ఫ్రెంచ్ విప్లవం

ఫ్రెంచ్ విప్లవం 1789 నుంచి 1799 మధ్యలో ఫ్రాన్స్ దేశంలో వచ్చిన సామాజిక, రాజకీయ విప్లవం. దీని ఫలితంగా ఫ్రెంచ్ కాన్సులేట్ ఏర్పడింది. ఫ్రెంచి విప్లవంలోని చాలా భావనలు ఉదారవాద ప్రజాస్వామ్యానికి మౌలిక సూత్రాలయ్యాయి.[1] ఆధునిక ఫ్రెంచ్ రాజకీయాలలోనూ ఆ విలువలు, వ్యవస్థ నేటికీ అమల్లో ఉన్నాయి.[2]

సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు కలగలిసి ఈ విప్లవానికి దారి తీశాయి. ఈ విప్లవానికి మునుపు ఫ్రాన్స్ లో అమల్లో ఉన్న రాజకీయ, సామాజిక వ్యవస్థ వీటి నిర్వహణలో విఫలమైంది. ఆర్థిక సంక్షోభం, సామాజిక దుస్థితుల వలన 1789 మే నెలలో ఫ్రాన్సులో వివిధ రంగాలకు చెందిన ప్రతినిథులతో కూడిన ఎస్టేట్స్ జనరల్ సమావేశమై జూన్ నెలలో దాన్ని నేషనల్ అసెంబ్లీ గా మార్చారు. జులై 14 న కొంతమంది సాయుధులు ఆయుధ సంపదను ముట్టడించడంతో అసెంబ్లీ కొన్ని సమూలమైన మార్పులు తెచ్చింది. వాటిలో ఫ్రాన్సులో భూస్వామ్య విధానం రద్దు, కాథలిక్ చర్చి ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం, హక్కులు ప్రకటించడం ముఖ్యమైనవి.

తర్వాతి మూడు సంవత్సరాలు రాజకీయ నియంత్రణ కోసం పోరాటాలు, దానికి తోడు ఆర్థిక సమస్యలు దేశాన్ని చుట్టుముట్టాయి. 1792 ఏప్రిల్ నెలలో ఫ్రెంచి విప్లవకారులను సైన్యం ఓడించింది. దీంతో రాచరికం రద్దు చేయబడి, సెప్టెంబరు నెలలో మొదటి ఫ్రెంచ్ గణతంత్ర రాజ్యం ఏర్పడింది. 1793 జనవరి నెలలో ఫ్రాన్సు రాజు 16 వ లూయిస్ ను బహిరంగంగా శిరచ్ఛేదం చేశారు.

1793 జూన్ నెలలో మరో తిరుగుబాటు చెలరేగడంతో రాజ్యాంగం రద్దు చేయబడింది. నేషనల్ కన్వెషన్ కొన్ని అధికారాలను పబ్లిక్ సేఫ్టీ కమిటీకి బదలాయించింది. 1794 జూలైలో ముగిసిన భయానక పాలనలో సుమారు 16000 మందికి మరణశిక్ష విధించబడింది. బయటి బెదిరింపులు, అంతర్గత వ్యతిరేకతతో బలహీనపడిన రిపబ్లిక్ 1795లో డైరెక్టరీ ద్వారా భర్తీ చేయబడింది. నాలుగు సంవత్సరాల తరువాత, 1799లో నెపోలియన్ బోనపార్టే నేతృత్వంలోని సైనిక తిరుగుబాటులో కాన్సులేట్ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది విప్లవ కాలానికి ముగింపుగా పరిగణించబడుతుంది.

మూలాలు

  1. Livesey 2001, p. 19.
  2. Fehér 1990, pp. 117–130.

ఆధార గ్రంథాలు