బి. బి. పాటిల్

భీమరావు బసవంతరావు పాటిల్
బి. బి. పాటిల్

బసవేశ్వర 883వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న బిబి పాటిల్


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2014 - 2019, 2019- ప్రస్తుతం
నియోజకవర్గం జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం నవంబర్ 1, 1955
సిర్పూర్, నిజామాబాదు జిల్లా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు హనుమాబాయ్ పాటిల్, బస్వాత్ రావు పాటిల్
జీవిత భాగస్వామి అరుణ బి. పాటిల్
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ

బి. బి. పాటిల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు.[1][2] 2014 నుండి భారత్ రాష్ట్ర సమితి తరపున జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3]

జననం, విద్యాభ్యాసం

మహాత్మ శ్రీ బసవేశ్వర 883వ జయంతి ఉత్సవంలో మాట్లాడుతున్న బిబి పాటిల్

పాటిల్ 1955, నవంబర్ 1న హనుమాబాయ్ పాటిల్, బస్వాత్ రావు పాటిల్ దంపతులకు నిజామాబాద్ జిల్లా, సిర్పూర్ గ్రామంలో జన్మించాడు.[4] మహారాష్ట్రలోని పరభానీలోని మరాఠ్వాడా అగ్రికల్చర్ కాలేజీలో బిఎస్సీ అగ్రికలర్చర్ చదివిన పాటిల్ వ్యవసాయ, వ్యాపారరంగాల్లో పనిచేశాడు.[5]

వ్యక్తిగత జీవితం

పాటిల్ కు అరుణతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు

2014లో తెలంగాణ రాష్ట్ర సమితిలో[6] చేరిన పాటిల్, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. 2014 మే నెలలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 16వ లోక్‌సభకు పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ షెట్కార్‌ను ఓడించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2014, సెప్టెంబరు 1న రోడ్డు రవాణా - హైవేలు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించబడ్డాడు.

2019 మే నెలలో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు పై 6166 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7] 2019, సెప్టెంబరు 13న వ్యవసాయ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించబడ్డాడు. 2019, అక్టోబరు 9న పార్లమెట్ సభ్యుల కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ-కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా నియమించబడ్డాడు.[5]

బీబీ పాటిల్ 2024 మార్చి 1న బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[8]

ఇతర వివరాలు

మలేషియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుకె, యుఎస్ఎ మొదలైన దేశాలు పర్యటించాడు.

మూలాలు