గుంటుపల్లి (కామవరపుకోట)

కొండపైనున్న గుంటుపల్లి బౌద్ధ గుహాలయాల స్వాగత తోరణం
గుంటుపల్లి (కామవరపుకోట)
గుంటుపల్లి (కామవరపుకోట) is located in ఆంధ్రప్రదేశ్
గుంటుపల్లి (కామవరపుకోట)
గుంటుపల్లి (కామవరపుకోట)
అక్షాంశ రేఖాంశాలు: 17°0′13.9273″N 81°8′18.1046″E / 17.003868694°N 81.138362389°E / 17.003868694; 81.138362389
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
మండలంకామవరపుకోట
విస్తీర్ణం5.02 కి.మీ2 (1.94 చ. మై)
జనాభా
 (2011)[1]
4,113
 • జనసాంద్రత820/కి.మీ2 (2,100/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,086
 • స్త్రీలు2,027
 • లింగ నిష్పత్తి972
 • నివాసాలు1,206
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534449
2011 జనగణన కోడ్588189

గుంటుపల్లి, ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కామవరపుకోట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామం చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. ఈ రెవెన్యూ గ్రామ పరిధిలో మూడు కి.మీ. దూరంలోని జీలకర్రగూడెం దగ్గర కొండపైన సా.శ.పూ.3వ శతాబ్ది కాలపు బౌద్ధ క్షేత్రం అవశేషాలున్నాయి. ఇవి గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధిచెందాయి. గుంటుపల్లిని తొలుత బౌద్ధ క్షేత్రంగానే భావించినా, తరువాత లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనం, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని తెలుస్తున్నది.

చరిత్ర

గుంటుపల్లి సా.శ.పూ.3వ శతాబ్ది కాలంలో ప్రముఖ బౌద్ధక్షేత్రం.[2]

జనగణన వివరాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1206 ఇళ్లతో, 4113 జనాభాతో 502 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2086, ఆడవారి సంఖ్య 2027.[3]

గుంటుపల్లి, జీలకర్ర గూడెం, ఇతర శివారు గ్రామాలతో కలిపి 2001 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1146 ఇళ్లతో, 4136 జనాభాతో 808 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2136, ఆడవారి సంఖ్య 2000.[4]

పరిపాలన

గుంటుపల్లి, జీలకర్రగూడెం పంచాయితీ ఆఫీసు

గ్రామ పంచాయితీ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, అనియత విద్యా కేంద్రం కామవరపుకోటలోను, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు జంగారెడ్డిగూడెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరు లోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి జీలకర్ర గూడెం చేరవచ్చు. ఏలూరు నుండి కామవరపుకోట వెళ్ళి అక్కడనుండి సుమారు 5 కి.మీ దూరంలో జీలకర్రగూడెం చేరవచ్చు.

భూమి వినియోగం

2011 జనగణన ప్రకారం, భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 43 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 10 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1 హెక్టార్లు
  • బంజరు భూమి: 103 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 343 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 93 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 354 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 123 హెక్టార్లు
    • చెరువులు: 52 హెక్టార్లు
    • వాటర్‌షెడ్ కింద: 178 హెక్టార్లు

ఉత్పత్తులు

ఎర్రమట్టి కలిగిన కొండల అంచున ఉన్న ఈ గ్రామాలలో టేకు, కొబ్బరి, పామాయిల్, మామిడి, సపోటా, జీడిమామిడి సాగు చేస్తారు.. చెరువు క్రింద వరి సాగు చేస్తారు.

పర్యాటక ఆకర్షణలు

బౌద్ధ క్షేత్రం

చారిత్రిక ప్రాధాన్యత

పెద్ద బౌద్ధ విహారం గదుల సముదాయం
చిన్న బౌద్ధ విహారం గదులు
ఆంధ్రదేశంలో బౌద్ధక్షేత్రాలలో గుంటుపల్లి (కామవరపుకోట) ఒక ప్రముఖ క్షేత్రం
వివిధ కట్టడాలను వివరించే బోర్డు - పురావస్తు పరిశోధనా సంస్థ వారిది

ఆంధ్రప్రదేశ్ లో బుద్ధుని కాలంనుండి బౌద్ధమతం జనప్రియమైన జీవనవిధానంగా విలసిల్లింది. ఆంధ్ర ప్రదేశ్ లో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాలలో బహుశా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైంది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందింది. అంటే సా.శ.పూ.3వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు.[2] గుంటుపల్లిని ఇటీవలి వరకు బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ ఇటీవల లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనము, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమౌతుంది.[5] గుంటుపల్లి వూరి కొండలపైన కనుగొన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.[6] కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరికింది. ఈ తీర్థం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనుపించే పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం. కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్థనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు సా.శ.పూ. 300 నుండి సా.శ. 300 మధ్యకాలంలో విస్తరిల్లినవని భావిస్తారు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం - వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషిస్తున్నారు. (బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించారు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమితమవ్వాలి కాని రసానుభూతి కాదు - మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ అంత కఠినంగా ఉండేది.[2]) జీలకర్రగూడెం, కంఠమనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధారామాలు కనుగొన్నారు.

బౌద్దారామ వివరాలు

గుహాలయం

సా.శ.పూ. 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైంది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపం (ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తారు), చుట్టూరా ప్రదక్షిణా మార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు (చెక్క మందిరాలకు వలే) చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహారులోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలున్నాయి.బాగా మందంగా, లావుగా స్తంభం వలె ఉండే స్థాణువునే ధర్మలింగేశ్వర స్వామి లింగంగా పూజిస్తున్నారు. అయితే పేరులో ధర్మ శబ్దం సాధారణంగా బౌద్ధంనే సూచిస్తుంది.అమరావతి (ధాన్యకటకం), భట్టిప్రోలు మొదలైన బౌద్ధక్షేత్రాల్లో లభించిన ధవళ స్తంభం వంటి స్తంభంపై ఇక్కడ లభించిన శాసనం బట్టి చుస్తే ఇది జైనక్షేత్రం అని పలువురి పరిశోధకుల అభిప్రాయం. ఆస్తంభం పై ఇలా వ్రాసి ఉంది. " మహారాజస, కళింగాధిప, మహిషకాధిపస, మహామేఖవాహనస, సిరిసనదస, లేఖకస చులగోమస మణ్డపోదానమ్- ఒరిస్సా హాధిగుంఫా (హస్తిగుహ) శాసనంలో కళింగరాజు ఖారవేలుని సైన్యాలు పశ్చిమంగా కృష్ణానదివైపు వెళ్ళి ఆవమూషికులతో (తెలుగునాటివారే) పోరినట్లు ఇందు అభిప్రాయం. లిపిని బట్టి ఇది సా.శ.పూ. 2వ శతాబ్దకాలం నాటిదని తెలుస్తుంది.ఇక్కడ ఉన్న స్తూపాలలో ఒకదానికి ఇటికి ఆవకవేదిక ఉన్నదట. దానిపైకి వెళ్ళెందుకు ఉన్న రాతిమట్లపై శిథిలాక్షరాలు సునద అనే ఆమె సుయజ్ఞనాధుని ఆనతన ఆ మెట్లు కట్టించెనని ఉంది.అలగ్జాండర్ రియా అనే పురావస్తు అధికారి ప్రప్రధంగా ఈ స్తూపాలను గుర్తించాడు.చైతన్యాలయంతో పాటు పెద్ద శిలాస్తూపం కూడా అతని పరిశోధనే. ఈ పెద్ద శిలా స్తూపం (ధర్మలింగేశ్వర) చుట్టూ ప్రదక్షిణమార్గం ఉంది.ఇది 8 అడుగుల ఎత్తులో కలదీ స్తూపం. ప్రదక్షిణ చేసినట్లుగా చుట్టు రాతిమెట్లు ఉండటం ఇక్కడ విశేషం.సాధారణంగా బౌద్ధక్షేత్రాల్లో ఆరాధనీయం స్తూపం. కాని ఇక్కడ ఆస్థానంలో ఎత్తైన ఇటికలవేదిక (సింహాసనం) ఉన్న సూచనల్లో ఆరాధ్యమూర్తిని వేదికపైన వుంచేవారనిపిస్తుంది. ఈవేదిక ముందు భాగాన మూడు గుళ్ళలో ఆచార్యుల రూపాలో, సాంకేతిక రూపాలో ఉండేవేమో అని అనుకొనవచ్చును! ఈ ఇటిక చైత్యం అమరావతి జగ్గయ్యపేట మొదలగు క్షేత్రాలలోని చైత్యాలయాలను పోలిఉన్నందున ఈ ఇటికల చైత్యాలయాలు సా.శ. 2వ శతాబ్ది కాలనికి నిర్మింపబడి ఉండవచ్చును. సాతవాహనుల ఆచార్యుడు నాగార్జుని నాటిది. ఈగుహాలయం ముఖద్వారం పురాతన బౌద్ధరామాల వలెనే గుర్రపులాడా (అర్ధచంద్రాకారం) కలిగి ఉంది.బీహారులోని బారాబర్ లోమశఋషి గుహాలయ ముఖద్వారం పోలికలోనే ఈముఖద్వారం నిర్మించబడింది.అయితే ఒకటే బేధం ఇక్కడ ముఖద్వారం ముందు ఉంటే అక్కడ వెనక ఉంది.అక్కడ అలంకార శిల్పం ఉంది. ఇక్కడ లేదు.మహారాష్ట్రలోని భాజ గుహాలయ ముఖద్వారం కూడా ఇక్కడ ముఖద్వారం వలెనే ఉంటుంది. సా.శ.పూ. 250 తర్వాతనే అశోకుడు గుహాలయ నిర్మాణకార్యక్రమాలు చేపట్టాడు.పోలికలను బట్టి గుంటుపల్లి బారాబర్ గుంఫలు రెండును అశోకుని కాలంనాటివనే చెప్పవచ్చును.అశోకుడు బౌద్ధం అవలింబించిక పూర్వమే (సా.శ.పూ.250) ఆంధ్రంలో బౌద్ధం ఉంది.అతిపురాతనమైన స్తూపాలు ఎత్తు తక్కువగా ఉండి ఎక్కువ స్థూలంగా ఉండేవంటారు. ఆలెక్కను పోల్చి చూస్తే ఇక్కడి స్తూపాలు బహుపురాతనమైనవని మరికొందరి పరిశోధకుల అభిప్రాయము. ఇక్షాకుల అనంతరం వేంగి నేలినది సాలంకాయనులు. వారి రాజధాని విజయవేంగీపురం. నేటి ఏలూరు తాలూకా వేగిదిబ్బలు. వారు బౌద్ధులుకారు. సూర్యోపాసకులు. కాని బౌద్ధవిరోధులు కారణే విషయం వారి పాలన కాలంలో గుంటుపల్లి క్షేత్రాలకు-తూర్పున బర్మాప్రాంతాలకు యాత్రికులు సుముద్రయానం చేసేవారని వైనముంది.ఆరేవు బంగాళాఖాతంలో కలిసిపోయినదని పరిశోధకుల అభిప్రాయం.అది నేటి కళింగ పట్నం.మహాకవి కాళిదాసు సమకాలికుడు, మహాపండితుడు అయిన దిస్నాగాచార్యుడు కొంతకాలం అజంతా క్షేత్రంలో ఉండి చరమకాలాన వేంగీ రాజధానికి ఉత్తరంగా ఉన్న క్షేత్రంలో సిద్ధిపొందిన వైనముంది. సా.శ.7వ శతాబ్దపు చైనా యాత్రికుడు యువాన చాంగ్ ఈ ఆచార్యుడినే పుసచెన్నా అని అన్నాడు. తర్వాత వేంగి నేలిన విష్ణుకుండినులు ఒకరిద్దరు బౌద్ధాన్ని పోషించారు.కాని వారి నాట ప్రారంభమైన జీర్ణావస్థ వేంగీచాళుక్యుల నాటికి పూర్తిగా శిథిలమై, వేంగీ నిర్మానుష్యమై పోయింది. గుంటుపల్లిలోనే కాదు వేంగిలో కూడా ఎక్కడా తాంత్రిక బౌద్ధం కనబడినట్లు కనబడదు.కావున ఇక్కడ క్షేత్రం పూర్వనామం వేంగిళ (వింగిల) అయిఉండునా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే?

పెద్ద బౌద్ధ విహారం / ఆరామం

ఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయం. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానం. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహలలోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.

మొక్కుబడి స్తూపాలు

కొండపైని వివిధ ఆకృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమారు అరవై మొక్కుబడి స్తూపాలున్నాయి. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠములపై నిర్మింపబడినవి. వీటిమధ్య మొక్కుబడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి.

రాతి స్తూపాలు

సా.శ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. సా.శ.పూ.19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికేవారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీ.

శిథిల మంటపం

ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో సా.శ.పూ.. 1 నుండి సా.శ.5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.

చైత్య గృహం

ఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తువరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంకృత అధిష్టానము నాసిక్, కార్లే గుహలను పోలి ఉంది.

ఇటుకల స్తూప చైత్యం

ఇది కూడా సా.శ.పూ.3-2వ శతాబ్దానికు చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎత్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను సా.శ.పూ. 2-1వ శతాబ్దానికి చెందిన ఒక ఉపాసిక కట్టించెనని తెలియవస్తున్నది. ఈ చైత్య గృహము 11మీ. వ్యాసం కలిగి ఉంది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపధం ఉంది.

ఇటీవల లభ్యమైనవి

ఇటీవల 2007 డిసెంబరు 4న ఈ గుహాసముదాయంలో సామాన్య శకారంభంనకు చెందినంగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమయినది. ఈశాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూసాయి.నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడి కారాలు,గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించింది. ప్రసిద్ధ బౌద్ధాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ధ సన్యాసి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ధ బిక్షులకు దానం చేసినట్లు ఈ శిలా ఫలకంలో ప్రాకృత భాషలో ఉంది. కేంద్ర పురావస్తుశాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలికి తీసింది.

కొండపైన మొక్కుబడి స్తూపాల చిత్రం

కొండపైన మొక్కుబడి స్తూపాలు, చిత్రం వెనుక భాగంలో ప్రధాన స్తూపం. కుడిప్రక్క చెట్టు క్రింద పురావస్తు త్రవ్వకాల కార్మికులు భోజనాలు చేస్తున్నారు. ముందుభాగంలో పిలల్లు క్రికెట్ ఆడుతుంటారు. (త్రవ్వకాలలో తీసిన పొడవాటి రాళ్ళు వికెట్‌లుగా వాడతుంటారు.)
కొండపైని మొక్కుబడి స్తూపాలు, చిత్రం వెనుక భాగంలో ప్రధాన స్తూపం. కుడిప్రక్క చెట్టు క్రింద పురావస్తు త్రవ్వకాల కార్మికులు భోజనాలు చేస్తున్నారు. ముందుభాగంలో పిలల్లు క్రికెట్ ఆడుతున్నారు.
(త్రవ్వకాలలో తీసిన పొడవాటి రాళ్ళు వికెట్‌లుగా ఉపయోగపడతాయి)

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. 2.0 2.1 2.2 డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన బౌద్ధము-ఆంధ్రము
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "పశ్చిమ గోదావరి జిల్లా జనాభా వివరాలు". Archived from the original on 2005-05-10. Retrieved 2007-12-05.
  5. Studies in Jaina art and iconography and allied subjects in honour of Dr. U ... By R. T. Vyas, Umakant Premanand Shah పేజీ.31 [1]
  6. http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp Archived 2014-06-25 at the Wayback Machine The complete list from West Godavari District is
    132. Mounds containing Buddhist remains - Arugolanu
    133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
    134. Buddhist monuments - 1) Rock-cut temple 2) Large Monastery 3) Small Monastery 4) Brick Chaitya 5) Ruined Mandapa 6) Stone built Stupa and Large group of stupas. - Guntupalle
    135. The caves and structural stupa of Archaeological interest on Dharmalingesvarasvami hill- Jilakarragudem (Hamlet of Guntupalle)
    136. The mounds of Pedavegi : Dibba No.1 Dibba No.2, Dibba No. 3, Dibba No. 4, Dibba No. 5. - Pedavegi
    137. Ancient Mounds - Pedavegi

బయటి లింకులు