జె. వి. రాఘవులు
జెట్టి వీర రాఘవులు | |
---|---|
జననం | జె.వి.రాఘవులు 1930 తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం |
మరణం | జూన్ 7 , 2013 రాజమండ్రి |
ప్రసిద్ధి | తెలుగు సినిమా సంగీత దర్శకుడు |
మతం | హిందూ |
తండ్రి | వీరాస్వామినాయుడు, |
తల్లి | ఆదిలక్షి |
జె.వి.రాఘవులు ( జెట్టి వీర రాఘవులు ), తెలుగు సినిమా సంగీత దర్శకుడు. రాఘవులు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో వీరాస్వామినాయుడు, ఆదిలక్షి దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు. అందరి కంటే కొంచెం హుషారెక్కువ. అమ్మ పాడే భక్తి పాటలను శ్రద్ధగా వింటుండేవాడు.మెల్లమెల్లగా అతనికి సంగీతం అంటే మక్కువ మొదలైంది. ఈయన పక్క ఇంట్లో ఉండే వై.భద్రాచార్యులు గారి ద్వారా మొట్టమొదటిసారిగా సత్యహరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్రను పోషించే అవకాశం వచ్చింది.ఈ అవకాశాన్ని చాలా చక్కగా సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఓ పక్క చిన్న చిన్న వేషాలు వేస్తూనే, చదువును కొనసాగించారు. అలా మొత్తానికి ఎస్.ఎస్.ఎల్.సి పూర్తిచేసాడు. పై చదువులు చదవాలని ఉన్నా, చదివించే స్తోమత ఇంట్లొ వారికి లేదు. అందుకే కాకినాడలోని పి.ఆర్. కళాశాలలో పి.యు.సి.లో చేరి నెల రోజులకే మానేయాల్సి వచ్చింది.
ఓ రోజు ఉదయం రేడియో స్టేషనులో రాఘవులు పాట రికార్డింగ్ జరుగుతోంది. అక్కడే ఘంటసాల గారితో పరిచయం ఏర్పడింది. ఘంటసాల వద్ద సహాయకుడిగా ఆ రోజులలో నెలకు 100 రూపాయలకు సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవులు, తరువాత 1970లో రామానాయుడు దర్శకత్వం వహించిన ద్రోహి చిత్రంతో పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. ఆ సమయంలోనే ప్రేమనగర్ సినిమాలో "ఎవరికోసం ఈ ప్రేమ మందిరం" పాటకు ట్యూన్ చేసి ఇచ్చారు. తన అసిస్టంట్ పుహళేంది లేకపోతే ఏ పని చేయరు మహదేవన్. సరిగ్గా ఆ పాట సమయానికి పుహళేంది అందుబాటులో లేకపోవడంతో, రామానాయుడు గారు ఈ పాటకు ట్యూన్ కట్టమని రాఘవులను కోరారు. పాట పూర్తి అయ్యాక ఇటు రామానాయుడు గారు అటు మహదేవన్ గారు - ఇద్దరూ మెచ్చుకున్నారు. అలాగే ఈ సినిమాలో "మనసు గతి ఇంతే" పాటను కూడా ఈయనే స్వరపరిచారు. ఆ తరువాత 1973 వ సంవత్సరంలో శోభన్ బాబు, వాణిశ్రీ కలిసి నటించిన జీవన తరంగాలు సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంలో సంగీతం ప్రధాన భూమిక పోషించింది. ఈ సినిమా విజయంతో ఇక ఈయన వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరంలేకపోయింది. మొత్తం 172 సినిమాలకు సంగీతం సమకూర్చిన ఈయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో బొబ్బిలి పులి, కటకటాల రుద్రయ్య వంటి చిత్రాలు ఉన్నాయి.
చిత్రసమాహారం
- పెళ్ళి పందిరి (1966)
- ద్రోహి (30 డిసంబర్ 1970)
- కాదలిక్క వాంగ (తమిళం) (1971)
- జీవన తరంగాలు (1973)
- దొరబాబు (1974)
- మన ఊరి కథ (1976)
- సావాసగాళ్ళు (1977)
- భలే అల్లుడు (1977)
- మనసాక్షి (1977)
- పట్న వాసం (1978)
- కటకటాల రుద్రయ్య (1978)
- ఆత్మీయుడు (1978)
- శభాష్ గోపి (1978)
- చిరంజీవి రాంబాబు (1978)
- రంగూన్ రౌడి (1979)
- బాబులుగాడి దెబ్బ (1984)
- బంగారు కాపురం 1984
- ఆడపిల్ల (1991)
- కామ్రేడ్ (1996)
మరణం
అనారోగ్యంతో బాధపడుతూ 7 జూన్ 2013 న రాజమండ్రి లోని తన స్వగృహంలో మరణించారు.[1]
బయటి లింకులు
- 2008లో చిమటామ్యూజిక్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన జె.వి.రాఘవులు సన్మాన సభ చిత్రాలు
- ఈనాడు పత్రికలో జె.వి.రాఘవులుపై వ్యాసం
మూలాలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-06. Retrieved 2013-06-07.