కీళ్ళనొప్పులు
కీళ్ళనొప్పులు లేదా ఆర్థరైటిస్ మానవులలో కలుగు ఒక రకమైన వ్యాధి.
లక్షణాలు
నొప్పి ఒక జాయింటు నుంచి లేదా ఒక వేలు నుంచి ప్రారంభమై శరీరంలోని అన్ని జాయింట్లకు విస్తరిస్తుంది. ఆర్థరైటిస్‌లో కనిపించే ప్రధాన లక్షణం జాయింటుల్లో నొప్పి. కొన్నిరకాల ఆర్థరైటిస్‌ల వల్ల అవయవాలపై ప్రభావం పడుతుంది. జాయింటుల్లో నొప్పి, వాపు, కీళ్లు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వ్యాధి అనేక రూపాల్లో రావచ్చు. అవి అస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సూడోగౌట్, సొరియాటిక్ ఆర్థరైటిస్, అంకైలోజింగ్ స్పాండిలైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్.
కారణాలు
వయసు పైబడిన కొద్దీ కీళ్లు అరిగి నొప్పులు వస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్, వైరస్ ఇన్‌ఫెక్షన్, జీవక్రియ లోపం, శరీరంలో తయారయ్యే రసాయనాల అసమతుల్యత, హార్మోన్స్ అసమతుల్యత, థైౖరాయిడ్ ప్రభావం, సొరియాసిస్‌తో వచ్చే నొప్పులు, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ శక్తి తగ్గడం, సైనోవియల్ అనే ద్రవంలో తేడాలు ఏర్పడటం, అధిక బరువు, ప్రమాదాలు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పులు కీళ్లనొప్పులకు ప్రధాన కారణాలు.
పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఏ వయసులో వారికైనా ఇది రావచ్చు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. గాయాలు తగిలినపుడు లిగమెంట్, కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల తీవ్రమైన నొప్పి రావచ్చు. జాయింటుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు. ఆర్థరైటిస్‌కు మరో ప్రధాన కారణం స్థూలకాయం. డిస్‌లొకేషన్, సికిల్ సెల్ డిసీజ్, బోన్ ట్యూమర్స్, బ్లీడింగ్ డిజార్డర్స్ వంటివి కూడా కారణమవుతుంటాయి.
గౌట్
కీళ్లవాతం(గౌట్) రావడానికి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం ప్రధాన కారణం. శరీర కణజాలాల్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల తీవ్రమైన కీళ్లనొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా జాయింట్స్ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్ యాసిడ్ పేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆది పేరుకుపోతుందో జాయింట్‌లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది. పెరుగుతున్న యూరిక్ యాసిడ్‌ను లెవెల్స్‌ను శరీరం బయటకు పంపించలేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. కీళ్లవాతం ప్రభావం మొదట బొటన వేలు జాయింట్‌ల్లో కనిపిస్తుంది. చీలమండలు, కీళ్లు, మణికట్లు, చేతివేళ్లు, మోచేతి ప్రాంతాల్లో కూడా ప్రభావం ఉంటుంది. జాయింటుల్లో నొప్పి, వాపు ఏర్పడుతుంది. కీళ్లవాతం బారినపడిన జాయింటుల్లో వాపు,నొప్పితో ఎర్రగా మారుతాయి.
సొరియాటిక్ ఆర్థరైటిస్
సొరియాసిస్ అనే చర్మ వ్యాధి బారినపడిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. తల, మోచేయి, మోకాలు, మెడ ప్రాంతాల్లో ప్యాచ్‌ల మాదిరిగా చర్మం ఎర్రగా మారుతుంది. ఇది చేతి వేళ్లు, కాలి వేళ్ల దగ్గర విస్తరించినపుడు సొరియాటిస్ ఆర్థరైటిస్ ప్రారంభమవుతుంది. రెండు చేతులు, కాళ్లలోని జాయింటులు దీని ప్రభావానికి లోనవుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగానే లక్షణాలు ఉంటాయి. చేతి వేళ్లలోనూ,కాలి వేళ్లలోనూ నొప్పి, వాపు ఉంటుంది. పాదం నొప్పిగా ఉంటుంది. కొందరిలో స్పాండిలైటిస్ డెవలప్ అయి నడుంనొప్పి మొదలవుతుంది.
రుమటాయిడ్ ఆర్ధరైటిస్
ఈ వ్యాధి ఒక కీలుకు పరిమితం కాకుండా శరీరంలోని అన్ని జాయింట్స్‌కూ విస్తరిస్తుంది. దీనిని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. చలి కాలంలో దీని బాధ ఎక్కువగా ఉంటుంది. ఇది చేతివేళ్లకు, మోకాలి జాయింట్స్‌కు, మణికట్టు కీలుకు, కాలివేళ్ల కీళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని వల్ల కీళ్లలో నొప్పి, వాపు ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట నొప్పులు ఎక్కువగా ఉండి, కదల్లేని పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరం ఒళ్లు వేడిగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. మూత్రవిసర్జన అధికంగా ఉంటుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అటో ఇమ్యూన్ వ్యాధి. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది.జాయింటుల్లో నొప్పి, వాపుతో ప్రారంభమై కార్టిలేజ్, ఎముకకు విస్తరిస్తుంది. రెండు చేతుల మణికట్టు దగ్గర నొప్పి రావచ్చు. జాయింటుల్లో నొప్పి, వాపు ఉంటుంది. మణికట్టు, మోకాలు జాయింటుల్లోనూ ప్రభావం ఉంటుంది.
అంకైలోజింగ్ స్పాండిలోసిస్
వెన్నెముకలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. క్రమంగా నొప్పి విస్తరిస్తుంటుంది. కారణం తెలియకపోయినా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది.
అస్టియోఆర్థరైటిస్
వయసు పెరుగుతున్నకొద్దీ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల అస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఎముకల చివరన ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి, ఎముకలు రెండూ ఒకదానికొకటి ఒరుసుకుపోయి, ఆ భాగాన నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. దీని వల్ల కూర్చొని లేచినప్పుడు, ఉదయం పూట లేచినప్పుడు జాయింట్లు పట్టినట్టుగా ఉంటాయి. మొదట పది అడుగులు కూడా నడవడానికి వీలుండదు. కొంచెం దూరం నడిస్తే గానీ ఉపశమనం దొరకదు. నడుస్తుంటే కీళ్లలో టకటకమనే శబ్డం వస్తుంది. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా మోకాలులో ఈ నొప్పి కనిపిస్తుంది. రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలలో , వయసు మళ్లినవారిలో, చిన్న వయసులో గర్భాశయం తొలగించిన వారిలో, హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత, కొన్ని సొరియాసిస్, థైరాయిడ్ వ్యాధుల ప్రభావం వల్ల, కీళ్ల పైన ఒత్తిడి పెరిగి ఎప్పుడూ నొప్పి, వాపు, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది.
జాయింటుల్లో వచ్చే సాధారణమైన ఆర్థరైటిస్ వ్యాధి ఇది. కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల రెండు ఎముకల మధ్య రాపిడి జరిగి నొప్పి మొదలవుతుంది. నొప్పితో పాటు, కీళ్లు బిగుసుకుపోవడం, కదల్చడానికి వీలులేకపోవడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా తుంటి, వెన్నెముక, పాదం, చేతుల్లోనూ, వేళ్లలోనూ, మోకాలి జాయింటుల్లోనూ ప్రభావం చూపిస్తుంది. అస్టియో ఆర్థరైటిస్ నేరుగా కీళ్లపైన ప్రభావం చూపించడం వల్ల మనిషి కదల్లేని పరిస్థితులు వస్తాయి. కీళ్లు బిగుసుకుపోవడం, మోకాళ్లపై ఒత్తిడి భరించలేకపోవడం, విపరీతమైననొప్పి, వాపు, కదల్చలేకపోవడం, నిలుచోలేకపోవడం, నడవలేకపోవడం వంటివి వ్యాధి లక్షణాలు. కాలు కదల్చినపుడు శబ్దం వస్తుండటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.
పరిష్కారాలు
- కాల్షియం అధికంగా ఉండే పదార్థాలైన పాలు, పెరుగు, కోడిగుడ్లు, కీర, బొప్పాయి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
- మసాలా వస్తువులు, అధిక బరువును తగ్గించుకోవాలి.
- నడుము ముందుకు వంచకూడదు.
- పడుకునేటప్పుడు మోకాళ్ల కింద మెత్తటి దిండు పెట్టుకోవాలి.
- బరువులు ఎత్తకూడదు.
ఆపరేషన్ లేకుండా హోమియో/ఆయుర్వేద చికిత్స
కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్ధారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో/ఆయుర్వేదం వైద్యం. ఆధునిక హోమియో/ఆయుర్వేద మందులు ఇన్‌ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.