క్షేమేంద్రుడు

క్షేమేంద్రుడు సా.శ. 11 వ శతాబ్దంలో కాశ్మీర దేశానికి చెందిన సంస్కృత కవి, అలంకారికుడు, నాటక కర్త. ఇతను గొప్ప అలంకారికుడైన అభినవగుప్తుని శిష్యుడు. కాశ్మీర రాజు అనంతుని ఆస్థాన కవి. క్షేమేంద్రుడు వివిధ విషయాలపై సుమారు 33 గ్రంథాలు రాసాడని ప్రతీతి. ఇతని గ్రంథాలలో సంస్కృతంలోని బృహత్కథామంజరి, రామాయణ మంజరి, భారత మంజరి, ఔచిత్య విచార చర్చ, కళావిలాస, నర్మమాల, భోదిసత్వ అవదాన కల్పలత, చారుచర్య వంటి గ్రంథాలు ప్రసిద్ధిపొందాయి. సాహిత్యంలో ఏదో ఒక అంశానికి చెందిన రచనలకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న క్షేత్రాలలో లోతైన పరిజ్ఞానంతో సాహితీ రచనలను చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి క్షేమేంద్రుడు.

జీవిత విశేషాలు

సా.శ. 1050 ప్రాంతంలో జీవించిన క్షేమేంద్రుడు కాశ్మీర్ దేశంలో ఒక కులీన సాంప్రదాయుక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[1] ఇతని తండ్రి ప్రకాశేంద్రుడు. వీరు ఒకప్పుడు కాశ్మీర దేశాన్ని ఏలిన జయాపీడుని యొక్క మంత్రి అయిన నరేంద్రుని వంశానికి చెందినవారు.[2] ఉన్నత కుటుంబీయుడు కావడంతో క్షేమేంద్రుడు బాల్యం నుండే చక్కని శిక్షణ పొంది కవిత్వంలో మంచి ప్రతిభను కనపరిచాడు. గొప్ప అలంకారికుడు, శైవ దార్శనికుడు అయిన అభినవ గుప్తునికి శిష్యుడైనాడు.[1] జన్మతా శైవుడైనా తరువాతి కాలంలో వైష్ణవానికి మారాడు. వైష్ణవంతోపాటు బౌద్ధంపై గ్రంథాలు రచించాడు. కాశ్మీర రాజు అనంతు (సా.శ. 1024-33) ని కాలంలోనూ, అతని పుత్రుని (క్రీ. శ. 1033-89) కాలంలోనూ ఆస్థాన కవిగా ఉన్నాడు.[3] ఇతనికి వ్యాసదాసు అనే పేరుకూడా ఉంది. బహుశా భారతమంజరి రచనానంతరం క్షేమేంద్రుడు తన గ్రంథాలలో తనను తాను 'వ్యాసదాసు'నిగా అభివర్ణించుకొనివుండవచ్చు. [2]

రచనలు

క్షేమేంద్రుడు సుమారు 33 గ్రంథాలు రాసాడని ఒక ప్రతీతి. ప్రస్తుతం వీటిలో 18 గ్రంథాలు లభ్యమవుతున్నాయి. మరో 22 గ్రంథాలు అలభ్యాలు. వీటికి సంబంధించి ఇతర సాహిత్య గ్రంథాలలో కేవలం ఉటంకనలు, సూచనలు మాత్రమే లభిస్తున్నాయి. క్షేమేంద్రుని రచనలు

సంక్షిప్త రచనలు

  • బృహత్కథామంజరి — ఇది గుణాడ్యుని 'బృహత్కథ'కు సంక్షిప్తరూపం (సంస్కృతం)
  • రామాయణమంజరి — ఇది రామాయణానికి సంక్షిప్తరూపం (సంస్కృతం)
  • భారతమంజరి — ఇది మహాభారతానికి సంక్షిప్తరూపం (సంస్కృతం)

అలంకార గ్రంధాలు

  • ఔచిత్య విచార చర్చ
  • కవికంఠాభరణం
  • సువృత్తతిలకం

వ్యంగ్య రచనలు

  • కళావిలాస
  • సమయ మాత్రిక (సంస్కృతం)
  • నర్మమాల
  • దేశోపదేశ

సందేశాత్మక గ్రంధాలు

  • చారుచర్య
  • నీతికల్పతరు
  • చతుర్వర్గసంగ్రహ
  • దర్పదళన
  • సేవ్యసేవకోపదేశ
  • లోకప్రకాశ
  • స్థూపపవదన

భక్తీ రచనలు

  • భోదిసత్వ అవదాన కల్పలత — ఇది భోదిసత్వుని 106 అధ్బుత పురాణ కథల సమాహారం (ఇంగ్లిష్)
  • దశావతార చరిత్ర — ఇది విష్ణువు దశావతారాల చరిత్రకు కావ్యరూపం (సంస్కృతం)

పైవి మాత్రమే కాక క్షేమేంద్రుడు క్రింది రచనలను కూడా చేసినట్లు తెలుస్తున్నది.[3] ఇవి అలభ్యాలు.

  • పద్యకాదంబరి — ఇది బాణుని కాదాంబరికి కావ్యరూపం
  • శశివంశమహాకావ్యం
  • అమృతతరంగకావ్యం
  • చిత్రభారతం — (నాటకం)
  • కనకజానకి — (నాటకం)

అంచనా

క్షేమేంద్రుని సాహితీ ప్రతిభ విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించడంలోనే కాక విభిన్న అంశాలకు చెందిన గ్రంథాలను చక్కని నైపుణ్యంతో స్పృజించడంలో కూడా ఉంది. ముఖ్యంగా బృహత్ గ్రంథాలను సంక్షిప్తపరచడంలోనూ అందులోను సరళ సులభశైలిలో వాటిని రూపొందించడంలో క్షేమేంద్రుడు చక్కని కౌశలం ప్రదర్శించాడు. రామాయణ, మహాభారత బృహత్కావ్యాలను సులభంగా చదవడానికి వీలుగా సంక్షిప్త రూపంలో 'రామాయణమంజరి', 'భారతమంజరి'లను రచించాడు. వీటన్నిటికి మించి ఆతను సంస్కృత సారస్వతానికి అందించిన అవిరళకృషి నాశనమైపోయిన మూల 'బృహత్కథ'ను పునర్జీవింపచేయడంలో ఉంది. పైశాచీ భాష (పాకృత భాషకు అపభ్రంశరూపం) లో వున్న గుణాడ్యుని బృహత్కతను క్షేమేంద్రుడు సంక్షిప్త పరచి సంస్కృతంలో బృహత్కథామంజరిగా రచించాడు. పద్యరూపంలో వున్న దీనిలో 7500 శ్లోకాలున్నాయి.[3]

శైవం నుంచి వైష్ణవంలోనికి మారిన కవి అయినప్పటికి, మతసఖ్యతతో బౌద్ధవిశ్వాసాల కనుగుణంగా గ్రంథ రచనలు చేసాడు. తద్వారా ఒక వైపు కవిగా, మరోవైపు రచనలలో మతపరమైన సఖ్యతను (Religious harmonizer) కోరుకొన్నవానిగా కనిపిస్తాడు.

క్షేమేంద్రుని జీవించివున్న కాలం నాటికి కాశ్మీర్‌లో రాజకీయంగా తీవ్రమైన అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. సంఘంలోనూ, ప్రజలలోను ఎటుచూసినా అవినీతి, నీతి బాహ్యత పెచ్చుపెరిగాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకోసం సందేశాత్మకమైన నీతికథలను రచించాడు. వీటన్నింటికీ మించి సంఘంలో వున్న కుళ్ళును ఎండగడుతూ, వ్యక్తులలోను వున్న అంతర్గత బలహీనతలను ఎత్తిచూపుతూ చక్కని హాస్యంతో వ్యంగ్య రచనలు చేసాడు. తన 'కళావిలాస'లో మనుష్యులలో వున్న అంతర్గత బలహీనతలను స్వలాభానికి వాడుకొనే విధానాలను వ్యంగ్యాత్మకంగా చిత్రిస్తాడు. ఒక వేశ్య, ఉద్యోగి, కమ్మరి, ఇలా సమాజంలోని దాదాపు అన్ని వర్గాలను వారి మాటలను, చేతలను అంతర్‌దృష్టితో వివరిస్తాడు. ఇతని మరో వ్యంగ్య రచన 'నర్మమాల'లో ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్న ఆనాటి ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని శక్తివంతంగా చీల్చి చెండాడటం కనిపిస్తుంది. నాటి పాలనలో కొలువు తీరిన ఉద్యోగులు ప్రధానంగా కాయస్థ కులాలవారే. అవినీతికి పరాకాష్ఠగా వున్న లంచగొండి ఉద్యోగులను ప్రజల రక్తం పీల్చి బతికేవారుగా, కుళ్ళిన సర్పంపై ముసిరే ఈగలుగా వర్ణిస్తాడు. సమాజంలో కుళ్ళును పెంచుతున్న కాయస్థకులాల పాత్రపై క్షేమేంద్రుని వ్యాఖ్యలు తరువాతి కాలంలోని సుప్రసిద్ధ కాశ్మీరీ చరిత్రకారుడు కల్హణుని దృష్టిని కూడా ఆకర్షించాయి.

ఒక విధంగా క్షేమేంద్రుడు తాను జీవించి వున్న కాలంలో నాటి అరాచక పరిస్థితుల నేపథ్యంలో తన చుట్టూ వున్న సంఘాన్ని, అన్ని వర్గాల ప్రజా జీవితాలను దగ్గరనుండి పరిశీలించి నాటి సాంఘిక జీవన విధానాన్ని తన రచనలలో ప్రతిఫలించాడు. ప్రజా కవిగా పేరుపొందాడు.

రిఫరెన్సులు

మూలాలు

  1. 1.0 1.1 Haksar 2011, p. xv.
  2. 2.0 2.1 Warder 1992, p. 365.
  3. 3.0 3.1 3.2 ముదిగంటి, గోపాలరెడ్డి; ముదిగంటి, సుజాతారెడ్డి. సంస్కృత సాహిత్య చరిత్ర (2002 ed.). హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 279. Retrieved 26 July 2017.