పోలవరం ఎస్టేట్

శ్రీ రాజా KRV కృష్ణారావు బహదూర్, పోలవరం జమీందార్.

పోలవరం ఎస్టేట్ మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని గోదావరి జిల్లా లోని జమీందారీ ఎస్టేట్‌లలో ఒకటి. 1905 లో ఈ ఎస్టేటు, పోలవరం డివిజన్‌లో భాగంగా గోదావరి ఏజెన్సీకి నైరుతి వైపున నదికి కుడి ఒడ్డున ఉండేది.[1] 1802-03 శాశ్వత పరిష్కారంలో డివిజన్ మొత్తాన్నీ పోలవరం ఎస్టేట్‌లో చేర్చారు. దాని మొత్తం గ్రామాలలో 24 మాత్రమే జమీందారీ భూమి. వీటిలో పన్నెండు పోలవరం, పట్టిసం ఎస్టేట్‌లలో ఉండేవి. ఐదు గూటాల ఎస్టేట్‌కు చెందినవి కాగా, నాలుగు గంగోలు ఎస్టేట్‌కు చెందినవి. బయ్యనగూడెం, బిల్లుమిల్లి, జంగారెడ్డిగూడెం ముఠాల్లో ఒక్కో గ్రామం ఉండేది. ఈ మూడు ముఠాలూ కలిసి ఒక ఎస్టేటుగా ఉండేవి.

శాశ్వత సెటిల్‌మెంట్ నుండి 1843 వరకు జమీందారీ ఎస్టేట్లు

1802-03లో శాశ్వత పరిష్కారం సమయంలో, మొగల్తూరు, కోరుకొండ వంటి కొన్ని ఎస్టేట్లను బకాయిల కారణంగా ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. వాటిని 26 యాజమాన్య ఎస్టేట్లుగా విభజించారు.[2] అప్పటికి పెద్దాపురం, పిఠాపురం, పోలవరం, కోట రామచంద్రపురం, వేగాయమ్మపేట, వేలంపాలెం, వెంకాయపాలెం, వెల్ల, తెలికచెర్ల, జలిమూడి, పాణంగిపల్లి, ఉండేశ్వరపురం, ముక్కామల, విలాస, జానుపల్లి, బంటుమిల్లి ఇలా 15 ప్రాచీన జమీందారీలు ఉండేవి. ఇవి కాకుండా రంప, తోటపల్లి, జడ్డంగి వంటి మరో మూడు మనసబ్దారీ ఎస్టేట్‌లు ఉండేవి.[3]

జమీందారీ కుటుంబం

కుటుంబ సభ్యులలో ఒకరైన వెంకట రాజు కృష్ణా, గోదావరి జిల్లాలలో ముఖ్యమైన, గౌరవప్రదమైన శేరిస్తదార్ పదవిని నిర్వహించాడు. ఆయనకు వెంకటరాయుడు, రామన్న, పెద్ద సుబ్బారాయుడు, చిన్న సుబ్బారాయుడు అనే నలుగురు కుమారులు. కుటుంబం అవిభాజ్యమైనందున, సోదరులందరూ కలిసే జీవించారు. తండ్రి వెంకట రాజు తన డబ్బుతో కృష్ణా జిల్లాలో ఒక చిన్న ఎస్టేట్ కొన్నాడు. అతని పెద్ద కుమారుడు, వేంకటరాయుడు, చాలా పలుకుబడి కలిగినవాడు. పెద్దయెత్తున ఆస్తులను సంపాదించాడు. కాలక్రమేణా అతని ధార్మికత, విశాల హృదయం, ఔదార్యాల కీర్తి చాలా దూరం వ్యాపించింది. అతను తన ప్రధాన కార్యాలయమైన రాజమండ్రి నుండి బెనారస్ వరకు దారి పొడవునా సత్రాలు నిర్మించాడు. కరువు కాలంలో పన్ను వసూలు చేయకుండా వదిలేశాడు. వెంకటరాయని తర్వాత, అతని భార్య ఎస్టేట్ నిర్వహించడం ప్రారంభించింది. అది పెద్దది కావడం వల్ల, అనుభవం లేకపోవడంతో ఆస్తులను కోల్పోయింది. వెంకటరాయని బంధువు జగన్నాధరావుకు ప్రస్తుత పోలవరం ఎస్టేట్, తాడువోయి, జంగారెడ్డి గూడెం, గణపవరం ఎస్టేట్‌లు, ప్రస్తుత గూటాల ఎస్టేటు ఉండేవి. ఈ ఎస్టేట్‌లు అప్పుడు ఇప్పుడున్నంతగా అభివృద్ధి చెందలేదు. ఆ కారణంగా వారు యజమానులకు శిస్తు సరిగా చెల్లించేవారు కాదు. గూటాల ఎస్టేట్ కుటుంబంపై ఆధారపడిన వెంకటరాయని దివాను చేతుల్లోకి వెళ్ళింది. జగన్నాధరావు ప్రస్తుత పోలవరం ఎస్టేట్‌ను తన వద్దే ఉంచుకుని జంగారెడ్డి గూడెం, తాడువ ఎస్టేట్‌లను పెద్ద సుబ్బారాయనికి, గణపవరం ఎస్టేట్‌ను రామన్నగారికి పంచాడు.

జగన్నాధరావుకు రామచంద్ర వెంకట కృష్ణారావు అనే కుమారుడు ఉన్నాడు. కృష్ణారావుకు వెంకట జగన్నాధరావు అనే కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వెంకట జగన్నాధ రావు 25 సంవత్సరాల వయస్సులో మరణించాడు. మరణించే ముందు అతను, తన భార్య కామయమ్మకు నచ్చిన పిల్లవాడిని దత్తత తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమె తన సోదరి కుమారుడు కృష్ణారావును దత్తత తీసుకుంది. కామయమ్మ దాన ధర్మాలకు పేరు పొందింది. కృష్ణారావు ముత్తాత అయిన పెద్ద నాగరాజారావు, మసూలిపట్నంలోని ప్రావిన్షియల్ కోర్టులో న్యాయవాది. అతను సంస్కృతం తెలుగులలో ప్రసిద్ధ కవి. అతను తెలుగులో శకుంతలా ప్రణయం రాసాడు. సంస్కృత పుస్తకాలపై అనేక వ్యాఖ్యానాలు చేసాడు.

మరింత చదవడానికి

  • గోదావరి/గెజిటీర్/పోలవరం డివిజన్ [1]
  • శ్రీ రాజః KRV కృష్ణారావు బహదూర్, పోలవరం జెమిందార్. [2] లో

ప్రస్తావనలు