భారతదేశంపై 2020 కరోనావైరస్ మహమ్మారి ఆర్థిక ప్రభావం

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తమిళనాడులో వార్తాపత్రికలు అమ్మే వ్యక్తి మాస్క్, గ్లవ్స్ వంటి రక్షణ పరికరాలు వాడుతూ పత్రికలు అందిస్తున్న దృశ్యం

భారతదేశంలో 2019–20 కరోనావైరస్ మహమ్మారి ఆర్థిక ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రపంచ బ్యాంక్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు 2021 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధిరేటుని తగ్గించాయి, 1990లలో జరిగిన భారతదేశ ఆర్ధిక సరళీకరణ తర్వాత మూడు దశాబ్దాలలో నమోదైన గణాంకాలలో అత్యల్పం ఇదే.[1] ఐతే, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేస్తున్న 1.21% భారత జిడిపి వృద్ధి 2021-22 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జి -20 దేశాలలోకెల్లా అత్యధికం.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా అమలుచేసిన మొదటి 21 పూర్తిస్థాయి లాక్‌డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ రోజుకు ₹ 32,000 కోట్లకు పైగా నష్టపోతుందని అంచనా. పూర్తిస్థాయి లాక్‌డౌన్ కారణంగా భారతదేశపు 2.8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో నాలుగింట ఒక వంతు కన్నా తక్కువ మాత్రమే పనిచేస్తున్నాయి. దేశంలో 53% వరకు వ్యాపారాలు గణనీయంగా ప్రభావితమవుతున్నాయి. లాక్‌డౌన్ పరిమితుల కారణంగా సరఫరా గొలుసులు (సప్లై చెయిన్) ఒత్తిడికి గురయ్యాయి; మొదట్లో ఏ రంగాలు "నిత్యావసరాలు" అన్న నిర్వచనం కిందికి వస్తాయో, ఏవి కాదో అన్నది క్రమబద్ధీకరించడంలో స్పష్టత లేదు. అసంఘటిత రంగాలలో ఉన్నవారు, రోజు కూలీలకు దీని ప్రభావం, దీని వల్ల ప్రమాదం ఎక్కువ. చెడిపోయే ప్రమాదం ఉన్న పంటలు వేసిన రైతులు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. హోటళ్ళు, విమానయాన సంస్థలు వంటి వివిధ రంగాల్లో జీతాలు తగ్గించి ఉద్యోగులను తొలగిస్తున్నాయి.[2] లైవ్ ఈవెంట్స్ పరిశ్రమకు ₹ 3,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా.

భారతదేశంలోని ప్రధాన కంపెనీలైన ఎల్ & టి, భారత్ ఫోర్జ్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా మోటార్స్, థర్మాక్స్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడం కానీ, గణనీయంగా తగ్గించడం కానీ చేశాయి. భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తి చేసే సంస్థలు కూడా మెజారిటీ కార్యకలాపాలను నిలిపివేసాయి. నిధులు తగ్గడంతో కొత్తగా నెలకొల్పిన స్టార్టప్‌లు ప్రభావితమయ్యాయి. మార్చి మూడవ వారంలో, అమెజాన్, వాల్మార్ట్ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో నిత్యావసరాలు కాని వస్తువుల అమ్మకాలను నిలిపివేసాయి, తద్వారా నిత్యావసరాలు, అత్యవసరాల డెలివరీలపై దృష్టి సారించాయి. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇతర వినియోగ వస్తువుల కంపెనీలు కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయి. వీటిలో కొన్ని నిత్యావసరాలపై దృష్టి సారించాయి. భారతదేశంలోని స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న చరిత్రలో అత్యంత దారుణమైన నష్టాలను నమోదు చేశాయి. అయితే, 21 రోజుల పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లో మొదటి రోజు ముగిశాకా, అంటే 25 మార్చిన, సెన్సెక్స్, నిఫ్టీ 11 సంవత్సరాల కాలంలో లేనంత భారీ లాభాలు చూశాయి, ₹ 4.7 లక్షల కోట్లు పెట్టుబడిదారుల సంపదలో కలిశాయి.[3]

"ఆర్థిక దృక్కోణం నుంచి చూస్తే లాక్‌డౌన్ నిస్సందేహంగా చాలా ఖరీదైన చర్యగా ఇప్పుడు కనిపిస్తుంది, కానీ భారత పౌరుల ప్రాణాలతో పోలిస్తే అది పెద్ద విషయం కాదు. (అనువాదం, మూలం హిందీలో ఉంది)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం, ఉదయం 10 గంటలకు, 2020 ఏప్రిల్ 14., [4][5]

ఈ పరిస్థితిని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఆహార భద్రతకు, ఆరోగ్య సంరక్షణకు అదనపు నిధులు కేటాయించడం నుండి వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు, పన్ను గడువు పొడిగింపుల వరకు అనేక రకాల చర్యలను ప్రకటించింది. మార్చి 27న భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా భారత ఆర్థిక వ్యవస్థకు ₹ 3,74,000 కోట్లు అందుబాటులోకి తీసుకువస్తూ వివిధ చర్యలు ప్రకటించింది. మార్చి 29న, లాక్‌డౌన్ సమయంలో అవసరమైన వస్తువులతో పాటు నిత్యావసరాలు కాని ఇతర వస్తువుల రవాణాను కూడా ప్రభుత్వం అనుమతించింది.[6] ఏప్రిల్ 1న కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ప్రపంచ బ్యాంకు బిలియన్ డాలర్లను అందించడాన్ని ఆమోదించింది. ఏప్రిల్ 3న కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేయగా ఈ నిధి మొత్తం ₹ 28,379 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 6న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులకు ఏడాది జీతంలో 30% జీతం కోత ప్రకటించారు.

2020 ఏప్రిల్ 14న, భారత ప్రధాన మంత్రి లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాడు. ఆర్థిక వ్యవస్థ పున:ప్రారంభానికి, దశలవారీగా లాక్‌డౌన్ సడలింపు కోసం కొత్త మార్గదర్శకాలను కూడా ఏర్పాటు చేశారు, ఇది ఏప్రిల్ 20 నుండి అమలులోకి వస్తుంది.[7] ఏప్రిల్ 17న, ఆర్బిఐ గవర్నర్ ఆర్థిక వ్యవస్థపై ఈ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి నాబార్డు, ఎస్ఐడిబిఐ, ఎన్‌హెచ్‌బిలకు ₹ 50,000 కోట్ల ప్రత్యేక ఫైనాన్స్ అందజేయడం సహా పలు చర్యలు ప్రకటించింది.[8]

మార్చి 24న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తున్నారని వస్తున్న వార్తలు తప్పుడు వార్తలని ప్రకటిచింది.[9] భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు.[10] ఏప్రిల్ 4న, ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ, భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి "స్వాతంత్ర్యం తరువాత అతిపెద్ద అత్యవసర పరిస్థితి" కావచ్చని అంచనా వేశారు.[11]

మూలాలు

  1. "World Bank sees FY21 India growth at 1.5-2.8%, slowest since economic reforms 30 years ago". The Hindu (in Indian English). PTI. 2020-04-12. ISSN 0971-751X. Retrieved 2020-04-13.{cite news}: CS1 maint: others (link)
  2. Goyal, Malini (2020-03-22). "Covid-19: How the deadly virus hints at a looming financial crisis". The Economic Times. Retrieved 2020-03-23.
  3. Shah, Ami (2020-03-25). "Sensex posts biggest gain in 11 years: Investors richer by Rs 4.7 lakh crore". The Economic Times. Retrieved 2020-03-25.
  4. "Economic cost of lockdown is nothing compared to people's lives: PM Modi". Business Standard. ANI. 14 April 2020. Retrieved 14 April 2020.
  5. "Lockdown hurts economy but saving life is more important: PM Modi". India Today. 14 April 2020. Retrieved 14 April 2020.
  6. "Covid-19: Govt allows transportation of all essential, non-essential goods". Business Standard India. PTI. 2020-03-30. Retrieved 2020-03-30.{cite news}: CS1 maint: url-status (link)
  7. Sharma, Aman (2020-04-16). "India evolves world's largest smart model of lockdown: Officials". The Economic Times. Retrieved 2020-04-16.
  8. "RBI Governor Highlights: Shaktikanta Das cuts reverse repo; pumps in money, liquidity; eases rules for banks, NBFCs" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-17.
  9. "Stop Panicking: PM Modi is not declaring an emergency; Stay Away from Fake News" (in ఇంగ్లీష్). 24 March 2020.
  10. "Is declaration of economic emergency inevitable, asks Subramanian Swamy" (in ఇంగ్లీష్). 21 March 2020.
  11. Ghosh, Deepshikha (6 April 2020). ""Greatest Emergency Since Independence": Raghuram Rajan On COVID-19".