పొట్టి శ్రీరాములు
అమరజీవి పొట్టి శ్రీరాములు (ఆంధ్రా జాతిపిత) | |
---|---|
జననం | [1] పడమటిపల్లి, నెల్లూరు జిల్లా,మద్రాస్ ప్రెసిడెన్సీ,బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం)నెల్లూరు జిల్లా, ఆంధ్ర, భారతదేశం | 1901 మార్చి 16
మరణం | 1952 డిసెంబరు 15 [1] మద్రాసు |
మరణ కారణం | ఆమరణ నిరాహారదీక్ష |
నివాస ప్రాంతం | నెల్లూరు / మద్రాసు |
ఇతర పేర్లు | అమరజీవి |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు రాజకీయ నాయకుడు |
మతం | హిందూ |
తండ్రి | గురవయ్య |
తల్లి | మహాలక్ష్మమ్మ |
అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల
~ సామవేదం జానకిరామ శర్మ
పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 - 1952 డిసెంబరు 15) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.
జీవిత విశేషాలు
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.[2] వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లా లోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామం.(అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పడలేదు. కనిగిరి,పడమటిపల్లె నెల్లూరు జిల్లా లో ఉండేవి.) ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు.
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
స్వాతంత్రోద్యమంలో పాత్ర
పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-1942 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని గురువు ప్రపంచానికే గురువు, సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, కులపతి (గాంధీ) ఆదరాన్నీ చూరగొన్నాడు." [1]
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-1944 లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశాడు - "హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)". - 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది.[3]
జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు.
ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష
మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.[4]
రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం... పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు 5వ తేదీనాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు. [ఆధారం చూపాలి]
- ఆఖరు రోజు
డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!! ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 15.8 కేజీలు బరువు తగ్గారు.[5] నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా... చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.
పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడమీద బొగ్గు తో " పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి" అని రాసేరు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది.
దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూ కు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టిశ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.
ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు. [ఆధారం చూపాలి]
- పర్యవసానాలు
పొట్టి శ్రీరాములు, ప్రాణాలర్పించటంతో ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసు లో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించాడు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.
స్మరణలు
- మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది.
- ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది.
- నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.
- అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు 2000 మార్చి 16 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.[6]
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 "హిందూ పత్రికలో వ్యాసం". Archived from the original on 2003-06-28. Retrieved 2008-07-25.
- ↑ జానమద్ది, హనుమచ్ఛాస్త్రి (1994). " పొట్టి శ్రీరాములు". సుప్రసిద్ధుల జీవిత విశేషాలు. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. వికీసోర్స్.
- ↑ హిందూ పత్రికలో ఈ వ్యాసం Archived 2003-07-01 at the Wayback Machine --11/11/2002 - The martyr of Telugu statehood
- ↑ తుర్లపాటి, కుటుంబరావు (2012). " ఆత్మకథ విషయపేజీలు". నా కలం - నా గళం. సుందర శేషమాంబ పబ్లికేషన్స్. వికీసోర్స్.
- ↑ బీఎస్ఎన్, మల్లేశ్వరరావు (2018-03-16). "'అమరజీవి' పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి? ఈ దీక్ష ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసమా? మద్రాసు నగరం కోసమా?". బీబీసీ.
- ↑ "అమరజీవి పొట్టి శ్రీరాములు". STAMPS OF ANDHRA. 20 October 2013. Retrieved 24 July 2021.