క్షణం (సినిమా)

క్షణం
దర్శకత్వంరవికాంత్ పెరేపు
స్క్రీన్ ప్లేఅడివి శేష్
రవికాంత్ పెరేపు
కథఅడివి శేష్
నిర్మాతప్రసాద్ వి. పొట్లూరి
తారాగణంఅడివి శేష్
అదా శర్మ
అనసూయ భరధ్వాజ్
వెన్నెల కిషోర్
సత్యం రాజేష్
సత్యదేవ్ కంచరాన
ఛాయాగ్రహణంషానీల్ డియో
కూర్పుఅర్జున్ శాస్త్రి
రవికాంత్ పేరేపు
సంగీతంశ్రీచరణ్ పాకాల
నిర్మాణ
సంస్థ
పివిపి సినిమా
విడుదల తేదీ
26 ఫిబ్రవరి 2016 (2016-02-26)
సినిమా నిడివి
120 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్1.1 crore (US$1,40,000)
బాక్సాఫీసు5 crore (US$6,30,000)(17 days)

క్షణం 2016 లో రవికాంత్ పెరేపు దర్శకత్వంలో విడుదలైన క్రైం థ్రిల్లర్ సినిమా.[1] ఇందులో అడివి శేష్, అదా శర్మ ప్రధాన పాత్రలు పోషించాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. 2016 ఫిబ్రవరి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనందుకుని చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. రవికాంత్ పేరేపు, అడివి శేష్ లకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితలుగా రాష్ట్ర నంది అవార్డు వచ్చింది.

కథ

రిషి (అడివి శేష్) అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేసే ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్. తన స్నేహితుడు ఏర్పాటు చేసిన ఒక అమ్మాయితో ప్రేమగా ఉండలేక ఇక నుంచి అలాంటి సంబంధాల నుంచి దూరంగా ఉండాలనుకుంటాడు. ఒకసారి భారత్ లోని తన మాజీ ప్రేయసి శ్వేత (అదా శర్మ) నుండి అతన్ని ఉన్న పళంగా అక్కడికి రమ్మని ఫోను వస్తుంది కానీ తన సమస్య ఏంటో చెప్పదు. రిషి తన స్నేహితులకు వేరే ఏదో కారణం చెప్పి వెంటనే ఇండియాకు బయలుదేరుతాడు. దారిలో తనకు శ్వేతకు మధ్య జరిగిన ప్రేమ కథను, అది ఆమె తండ్రి వల్ల ఎలా చెడిపోయిందో గుర్తు తెచ్చుకుంటాడు.

రిషి హైదరాబాదులో ఓ హోటల్ లో దిగి కారును అద్దెకిచ్చే బాబూ ఖాన్ (వెన్నెల కిషోర్) దగ్గర నుంచి ఒక కారు అద్దెకు తీసుకుంటాడు. శ్వేతను కలిస్తే ఆమె తన కూతురు బడికి వెళుతుండగా ఎవరో అపహరించారనీ, తనకు పోలీసుల నుండి గానీ, పాఠశాల యాజమాన్యం నుండి గానీ ఎలాంటి సహాయం అందడం లేదనీ, కాబట్టి రిషిని తనకు సహాయం చేయమని అడుగుతుంది. ఆమె భర్త కార్తీక్ (సత్యదేవ్ కంచరన) అసలు ఏమీ పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయి ఉంటాడు. పోలీస్ స్టేషన్లో కేసుఫైలును చూస్తే సరైన సమాచారం లేక కేసును మూసేశారని తెలుస్తుంది. పాఠశాలకు వెళ్ళినా అదే పరిస్థితి ఎదురవుతుంది.

ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో రిషి శ్వేత మరిదియైన బాబీని ఓ సిసి టివిలో చూసి వెంబడిస్తాడు. అతను కొంతమంది నైజీరియా ముఠాను కలుస్తాడు. అక్కడికి వెళితే అందులో బాబూ ఖాన్ పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. రిషి అతన్ని నిలదీయగా తాను ఆ ముఠా నుండి మాదకద్రవ్యాలను నగరంలో వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాననీ, అందుకు తనకు బాగా డబ్బు కూడా వస్తుందని ఒప్పుకుంటాడు. విషయం ఎటువైపు వెళ్ళినా దారులు మూసుకుపోవడంతో చివరికి రిషి ఆ పాప అపహరణకు గురైనట్లు పత్రికల్లో ప్రకటన ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకుని డబ్బు దండుకోవాలని చాలామంది దగ్గర్నుంచి ఫోన్లు వస్తాయి కానీ, చివరికి తనను ఆఫీసులో కలవమని కార్తీక్ నుండి ఫోన్ వస్తుంది. అక్కడ కార్తీక్ అసలు శ్వేతకు, తనకు పిల్లలే లేరనీ, కిడ్నాపర్లు కొట్టిన దెబ్బల వల్ల ఆమె అలా మతి చలించి మాట్లాడుతుందని చెబుతాడు. అప్పుడు రిషి అసలు శ్వేత దగ్గర తన కూతురు రియా పాస్ పోర్టు సైజు ఫోటో తప్ప ఇంకేమీ ఆధారాలు లేవని చెబుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఏమీ కనిపించవు.

రిషి వల్లి శ్వేత దగ్గర అదే విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఎప్పుడో కలిసున్న రిషినే గుర్తున్నపుడు ఇటీవలే మాయమైన తన కూతురు రియాను ఎలా మరిచిపోగలనని నిలదీస్తుంది. అప్పుడే రిషి ఆలోచిస్తూ ఉండగా ఒక గోడకు ఒక పాప ఎత్తు కొలిచినట్లు గీతలు కనిపిస్తాయి. అప్పుడే శ్వేత చెప్పింది నిజమే అనిపించి వెనక్కు తిరగ్గా ఆమె కిటికీలోనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. రిషి తన చేసిన తప్పును తెలుసుకుని బాబు ఖాన్ ని నిలదీయగా తాను ఒకసారి బాబీ దగ్గర రియాను చూసినట్లు చెబుతాడు. బాబూఖాన్ సహాయంతో రిషి బాబీని పోలీసులకు పట్టిస్తాడు. స్టేషన్లో అతన్ని ఏసీపీ జయ (అనసూయ), రవి చౌదరి (సత్యం రాజేష్) విచారిస్తుండగా అతను తిరగబడ్డంతో జయ అతన్ని కాల్చేస్తుంది. రిషికి మళ్ళీ చిక్కు పరిస్థితి ఎదురవుతుంది. రిషిని జయ తన ఇంటికి తీసుకెళ్ళి ఓ ప్రమాదంలో తన భర్తను, కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయినట్లు చెబుతుంది. రిషి కూడా శ్వేతతో తన ప్రేమకథను వివరిస్తాడు. ఈలోపు జయ రిషిని ఓ ఫోటో తీస్తుంది. రిషి ఆమె దగ్గర్నుంచి సెలవు తీసుకును బాబూఖాన్ ను కలవడానికి వెళతాడు.

అక్కడ బాబీ మనుషులు కొందరు బాబూఖాన్ ను తీవ్రంగా గాయపరిచి తన మీద కూడా దాడి చేస్తారు. తాను తిరగబడగా వాళ్ళు ఓ ఫోను అక్కడ పారేసి వెళ్ళిపోతారు. ఆఫోను ఒక పేరులేని నంబర్ల నుండి అసలు చంపేశారా లేదా అని ఓ సందేశం వచ్చుంటుంది. ఆ వ్యక్తి ఇతనే అని జయ అతన్ని తీసిన ఫోటో ఉంటుంది. అప్పుడు రిషి ఏసీపీ జయ తనను చంపడానికి ప్రయత్నిస్తుందని తెలుసుకుంటాడు. రిషి జయను వెతుక్కుంటూ ఆమె ఫాం హౌస్ కి వెడతాడు. అక్కడ ఆమెను వెతుకుతుండగా జయ తనకు గన్ను గురిపెడుతుంది. అతను ఆమెను నిలదీయగా రియా తన దగ్గరే ఉన్నదని బదులిస్తుంది. లేకపోతే కార్తీక్ ఏర్పాటు వలన రియా చనిపోయి ఉండేదనీ, అందులోనూ తనకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని అందుకనే రియాను తన దగ్గరే ఉంచుకున్నానని చెబుతుంది. కార్తేకే రియాని మాయం చేసి అందరి కళ్ళు కప్పాడని తెలుస్తుంది. రియా నిజానికి కార్తీక్ కూతురు కాదని, అందుకనే ఆమెను చంపి శ్వేతను చిత్రవధ చేశాడనీ చెబుతుంది. ఈలోపు రవి చౌదరి వచ్చి ఎసిపిని కాల్చి చంపడంతో రిషి గాయాలతో బయటపడతాడు. చివరికి రియా తన కూతురేనని రిషికి తెలియడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

విడుదల, ఆదరణ

ఈ సినిమా పోస్టరు ఫిబ్రవరి 10, 2016 న విడుదలై ప్రేక్షుకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫిబ్రరి 26, 2016 న విడుదలై విమర్శకుల నుంచి మంచి ప్రశంసలనందుకుంది.[2][3] ఐడిల్ బ్రెయిన్ ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వగా[4] ది హిందూ దినపత్రిక 4 స్టార్లు ఇచ్చింది.[5]

పురస్కారాలు

సైమా అవార్డులు

2018 సైమా అవార్డులు

  1. ఉత్తమ సహాయనటి (అనసూయ)

మూలాలు