బ్రిటిషు భారతదేశంలో బిరుదు పతకాలు
భారతదేశంలో బ్రిటిషు పాలనలో కొన్ని అధికారిక బిరుదులను పొందిన భారతీయ పౌరులకు బిరుదు పతకాలను (బ్యాడ్జీలు) అందజేశారు. 1947 లో స్వాతంత్ర్యం తరువాత ఈ అవార్డులు ఇవ్వడం ఆగిపోయింది.
స్థాపన
ప్రముఖ భారతీయులకు బిరుదులు ప్రదానం చేసే వ్యవస్థ భారతదేశంలో బ్రిటిషు వారు రాకమునుపే ఉండేది. విస్తృత పురస్కారాల వ్యవస్థలో భాగంగా, బ్రిటిషు వారు ఈ సంప్రదాయ భారతీయ బిరుదులను స్థానిక భారతీయ పౌరులకు, వైస్రాయ్ నియమించిన భారతీయ సైన్యానికి నమ్మకమైన సేవ, ప్రజా సంక్షేమ చర్యలకు ప్రతిఫలంగా ప్రదానం చేసేవారు. [1]
1911 లో ఢిల్లీ దర్బార్ వేడుకలలో, కింగ్ జార్జ్ V, బిరుదు పొందిన వారు ధరించేందుకు పతకాల శ్రేణిని స్థాపించాడు. తద్వారా వారు పొందిన బిరుదును బహిరంగంగా ప్రదర్శించడానికి వీలు కల్పించాడు. [2] స్వాతంత్ర్యానంతరం 1947 లో అవార్డును తొలగించారు.
తరగతులు
బిరుదు పొందిన వారి మతాన్ని, కొన్నిసార్లు ప్రాంతాన్నీ ప్రతిబింబించేలా మూడు తరగతులున్నాయి. [3] [4]
మొదటి తరగతి
- సిక్కుల కోసం సర్దార్ బహదూర్ [a]
- దివాన్ బహదూర్, హిందువుల కోసం;
రెండవ తరగతి
- ఖాన్ బహదూర్, ముస్లింల కోసం;
- రాయ్ బహదూర్ (ఉత్తర భారతదేశం) లేదా రావు బహదూర్ (దక్షిణ భారతదేశం), హిందువుల కొరకు;
మూడవ తరగతి [b]
- ఖాన్ సాహిబ్, ముస్లింల కోసం;
- రాయ్ సాహిబ్ (ఉత్తర భారతదేశం) లేదా రావు సాహిబ్ (దక్షిణ భారతదేశం), హిందువుల కోసం.
ఇతర మతాలకు చెందిన వారికి, అత్యంత సముచితమైన బిరుదును ఇచ్చేవారు. ఉదాహరణకు హిందూ పేరుగా ధ్వనించే పేరున్న భారతీయ క్రైస్తవులకు హిందూ బిరుదును ఇచ్చేవారు. [5] యూదులకు ముస్లిం బిరుదును ఇచ్చేవారు. [6]
ప్రాధాన్యతా క్రమంలో ముందు బ్రిటిషు, భారతీయ ఆర్డర్లు, అలంకరణలు, తరువాత బిరుదు పతకాలు, ఆ తరువాత ప్రచార పతకాలూ ఉంటాయి. [7] చాలా సందర్భాలలో, గ్రహీతలు నిమ్న తరగతి నుండి ఉన్నత తరగతులకు వెళ్ళేవారు. వారు,తాము పొందిన వాటిలో అత్యంత సీనియర్ బిరుదును, దాని బ్యాడ్జినీ మాత్రమే ఉపయోగించేవారు. వీటి ర్యాంకింగు నైట్ హుడ్ కంటే తక్కువ. నైట్ ఆఫ్ ఎ బ్రిటిషు ఆర్డర్ పొందిన వారు ఈ బిరుదులను వదిలేసేవారు. ఉదాహరణకు ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా గానీ, ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ గాని పొందినవారు ఈ బిరుదులను వాడేవారు కాదు. [8]
ఆర్డర్ ఆఫ్ బ్రిటిషు ఇండియా మొదటి తరగతి సభ్యులు సర్దార్ బహదూర్ అనే బిరుదును కూడా ఉపయోగించవచ్చు. రెండవ తరగతి సభ్యులు బహదూర్‌ను ఉపయోగించవచ్చు. ఈ సందర్భాలలో, బిరుదు బ్యాడ్జిని ధరించరు.
స్వరూపం
బ్యాడ్జ్‌లో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం, దానికి పైన సామ్రాజ్య కిరీటం ఉంటాయి. కిరీటం క్రింద లారెల్ పుష్పగుచ్ఛం ఉంటుంది. సెంట్రల్ మెడల్లియన్‌లో కిరీటంతో ఉన్న జార్జ్ V లేదా జార్జ్ VI ప్రొఫైల్ చుట్టూ ఉన్న బ్యాండ్‌లో బిరుదు రాసి ఉంటుంది. 1933 వరకు రాజు ముఖం బొమ్మ కుడివైపుకు తిరిగి ఉండేది. తరువాత, జార్జ్ V ముఖం ఎడమ వైపుకు చూస్తున్నట్లుగా మార్చారు. జార్జ్ VI ముఖం కూడా ఎడమవైపే చూసేది. [9]
వెనుకవైపు సాదాగా ఉండి, గ్రహీత పేరు, వివరాలు చెక్కి ఉండేవి. [2]
మూడు తరగతులు ఒకే పరిమాణంలో ఉండేవి: 58 మి.మీ. (2.3 అం.) ఎత్తు, 45 మి.మీ. (1.8 అం) వెడల్పు ఉంటాయి. వాటి లోహపు కూర్పు, రిబ్బను కింది విధంగా ఉంటాయి: [10]
- 1 వ తరగతి: వెండి గిల్టు మీద లేత నీలం రంగులో ఎనామెల్ చేసిన సెంట్రల్ మెడల్లియన్లో బిరుదు రాసి ఉంటుంది. రిబ్బన్ లేత నీలం రంగులో, ముదురు నీలం అంచుతో, ఉంటుంది;
- 2 వ తరగతి: ఎనామెల్ లేకుండా వెండి గిల్టు. రిబ్బన్ ఎరుపు రంగులో, ముదురు ఎరుపు అంచుతో ఉంటుంది;
- 3 వ తరగతి: వెండి, ఎనామెల్డ్ ముదురు నీలపు సెంట్రల్ మెడల్లియన్లో బిరుదు రాసి ఉంటుంది. రిబ్బన్ ముదురు నీలం రంగులో, లేత నీలిరంగు అంచుతో ఉంటుంది.
అన్ని తరగతుల బ్యాడ్జీలను 39 మి.మీ. (1.5 అం) వెడల్పున్న రిబ్బనుతో మెడలో వేలాడదీసుకుంటారు. [11] అయితే కొన్నిసార్లు అనధికారికంగా ఇతర పతకాలతో పాటు ఎడమ ఛాతీపై ధరిస్తారు. [c]
ఇవి కూడా చూడండి
నోట్స్
- ↑ Often also awarded to Sikhs from the Punjab.
- ↑ There may have been a Sardar Sahib Title Badge for Sikhs from the Punjab. Elsewhere they were rewarded as Hindus.
- ↑ Confirmed by contemporary photographs, e.g. C. S. Ratnasabhapathy Mudaliar
మూలాలు
- ↑ Captain H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
- ↑ 2.0 2.1 Mussell, John W., ed. (2015). Medal Yearbook 2015. Token Publishing Limited, Honiton, Devon. p. 305.
- ↑ Captain H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
- ↑ Tagore, Abanindranath; Tagore, Gaganendranath (2018). Fantasy Fictions from the Bengal Renaissance: Abanindranath Tagore's The Make-Believe Prince (Kheerer Putul); Gaganendranath Tagore's Toddy-Cat the Bold. Oxford University Press. ISBN 978-0-19-909217-8. Retrieved 12 August 2020.

- ↑ Joan G. Roland (1998). The Jewish communities of India. Transaction Publishers. p. 35. ISBN 0765804395. Retrieved 2020-08-12.
- ↑ Mussell, John W., ed. (2015). Medal Yearbook 2015. Token Publishing Limited, Honiton, Devon. p. 305.