పత్థర్ కా గోష్త్

పత్థర్ కా గోష్త్
మూలము
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంతెలంగాణ
వంటకం వివరాలు
వడ్డించే విధానంMain
ప్రధానపదార్థాలు మేక మాంసం

పత్థర్ కా గోష్త్ ఒక ప్రసిద్ధ హైదరాబాదీ మాంసాహార వంటకము.

చారిత్రక నేపధ్యము

1655 ప్రాంతలో సామ్రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ పీఠభూమి వైపు పయనమయ్యాడు. అసఫ్‌జాహీల పూర్వీకుడైన ఖ్వాజా ఆబిద్‌ను ఈ ప్రాంతానికి మొఘల్ సామ్రాజ్య ప్రతినిధిగా నియమించాడు. మొఘల్ సేనలు హైదరాబాద్‌లో చొరబడ్డాయి. స్వతహాగా భోజనప్రియులైన మొఘల్ సైనికులు నోరూరించే పాత వంటకాలెన్ని ఉన్నా.. కొత్త వాటి కోసం ఆవురావురంటూ ఉండేవారు. వీలు చిక్కినప్పుడల్లా వేటలో మునిగే వీరు.. అదే క్రమంలో యథాలాపంగా చేసిన వంటకమే పత్థర్ కా గోష్త్. ఒకసారి వేటకు వెళ్లిన బృందం అడవిలో దారితప్పింది. వెంట ఆహార పదార్థాలు లేకపోవటంతో ఆకలితో నీరసించిపోయింది. వంట పాత్రలు కూడా లేకపోవటంతో వంట కూడా ఇబ్బందిగా మారింది. గత్యంతరం లేక ఆదిమానవుడి శైలిలో ప్రయత్నం చేశారు. కర్రలతో నిప్పురాజేసి దానిపై వెడల్పాటి బండ (పత్తర్, రాయి) ఉంచి అది బాగా వేడెక్కాకా మాంసపు ముక్కలను ఉంచి కాల్చుకుని తిన్నారు. ఆ మాంసం బాగా రుచిగా అనిపించేసరికి... దానికి మసాలా దట్టించి వండుకోవడం మొదలెట్టారు. వేట సమయంలో అలా వండుకోవటాన్ని అలవాటుగా చేసుకున్నారు. తర్వాత మామూలు రోజుల్లోనూ ఆ వంటకం షాహీ దస్తర్‌ఖానాలో భాగమైంది. అలా మొదలైన వంటకమే ' పత్థర్ కా గోష్త్ ' గా రూపుదిద్దుకుంది.

హైదరాబాద్ లో

హైదరాబాద్ ఇప్పటికీ భోజనశాలల్లో ప్రత్యేక రాయి కింద నిప్పులు ఉంచి రెండు గంటలపాటు వేడి చేసి మసాలా దట్టించిన మాంసం ముక్కలు ఉంచి తయారు చేస్తారు. రాతిపైన వండితేనే దానికి ఆ రుచి వస్తుంది. ఈ వంటకంలో నూనె చాలా తక్కువగా వాడుతున్నందున ఆరోగ్యానికి కూడా హాని ఉండదని భోజనప్రియులు అంటారు. ‘బిర్యానీ, ఇరానీ చాయ్ అంటే హైదరాబాదీలకు ఎంతో మమకారం. కానీ అవి మన సొంత వంటలు కాదు. పర్షియావి. పత్థర్ కా గోష్త్ మాత్రం హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్నదే. దీని రుచి అమోఘం. మాంసం ముక్కలకు కారం, ఉప్పు, మిరియాల పొడి, ఇతర సాధారణ మసాలా దినుసులు దట్టించి పక్కనుంచుతారు. రెండు గంటల పాటు నిప్పులతో బాగా వేడి చేసిన బండపై ఉంచి కాలుస్తారు. దీనికి నూనె అవసరం కూడా చాలా తక్కువ. రాతిపై కాల్చిన ముక్కలు ఎంతో రుచిగా ఉంటాయి. చాలామంది దీన్ని తినేందుకు పాతనగరానికి వస్తారు.

రాయి విషయంలో జాగ్రత్తలు

ఈ వంట కోసం హోటళ్లలో ప్రత్యేక రాయిని వినియోగిస్తారు. బ్లాక్ గ్రానైట్ అయితేనే దీనికి అనుకూలంగా ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు. నిప్పులపై దాదాపు రెండు గంటల పాటు వేడెక్కాల్సి ఉన్నందున మామూలు రాయి ఆ తీవ్రతను భరించలేదని, అదే బ్లాక్ గ్రానైట్ ఆ వేడిని తట్టుకుని నిలుస్తుంది.

బయటి లంకెలు