పార్శ్వపు తలనొప్పి

పార్శ్వపు తలనొప్పి
ప్రత్యేకతNeurology Edit this on Wikidata
తరుచుదనము12.6%

పార్శ్వపు తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలామంది పార్శ్వనొప్ప తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. ఈ రకం తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. వాస్తవానికి ఇవన్నీ పార్శ్వనొప్పిని ప్రేరేపించేవేగానీ.. పార్శ్వనొప్పికి మూలకారణాలు కావు. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఎవరికైనా ఉంటే మనకూ రావచ్చు. పురుషుల్లోనూ ఉండొచ్చుగానీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ. ఈ పార్శ్వనొప్పిని శాశ్వతంగా తగ్గించే మందేదీ లేదు. కాకపోతే దీన్ని తగ్గించి, నియంత్రించేందుకు మంచి చికిత్సలున్నాయి. ఇలా నియంత్రణలో ఉంచితే కొన్నాళ్లకు దానంతట అదే పోతుంది. కానీ మళ్లీ కొంతకాలం తర్వాత రావచ్చు.

వ్యాధి కారణాలు

  • పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.
  • డిప్రెషన్, నిద్రలేమి
  • కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల
  • అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.
  • స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది.
  • గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు. ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
  • ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాడినప్పుడు కూడా రావచ్చు.

మైగ్రేన్ దశలు - లక్షణాలు

  • సాధారణంగా 24 - 72 గంటల్లో దానంతట అదే తగ్గవచ్చు.
  • ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు
  • మైగ్రేన్‌నొప్పి 4 దశలలో సాగుతుంది.
  1. ప్రొడ్రోమ్ దశ : ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.
  2. ఆరా దశ : ఈ దశ నొప్పి ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు మందగించడం, జిగ్ జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన ఫీలింగ్, మాటల తడబాటు, కాళ్ళలో నీరసం ఉంటాయి.
  3. నొప్పిదశ : ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతులు ఉంటాయి. చాలా వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి చాలా సున్నితంగా అంటే చికాగ్గా అనిపిస్తుంది.
  4. పోస్ట్‌డ్రోమ్ దశ : నొప్పి తగ్గిన తర్వాత కొద్దిరోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది.

వ్యాధి నిర్ధారణ

  • రక్త పరీక్షలు-సీబీపీ, ఈఎస్‌ఆర్
  • రక్తపోటును గమనించడం
  • ఈఈజీ పరీక్ష
  • సిటీ స్కాన్ (మెదడు)
  • ఎంఆర్‌ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి.

మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మానసిక ఆందోళనలు తగ్గించాలి.
  • అతిగా ఆలోచనలు చేయకూడదు.
  • మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి.ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లక్షిస్తుంది.
  • తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు సేదతీరుతాయి.
  • తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతి లేనిచోట నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.

పార్శ్వనొప్పి ఎప్పుడన్నా ఓసారి వేధిస్తుంటే, ఆ నొప్పి వచ్చినప్పుడు సాధారణ పెయిన్‌ కిల్లర్లు తీసుకుంటే సరిపోతుంది. వీటితో నొప్పి వెంటనే తగ్గుతుంది. అలా కాకుండా నొప్పి మరీ తరచుగా వస్తూ తీవ్రంగా వేధిస్తుంటే మాత్రం.. కొంతకాలం పాటు కొన్ని ప్రత్యేక తరహా మందులు తీసుకోవటంతో ఫలితం ఉంటుంది. ఈ ప్రత్యేక చికిత్సకు చాలా రకాల మందులున్నాయి. వీటిని వ్యక్తి లావు-సన్నం, స్త్రీలు-పురుషులు, పిల్లలు-వృద్ధులు... ఇలా రకరకాల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తారు. తలనొప్పి మరీ తీవ్రంగా రోజువారీ పనిని దెబ్బతీస్తూ, తరచూ వేధిస్తుంటేనే ఈ తరహా ప్రత్యేక మందులు ఇస్తారు. రెండు మూడు నెలలకోసారి వస్తుంటే.. అది వచ్చినప్పుడు సాధారణ పెయిన్‌ కిల్లర్లు సరిపోతాయి. నెలకు రెండు మూడుసార్లకంటే ఎక్కువగా వస్తున్నా, ఒక్కసారే వచ్చి మరీ ఎక్కువసేపు వేధిస్తున్నా అప్పుడీ ప్రత్యేక మందుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

మందులు