింది. దీని విస్తీర్ణం 0.07 చ.కి.మీ.[4]

ఆవిర్భావం

ఇనవాషిరో సరస్సు ఏర్పడటంలో విరూపకారక చలనాలు (tectonic movements) ముఖ్యపాత్ర వహించాయి. సుమారు 30 లేదా 40 వేల సంవత్సరాల క్రితం బందాయ్ అగిపర్వతం భారీగా ప్రేలినపుడు దాని సమీపంలో ఒక భారీ విరూపకారక గుండం (tectonic depression) ఏర్పడింది. అగ్నిపర్వత ప్రేలుళ్ళ నుండి వెలువడిన శిలాశకలాలతో కూడిన బురద ప్రవాహం (mud flow) ఈ భారీ గుండానికి అడ్డుపడటంతో స్థలాకృతిలో పెను మార్పులు జరిగి ఈ సరస్సు ఏర్పడింది.[4]

సరస్సు బేసిన్

ఇనవాషిరో సరస్సు హరివాణం (Basin) 711 చ.కి.మీ. మేర విస్తరించింది. ఈ బేసిన్ నుండి నగాసె (Nagase), మె (Mae), ఒసావా (Osawa), ఆంగో (Amgo), ఫునాత్సు (Funatsu), సుగా (Suga), టోకనాత్సు (Tokanatsu), హారా (Hara), తకహషి (Takahashi), ఒగురో (Oguro), నిటాబోరి (Nitabori) మొదలైన అనేక చిన్న నదులు, ఏరులు దీనిలో కలుస్తున్నాయి. వీటిలో నగాసె నది ముఖ్యమైనది. ఈ సరస్సు నుండి బయటకు ప్రవహించే ఒకే ఒక బహిర్గత నది నిప్పాషి నది. దీనితో పాటు అసాక కాలువ (Asaka canal), న్యూ అసాకా కాలువ (New Asaka Canal) అనే మరో రెండు జలమార్గాలు సరస్సు నుండి బయటకు ప్రవహిస్తాయి.[4]

సరస్సు జలాల ఆమ్లత్వం

ఈ సరస్సు జలాలు ఆమ్ల ధర్మాన్ని కలిగి వుంటాయి. pH విలువ దాదాపు 5.0 గా వుంటుంది.[4] దీనికి కారణం బెసిన్ నుండి ఈ సరస్సు లోనికి నిరంతరంగా ఆమ్లజలాలు ప్రవహించడమే. సల్ఫర్ గనుల ప్రాంతాలలో ఈ సరస్సు యొక్క అంతర్గత నదులు ప్రవహించడం వలన, అవి తమతో పాటు సల్ఫర్ సంబంధిత పదార్ధాలను బేసిన్ నుండి ఈ సరస్సు లోనికి చేరవేస్తున్నాయి. దీనితో పాటు సమీప అగ్నిపర్వత పరిసర ప్రాంతంలో గల హాట్ స్ప్రింగ్స్‌ల నుండి వెలువడే సల్ఫ్యూరిక్ ఆసిడ్ కూడా క్రమేణా ఈ సరస్సులలోనికి చేరవేయబడుతూ వస్తుంది.[4] ముఖ్యంగా నగాసే నది నుండి సరస్సులోనికి ఆమ్లపూరిత జలాలు ఎక్కువ మోతాదులో కలుస్తున్నాయి. దీని వలన సరస్సులో నాచు వంటి సేంద్రియ పదార్ధాల ఉనికి చాలా తక్కువ స్థాయికి చేరుకుంది.

సరస్సు జలాల తటస్థికరణ కార్యక్రమంలో భాగంగా బేసిన్ నుండి సరస్సు లోనికి ప్రవహిస్తున్న ఆమ్లజలాలను తగ్గించే దిశలో నిర్దిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యంగా నగాసె నదీ జలాల ఆమ్లత్వం తగ్గించడంతో పాటు, ఇతర అంతర్గత నదీ జలాల క్షారత్వాన్ని పెంపొందించే సంతులన చర్యలు చేపట్టడంతో క్రమేణా సరస్సు యొక్క ఆమ్లత్వం పూర్తిగా కాకపోయినా కొంతమేరకు తగ్గుతూ వస్తుంది. 1980 లో సరస్సు మధ్య భాగంలో pH విలువ 4.8 వుండగా 2009 నాటికి అది 6.8 కు చేరుకొంది.[5]

శీతోష్ణస్థితి

ఈ సరస్సు ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత శీతాకాలంలో (జనవరి, ఫిబ్రవరి నెలలలో) కనిష్ఠంగా మైనస్ 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ చేరుకొంటుంది.[4] సగటు ఉష్ణోగ్రత వేసవిలో (జూలై, ఆగస్టు నెలలలో) గరిష్ఠంగా 20 °C వరకూ వుంటుంది.[4] సాంవత్సరిక సగటు ఉష్ణోగ్రత 9.1 °C. శీతాకాలంలో సరస్సులోని నీరు సాధారణంగా ఘనీభవించదు. అయితే అతి శీతల గాలులు వీయడం వలన సరస్సు పరిసర ప్రాంతాలలోని చెట్లు, రాళ్ళు మొదలైన వాటిపై గడ్డకట్టిన మంచు పెళుసులుగా పేరుకుపోవడం జరుగుతుంది. వీటిని స్థానికంగా షిబుకి గూరి (frozen splash) అని పిలుస్తారు.[3] సగటు వర్షపాతం వేసవిలో (జూలై నెలలో) గరిష్ఠంగా 24.5 సెంటీ మీటర్లు కాగా శీతాకాలంలో (జనవరి నెలలో) కనిష్ఠంగా 5.7 సెం.మీ. వుంటుంది.[6]

ఇనవాషిరో సరస్సు
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
57
 
−1
−6
 
 
102
 
−1
−7
 
 
95
 
2
−3
 
 
131
 
7
2
 
 
154
 
12
4
 
 
198
 
15
13
 
 
245
 
19
15
 
 
127
 
20
15
 
 
142
 
19
15
 
 
217
 
13
9
 
 
77
 
8
4
 
 
103
 
3
−4
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: [7]

వృక్ష జంతు జాలం

ఈ సరస్సు బేసిన్‌లో సహజ ఉద్భిజ్జ సంపద 620 చ.కి.మీ. మేరకు విస్తరించి ఉంది. ఇక్కడ పెరిగే వృక్షాలు వెడల్పాటి ఆకురాల్చు అడవులు (Deciduous broad leaf forests), సబ్ ఆల్పైన్ (sub alpine), కొనిఫెరస్ (Coniferous forest) అడవుల తరగతికి చెందినవి.[4] సరస్సు కొంతవరకు ఆమ్లపూరితంగా వుండటం వలన ఈ జలాల్లో సేంద్రియ పదార్ధం చాలా తక్కువగా వుంటుంది. అందువలన ఇక్కడ పెద్ద రకం చేపలు పెరగవు. కరాశియస్ గిబెలియో (Carassius Gibelio), లూసిస్కస్ హకోనేన్సిస్ (Leiciscus Hakonensis), ఇవాన (Salvelinus Leucomaenis) వంటి జాతులకు చెందిన చిన్నరకం చేపలు మాత్రమే ఈ సరస్సులో లభిస్తాయి.[4]

నీటిపారుదల

సరస్సు పశ్చిమ ఫుకుషిమా ప్రాంతంలోని ఐజు బేసిన్‌కు (Aizu basin) చెందిన పంటపొలాలకు ప్రధాన జలవనరుగా ఉంది. ప్రాచీనకాలం నుండి ఈ సరస్సు జలాలను ఐజు బేసిన్ లోని వరిసాగుకు ఉపయోగిస్తున్నారు.[4] 17 వ శతాబ్దంలో ఎడో (Edo) పరిపాలనా కాలంలో నీటిపారుదల కాలువ నిర్మించబడింది. 1882 లో ఈ సరస్సు నుండి కోరియామా (Koriyama) బేసిన్‌కు మరో ఇరిగేషన్ ఛానల్ నిర్మించబడింది. దీనితో ఈ ప్రాంతంలోని వరిపంట విస్తీర్ణం బాగా అభివృద్ధి చెందింది. 1915 లో కోరియామా నగరానికి మంచినీటి సఫరాకు, పారిశ్రామిక అవసరాల కోసం పాత ఛానల్‌కు సమాంతరంగా మరో జలమార్గాన్ని నిర్మించారు.[4]

జల విద్యుతుత్పత్తి

ఇనవాషిరో సరస్సు యొక్క నీటి ఉపరితలం, పరిసర బేసిన్ యొక్క ఉపరితలం కన్నా సుమారు 300 మీటర్లు ఎత్తులో ఉంది.[4] ఈ కారణంగా ఈ సరస్సు లోని జలాలు జలవిద్యుత్పాదనకు అవసరమైన స్థితిజ శక్తిని (Potential Energy) కలిగివున్నాయి. సరస్సు నుండి బయటకు ప్రవహించే ఒకే ఒక ప్రధాన నది నిప్పాషి నది. సరస్సులోని జలాలను ఈ నది లోకి చేసే పంపింగ్‌ను రెగ్యులేట్ చేయడానికి జురోక్యో బ్యారేజీ (Jūrokkyō Dam) ను నిర్మించారు. నిప్పాషి మీదను, ఇతర జలమార్గాల మీద చిన్న చిన్న జల విద్యుత్పాదన కేంద్రాలను నిర్మించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ టోకియో ప్రాంతానికి సరఫరా చేయబడుతుంది. జపాన్ దేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్, లాంగ్ రేంజ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ వేయబడిన తొలి జల విద్యుత్కేంద్రం అయిన ఇనావషిరో పవర్ ప్లాంట్‌ నిప్పాషి నది మీదనే నిర్మించబడింది. ప్రస్తుతం ఇది నాలుగు స్టేజిలలో మొత్తం 160 మెగా వాట్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొదటి స్టేజిని (62.4 మె.వా.), రెండవ స్టేజి (37.5 మె.వా.), మూడవ స్టేజిని (23.2 మె.వా.) లతో నిప్పాషి నదికి ఎడమవైపున నదిపై వేర్వేరు ప్రదేశాలలోను, నాల్గవ స్టేజిని (37.1 మె.వా.) నదికి కుడివైపున నిర్మించారు.

పర్యాటక కేంద్రం

ఆమ్లత్వ కారణంగా ఈ సరస్సు జలాలలో ఆల్గే వంటి మొక్కలు కనపడవు. సేంద్రియ పదార్ధం అతి కొద్దిగానే వుండటం వల్ల ఈ సరస్సు జలాలు పరిశుభ్రంగాను, పారదర్శకంగాను వుండి, దాని సమీపంలో వున్న బందాయ్ అగ్నిపర్వత రూపాన్ని అద్దంలా ప్రతిఫలిస్తాయి. అందువలన ఈ సరస్సును దివ్య అద్దం (Heavenly Mirror Lake) అని పిలుస్తారు.[8] ఈ సరస్సు ప్రాంతం ఫుకుషిమా ప్రాదేశిక భూభాగంలో ప్రముఖ పర్యాటక, విహార స్థలంగా ఉంది. శీతాకాలంలో హంసలు ఈ సరస్సు తీరానికి వలస వచ్చి వసంతకాలం వరకూ వుండి సందర్శకులకు కనువిందు చేస్తాయి. శీతాకాలంలో ఈ వలస పక్షుల వీక్షణ ప్రధాన ఆకర్షణ. వసంతకాలంలో పచ్చదనంతో అలరారే సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలు అడవి పక్షులతో సందడిగా వుంటాయి. వేసవిలో ఈ ప్రాంతం స్కీయింగ్ (skiing), వాటర్ స్కీయింగ్, బోర్డ్ సెయిలింగ్ లతో విహారస్థలంగా వుంటుంది. మరోవైపు సంవత్సరం పొడుగునా యాటింగ్ (yatching) లతో ఈ సరస్సు ప్రాంతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

చిత్రమాలిక

రిఫరెన్సులు

"INAWASHIRO-KO (LAKE INAWASHIRO)". Archived from the original on 6 మార్చి 2016. Retrieved 14 December 2017.

బయటి లింకులు

"FUKUSHIMA". IS JAPAN COOL. Archived from the original on 6 ఆగస్టు 2021. Retrieved 14 December 2017. [9]

మూలాలు

  1. FUKUSHIMA.
  2. "Lake Inawashiro". japanhoppers.com. japanhoppers. Retrieved 14 December 2017.[permanent dead link]
  3. 3.0 3.1 Lake Inawashiro_travel around japan.
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 INAWASHIRO-KO (LAKE INAWASHIRO).
  5. "A40. Quantitative consideration on pH rising factors in The Inawashiro Lake employing calculation method of pH titration curve" (PDF). www.jsce.or.jp. Retrieved 14 December 2017.
  6. "NASA Earth Observations: Rainfall (1 month - TRMM)". NASA/Tropical Rainfall Monitoring Mission. Archived from the original on 10 జూన్ 2021. Retrieved 30 January 2016.
  7. "NASA Earth Observations Data Set Index". NASA. Archived from the original on 28 నవంబరు 2017. Retrieved 30 January 2016.
  8. "Lake Inawashiro Area". JNTO. Japan National Tourism Organization. Archived from the original on 10 ఏప్రిల్ 2017. Retrieved 15 December 2017.
  9. "Lake Inawashiro" (PDF). env.go.jp. Ministry of the Environment, Government of Japan. Retrieved 14 December 2017.