మదనపల్లె
పట్టణం | |
Coordinates: 13°33′N 78°30′E / 13.55°N 78.5°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య జిల్లా |
మండలం | మదనపల్లె మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 14.20 కి.మీ2 (5.48 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 1,80,180 |
• జనసాంద్రత | 13,000/కి.మీ2 (33,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 987 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8571 ) |
పిన్(PIN) | 517325 |
Website |
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాకు చెందిన పట్టణం.
చరిత్ర
మదనపల్లె చరిత్ర సా.శ. 907 వరకూ తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యపు భాగంగా తెలుస్తోంది. ఈ పట్టణంలో గల సిపాయి వీధి (సిపాయి గలీ), కోట గడ్డ (ఖిలా), అగడ్త వీధి (కందక్ గలీ),, పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానొకప్పుడు ప్రముఖ రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది.
మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న, మాదెన్న లచే పాలింపబడినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్కడ రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బాసినికొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లెగా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు అరేబియాలోని మదీనా నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లెగా స్థిరపడిందని చెబుతారు.
907 – 955, మధ్యన యాదవనాయకులు, హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1565 లో గోల్కొండ నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713లో కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు నేటికీ కానవస్తాయి. సర్ థామస్ మన్రో కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. ఎఫ్.బి.మనోలె మొదటి సబ్-కలెక్టరు.
జనగణన
2011 నాటి[update] జనగణన ప్రకారం, పట్టణ జనాభా 1,80,180. సగటు అక్షరాస్యత 81.40%. ఇది జాతీయ సగటు అక్షరాస్యత 73.00% కంటే అధికం.[2]
భౌగోళికం , వాతావరణం
మదనపల్లె వాతావరణం వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ఆంధ్ర ఊటీ, పెన్షనర్ల స్వర్గం అని కూడా ప్రసిధ్ధి.
శీతోష్ణస్థితి డేటా - మదనపల్లె | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 27.3 (81.1) |
30.2 (86.4) |
33.4 (92.1) |
34.9 (94.8) |
35 (95) |
32.1 (89.8) |
30.2 (86.4) |
30.1 (86.2) |
29.9 (85.8) |
28.6 (83.5) |
26.8 (80.2) |
25.7 (78.3) |
30.4 (86.6) |
సగటు అల్ప °C (°F) | 15.5 (59.9) |
16.8 (62.2) |
19.4 (66.9) |
22.2 (72.0) |
23.6 (74.5) |
22.8 (73.0) |
21.8 (71.2) |
21.8 (71.2) |
21.2 (70.2) |
20.2 (68.4) |
17.8 (64.0) |
15.6 (60.1) |
19.9 (67.8) |
సగటు అవపాతం mm (inches) | 4 (0.2) |
2 (0.1) |
3 (0.1) |
28 (1.1) |
61 (2.4) |
51 (2.0) |
81 (3.2) |
73 (2.9) |
111 (4.4) |
143 (5.6) |
54 (2.1) |
32 (1.3) |
643 (25.4) |
[ఆధారం చూపాలి] |
పరిపాలన
మదనపల్లి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
- మదనపల్లెలో ఆం.ప్ర.రా.రో.ర.సం. వారి రెండు బస్సు డిపోలు గలవు.
- 10 కి.మీ. దూరంలో సి.టి.యం.రోడ్డులో 'మదనపల్లె రైల్వే స్టేషను ' ఉంది.
పత్రికలు
- 'ఈ సంఘం తెలుగు పక్షపత్రిక 2007 సం. నుండి ప్రచురించబడుతోంది. [ఆధారం చూపాలి]
విద్యాసౌకర్యాలు
- 1936వ సంవత్సరంలో స్థాపింపబడిన బోర్డు ఉన్నత పాఠశాల, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లాలోనే అతి పెద్ద ఉన్నత పాఠశాల. గిరిరావు థియోసాఫికల్ ఉన్నత పాఠశాల, హోప్ ఉన్నత పాఠశాల, హోప్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, మునిసిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాల, సి.ఎస్.ఐ.బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, రామారావు పాఠశాల ముఖ్యమైనవి.
వైద్య సౌకర్యాలు
మేరీ లాట్ లైలెస్ హాస్పిటల్ (MLL Hospital, గోషా ఆసుపత్రి, గోషా హస్పతాల్ ), ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖమైనవి.
పరిశ్రమలు
- మదనపల్లె స్పిన్నింగ్ మిల్ (సి.టి.యం.)
- పట్టు పరిశ్రమలు (నీరుగట్టువారిపల్లి)
- గార్మెంట్ పరిశ్రమ
- ఫుడ్ ఇండస్ట్రీస్
- గ్రానైటు పరిశ్రమ
- చిన్న చిన్న కుటీర పరిశ్రమలు
పంటలు
ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి, మామిడి,, కూరగాయలు పండిస్తారు. నీరుగట్టువారిపల్లెలో వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు ఉంది.
వ్యాపారం
మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్‌లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, టమోటా, మామిడి, సీతాఫలం, చింతకాయ కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ మదనపల్లె సమీపంలోని అంగళ్లులో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి.
కళారంగం
మదనపల్లె నాటక కళాపరిషత్
35 ఏళ్ళ కిందట మదనపల్లె నాటక కళాపరిషత్ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారథి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. నెల్లూరుకు చెందిన నెప్జా నాటక కళాపరిషత్, ప్రొద్దుటూరుకు చెందిన రాయల నాటక కళాపరిషత్ అనంతపురముకు చెందిన పరిత కళాపరిషత్, చిత్తూరుకు చెందిన ఆర్ట్స్ లవర్ అసోసియేషన్ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, భక్త రామదాసు, వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు గూడూరు సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.
అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ)
22 సంవత్సరాల క్రిందట అంజుమన్ తరఖి ఉర్దూ శాఖ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గులాందస్తగీర్, సయ్యద్ అబ్దుల్ అజీం, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖాదర్ హుసేన్ లు కీలక పాత్ర పోషించారు. ఖమర్ అమీనీ, జవాహర్ హుసేన్, అడ్వకేట్ నజీర్ అహ్మద్, షరాఫత్ అలీ ఖాన్, అడ్వకేట్ సికందర్ అలీ ఖాన్, హాజీ ముహమ్మద్ ఖాన్, ఖాజీ ముహమ్మద్ షాకిరుల్లా, మహమ్మద్ అక్రాలు తమవంతూ కృషి చేశారు. ఉర్దూ భాషాభి వృధ్ధికి, సాహిత్యపోషణకు ఎన్నో పోటీలను వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ముషాయిరాలు (కవిసమ్మేళనాలు), సెమినార్లు నిర్వహించారు. మదనపల్లెలో ముషాయిరాల సాంప్రదాయం సయ్యద్ అబ్దుల్ అజీం, గులాం దస్తగీర్ ఆధ్వర్యంలో ప్రారంభమయినాయి. నిసార్ అహ్మద్ సయ్యద్, ఖమీర్ అమీనీ ల ఆధ్వర్యంలో జీవంపోసుకున్నాయి.
కొన్ని విశేషాలు
- మదనపల్లెలోని శానిటోరియం టీబీ ఆసుపత్రిలో 'చందమామ' రూపకర్తలలో ఒకరైన చక్రపాణి కొంతకాలం చికిత్స చేయించుకున్నారు.
- "ఆ నలుగురు" సినిమా రచయిత "పెళ్ళైన కొత్తలో" సినిమా దర్శక నిర్మాత అయిన మదన్ మదనపల్లెలో బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్లో చదువుకున్నాడు.
- ఎన్నికల ప్రచారం కోసం ఇందిరా గాంధీ మదనపల్లె వచ్చిప్పుడే కాంగ్రెస్(ఐ)కు ఎన్నికల కమిషన్ హస్తం గుర్తు కేటాయించింది.
- 1919వ సంవత్సరంలో రవీంద్రనాథ్ టాగోర్ మదనపల్లెకు వచ్చారు.
- విశ్వకవి రవీంద్రుడు మన జాతీయగీతాన్ని ఆంగ్లంలోనికి బి.టి. కళాశాల, మదనపల్లెలో అనువదించారు.
- భారత జాతీయగీతం ... ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాల్ జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.
- ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విద్యాభ్యాసం చేశారు.
- మదనపల్లె, ఆ పరిసర ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిధ్ధి.
- పట్టణం మధ్యలో బాహుదా నది ప్రవహించును. సాధారణంగా మామూలు కాలువలా ఉండే బాహుదా 1996 సంలో వరదల కారణంగా ప్రవాహము హెచ్చి ప్రాణ నష్టం జరిగింది.
- మదనపల్లెలోని నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.ఇక్కడ ఎంతో మంది ప్రజలు చేనేత వృత్తి ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.
పర్యాటక ఆకర్షణలు
- హార్సిలీ హిల్స్- ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన(ఆంధ్రా ఊటీ అని పిలువబడే) వేసవి విడిది ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అధికారిక వేసవి విడిది కేంద్రము.
- బోయ కొండ- ప్రసిధ్ధి చెందిన గంగమ్మ క్షేత్రము.(ఇది చౌడేపల్లె మండలంలో ఉంది)
- బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది.
- సోంపాళెం
- రిషి వ్యాలీ - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది, భోజన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విద్యాబోధన జరుగుతుంది.
- ఆరోగ్యవరం (శానిటోరియం)-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
- బెసెంట్ థియొసాఫికల్ కాలేజి (దివ్యజ్ఞాన కళాశాల)- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. అనీ బెసెంట్ పేరున స్థాపించబడింది.
- "ధ్యాన మందిరము" - ఆధ్యాత్మిక వాది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ మహేశ్ యోగిచే ప్రారంభించబడింది.
- ఠాగూర్ కాటేజీ
- నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
ప్రముఖులు
- శంకరంబాడి సుందరాచారి
- జిడ్డు కృష్ణమూర్తి: అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్త
- లీలా నాయుడు
- అబ్దుల్ అజీమ్ ఉర్దూ కవి చిత్తూరు జిల్లా ఉర్దూ భాషా రంగంలో పరిచయమయిన పేరు. 42 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉర్దూ ఉపాధ్యాయునిగా తనసేవలందించాడు. చిత్తూరు జిల్లాలో ఉర్దూ భాషాభివృద్ధికి, మదనపల్లెలో అంజుమన్ తరఖి ఉర్దూ సంస్థకు తోడ్పడ్డాడు. మదనపల్లెలో ముషాయిరా ల సంస్కృతిని ఇతడే ప్రారంభించాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డు అయినాడు.
- జూళిపాళెం మంగమ్మ/ జోలెపాళ్యం మంగమ్మ - రచయిత్రి,రేడియోలో తెలుగు వార్తలు చదివిన తొలి మహిళ.
- మల్లెల గురవయ్య - కవి
- రాజారావు - రచయిత
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య - విమర్శకులు
- పన్నూరు శ్రీపతి - తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
- రమాప్రభ - నటి.
ఇవీచూడండి
మూలాలు
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ "Chapter–3 (Literates and literacy rate)" (PDF). Registrar General and Census Commissioner of India. Retrieved 23 August 2014.