లంగా ఓణి
లంగా, ఓణి దక్షిణ భారతదేశంలోని స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణా , కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో యుక్తవయస్సులోని అవివాహితులైన స్త్రీలు ధరిస్తారు. దీనిని తమిళులు ధావనిగా పిలుస్తారు.
ఓణి లేదా లంగా ఓణి లేదా పైట పావడ, అవివాహిత యువతులు ధరించే దక్షిణ భారత సాంప్రదాయిక దుస్తులు. ఓణి చీర అంత పెద్దగా ఉండదు. కాబట్టి ఇది నడుము నుండి పాదాల వరకు/ముందు వైపు సింహ భాగం, వెనుక కొంత భాగం ఆచ్ఛాదన నివ్వదు. అందుకే దీని క్రింద (లోపలి లంగా పైన) పై లంగా వేసుకొంటారు. చీర వలె దీనికి కుచ్చిళ్ళు కట్టరు. ఉదరం నుండి నడుము మీదుగా ఒకే ఒక చుట్టుగా వెళ్ళి మరల ఉదరం నుండి వక్షోజాలను కప్పుతూ భుజం పైకి వెళ్ళి మిగిలిన భాగం పైటగా వెనక్కి వెళ్తుంది. దీనిని వివాహిత స్త్రీలు ధరించరు. ఆంగ్లంలో దీనిని హాఫ్ సారీ (Half Saree) అని సంబోధిస్తారు.
వాడుక
సాధారణంగా ఆడపిల్లలు పుష్పవతి అయిన తర్వాత జరిపే వేడుకలో (బాల్యం నుండి యౌవనం లోనికి అడుగు పెట్టిన సందర్భ సూచికగా) భాగంగా యువతి దీనిని మొదటి సారి ధరిస్తుంది. పుష్పించే వరకు బాలిక లంగా, నడుము వరకు కప్పివుండేలా రూపొందించిన (హుక్స్/కొండీలు వెనుక వైపు ఉండే) జాకెట్టునే ధరిస్తుంది. పుష్పవతి వేడుక ముగిసిన తర్వాత యువతులు లంగా ఓణిలను రోజూవారీ వస్త్రధారణలో భాగంగా ధరిస్తూ ఉంటారు. అంతేగాకుండా కాకుండా గుళ్ళకు, ఉత్సవాలకి, పండుగలకి, శుభకార్యాలకి (ప్రత్యేక సందర్భాలలో పట్టు వంటి ఖరీదైనవి) ప్రత్యేకంగా లంగాఓణీని ధరించడం ఆనవాయితీ. అయితే ఆడపిల్లకు పెళ్లికాగానే, దీనికి బదులుగా చీరలు ఉపయోగించటం మొదలు పెడతారు. పెళ్లి అయిన స్త్రీలు లంగాఓణీని ధరించరు. ఇది కేవలం యుక్తవయసుకు వచ్చి, పెళ్లికాని అమ్మాయిలకు మాత్రమే ప్రత్యేకించబడిన వస్త్రధారణగా దీనిని మనం పేర్కొనవచ్చు. నిజానికి తెలుగు ఆడపడుచులు యుక్త వయస్సు రాగానె మొదటగా ఓణి ధరింప జేసె రోజుని ఒక ఘనమైన వేడుకగా, ఒక పండుగగా జరుపుతారు. ఆ తర్వాత చీరను ధరింప జేసే రోజును కూడా ఒక ఉత్సవంగా జరుపుతారు. ప్రస్తుత కాలంలో లంగా ఓణి ధరించే ఆడపిల్లలు అసలు లేరనే చెప్పాలి. దానికి కారణం పాశ్చాత్య దుస్తుల ప్రభావం కావచ్చు, సౌకర్యవంతంగా ఉండటం కావచ్చు, లేదా మరేదో కారణం కావచ్చు... ఏదేమైనా లంగా ఓణి వస్త్రధారణ అనేది ప్రస్తుత కాలంలో కనుమరుగైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాని ఈ మధ్యకాలంలో అక్కడక్కడా ప్యాషన్ పెరేడ్ లలో, సినిమాలలోను లంగాఓణీలు దర్శనమిస్తున్నాయి. ప్యాషన్ డిజైనర్ల కృషో, సినిమాల ప్రభావమో, నాగరికతలో మార్పో ..... కారణమేదైనా లంగా ఓణీ లకు పూర్వ వైభవం తప్పక వచ్చే చూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీల వస్త్రధారణలో ఎన్నెన్నో మార్పులు వచ్చినా చీర కట్టులోని సౌకర్యం, అందం, నిండుదనం, మరేదానిలో లేనట్టే..... లంగా ఓణీల నిండుతనం మరెందులోను వుండదనిపిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా లో దీని వాడకం ఎక్కువ. అయితే కేరళలో మాత్రం ఆడపిల్లలు లంగా ఓణిని చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ధరిస్తారు..