వేరుశనగ నూనె
వేరుశనగ నూనె (groundnut oil/peanut oil) : వేరుశనగ నూనెను వేరు శెనగ విత్తనములనుండి తీయుదురు. వేరుశనగ జన్మస్దలముదక్షిణ అమెరికా. వేరుశనగ ఉష్ణమండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగావుండు వ్యవసాయభూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా ఖండదేశాలలో వేరుశనగ నే వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికిచెందిన మొక్కకుటుంబం:ఫాబేసి, ప్రజాతి:అరాచిస్ . శాస్త్రీయ నామం arachis hypogaea legume'.[1] అన్నిరకాల వాతావరణ పరిస్దితులను తట్టుకోగలదు.పూలు పసుపువర్ణంలో వుండును.ఖరీఫులో వర్షాధార పంటగా, రబీలో నీటిపారుదల వున్నచోట సాగు చేయుదురు.
సాగు[2]
వేరుశనగమొక్కను అదిపెరిగే విధానాన్ని బట్టి రెండురకాలుగా వర్గీకరించారు.ఒకటి గుత్తి (bunch) రకము, మరొకటి ప్రాకుడు/వ్యాప్రి (spreading) రకము.ఈమధ్యకాలంలో పైరెండింటి కలయికగా అర్ధవ్యాప్తి (semi spreading) రకంకూడా సాగుచేస్తున్నారు.ఈ పంటకు తెలికపాటి ఇసుకనేలలు (రేగడి, నల్లరేగడి, నీటిని బాగా ఇంకించుకునే స్వభావమున్న నేలలు అనుకూలం.పంటనేల లోPH విలువ 6.0-6.5 (ఆమ్ల లక్షణం) వుండుట అనుకూలం.ఖరీఫ్ సాగు మే-జూన్ (వానలు ఆలస్యమైనచో ఆగస్టు-సెప్టెంబరు), రబి సిజను జనవరినుండి మార్చివరకు.ఈపంట మంచు అధికంగావున్నను, వార్షాభావ పరిస్థితులు ఏర్పడినను, పాదుల్లో నీరు ఎక్కువ నిల్వవున్నను తట్టుకోలేదు.వర్షపాతం 500-1200మి.మీ వుండాలి సరాసరి వర్షపాతం 400-500 మి.మీ.వుండలి.వాతావరణంలో ఉష్ణోగ్రత 25-300C మధ్య వుండాలి.భారతదేశంలో 5-6 మిలియను హెక్టారులలో వేరుశనగ పంటలో సాగుచెయ్యబడుచున్నది.వేరుశనగపంట సాగు గుజరాతులో ఎక్కువగా 1.7-2.0 మిలియను హెక్టారులలో ప్రథమస్థానంలో వుండగా, ఆ తరువాత 1.25-1.4 మిలియను హెక్టరుల సాగుతో ఆంధ్ర ప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉంది.ఆ తురువాత స్థానాలు, కర్నాటక కు, మహారాష్ట్ర రాష్ట్రాలవి..
వేరుశనగకాయ
కాయ (pod) పైభాగం పెలుసైనపిఛుపదార్థంకలిగివుండిన పొట్టు (shell/hull, pericarp).ఇదికాయలో 21-29% వుండును.బ్రౌన్ రంగులో వుండును.చారలుండును.పొడవు రకమునుబట్టి 15-30మి.మీ.వుండును.కాయలోపలగింజలు1-3 వరకుండును.గింజపై సాధారణంగా ఎర్రటి పలుచనిపొర (skin:testa) వుండును. గింజ గుండ్రం/అండాకారంగా వుండును.గింజలో రెండు బద్దలుండును.బద్దలచివర అంకురభాగం (germ) వుండును.ఇదిగింజలో2.1-3.6%వుండును.గింజపొర/తొక్క 1.9-3.2% వుండును. మెత్తటిగింజ (kernel)68-72% వుందును.ఇందులోనే నూనె, ప్రొటినులు, కార్బొహైడ్రేటులుండును.గింజలో నూనె40-50% వరకుండును.పంట దిగుబడి హెక్టారుకు రకాన్నిబట్టి 1200-1400కే.జి.లు వుండును.కాయను ఎక్కువకాలం నిల్వవుంచాలన్నచో కాయలోని తేమశాతాన్ని 9.0% కన్న తక్కువగా వుండేలా జాగ్రత్త వహించాలి.లేనిచో శిలీంద్రాలు ఆశించే అవకాశమున్నది.
వేరుశనగ గింజల నుండి నూనెను తియ్యడం
వేరుశనగ గింజలనుండి పూర్వకాలంలో గానుగ, రోటరిలద్వారా నూనెను తీసెవారు. ప్రస్తుతము 'ఎక్స్‌పెల్లరు ' (Expeller) [3] అనే యంత్రాలద్వారా తీయు చున్నారు.ఎక్స్‌పెల్లరులో హరిజంటల్ గా బారెల్ వుండును. బారెల్ చుట్టు స్టీల్ బద్దీలు బిగించబడి వుండును. బద్దీలమధ్య చిన్నఖాళివుండును. బారెల్ మధ్యగా మరలున్న (worms) ఒకవర్ము షాప్టు వుండును. నూనె గింజలను ఎక్స్‌పెల్లర్ యొక్క ఫీడ్ హపరులో వేసితిప్పినప్పుడు, వర్మ్‌షాప్ట్ మరల ప్రెసరువలన నూనెగింజలు నలగగొట్టబడి, బారెల్ బద్దీలసందుల గుండా నూనె బయటకు వచ్చి, దిగువన వున్న ట్రేలో కలెక్ట్ అగును. నూనెతీయబడిన నూనెగింజలు కేకు రూపములో ఎక్స్‌పెల్లరు కోన్ ద్వారా బయటకు వచ్చును. ఎక్స్‌పెల్లరునుండి వచ్చిన నూనెలో కొన్నిమలినాలు వుండును. అందుచే నూనెను ఫిల్టరు ప్రెస్‌లో ఫిల్టరు చెయ్యుదురు. వేరుశనగ కాయల పొట్టును (shell) తొలగించి, గింజల (Kernel) నుండి నూనెను సంగ్రహించెదరు. వేరుశనగ కాయ యొక్క పైపొట్టును తొలగించు యంత్రమును డికార్డికెటరు (Decorticator) అంటారు. ఎక్సుపెల్లరులద్వారా తీసిన నూనెను ఫిల్టరుచేసినతరువాత నేరుగా వంటనూనెగా వినియోగిస్తారు.గింజలలో నూనె తీయగా మిలిన గింజలపదార్థాన్ని శెనగచెక్క లెదా పిండి (oil cake) అంటారు.ఇందులో నూనెతీయుటకు ఉపయోగించిన ఎక్సుపెల్లరు సామర్థ్యాన్ని బట్టి 6-8% నూనె మిగిలి వుంటుంది.పిండిలోని ఈ నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్‌లో ఆడించడం ద్వారా పొంద వచ్చును. సాల్వెంట్ ఎక్సుట్రాక్షను విధానంలో పిండిలో 1.0%కన్న తక్కుగా నూనె పిండి/చెక్కలో మిగిలి పోతుంది.సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీసిన నూనెను నేరుగా వంటనూనెగా వాడుటకు పనికిరాదు.ఈ నూనెలో కరిగిన, కరుగని మలినాలు (impurities)1.0-1.2% వరకుండును. ఫ్రీఫ్యాటి ఆమ్లాలు 3-5% వరకుండును.వంటనూనెగా వినియోగించు ఏనూనెలోనైన ఈ స్వేచ్ఛా కొవ్వుఆమ్లాలు (free fatty acids)0.2% కన్న ఎక్కువ వుండరాదు. అందుచే సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీసిన నూనెను తప్పనిసరిగా శుద్ధీకరించిన (refining) తరువాత మాత్రమే వంటనూనెగా వాడెదరు.
నూనె యొక్క లక్షణాలు-భౌతిక ధర్మాలు
వేరుశనగ నూనె నాన్ డ్రయింగు (non-drying) వంటనూనె.ఇందులో అసంతృప్త కొవ్వుఆమ్లాల శాతం 80% వుండును.మిగతానూనెలలో అంతగా కనిపించని అరాచిడిక్, ఏయికొసెయినిక్, బెహెనిక్, లిగ్మొసెరిక్ కొవ్వు ఆమ్లాలు అల్పప్రమాణంలో ఈ నూనెలో ఉన్నాయి.నూనె లేత పసుపురంగులో వుండును.నూనెలో కెరొటినాయిడ్ల కారణంగా పసుపురంగు వచ్చింది.నూనెలో వున్న టొకొపెరొలుల (tocopherols) కారణంగా నూనె అంత త్వరగా పాడవ్వదు.నూనె ఉత్పత్తి చేసిన మొక్క రకాన్నిబట్టి, పండిన నేలస్వభావం, వాడిన ఎరువుల రసాయనికిగుణం, పంటకాలంలోని ఒడిదుడకులను బట్టి నూనెయొక్క భౌతికథర్మాలలో, కొవ్వుఆమ్లాలశాతంలో వ్యత్యాసం వుండును.ఈనూనెకూడా మరోరకంనూనెతో ఒకేరకమైన లక్షణాలు కలిగి వుండదు.
వేరుశనగ నూనెలోని ఫ్యాటిఆమ్లాల శాతం[4]
కొవ్వు ఆమ్లాలు | శాతము |
సంతృప్త కొవ్వు ఆమ్లాలు | విలువల మితి |
మిరిస్టిక్ ఆమ్లం (C14:0) | 0.1% |
పామిటిక్ ఆమ్లం (C16:0) ] | 9.5% |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 2.2% |
అరచిడిక్ ఆమ్లం (C20:0) | 1.4% |
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు | |
పామిటొలిక్ ఆమ్లం (C16:1) | 0.1% |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 44.8% |
లినొలిక్ ఆమ్లం (C18:2) | 32.5% |
విటమినులు | |
విటమిన్'E' | 15.7 మి.గ్రాం.లు |
విటమిమ్'K' | 0.7 మి.గ్రాం.లు |
భౌతిక లక్షణాలు, ధర్మాలు-పట్టిక[5]
లక్షణాలు | మితి |
సాంద్రత | 0.909-0.913 |
వక్రీభవన సూచిక (400C) వద్ద | 1.462-1.4664 |
అయోడిన్ విలువ | 85-99 |
సపొనిఫికెసను విలువ | 188-196 |
అన్‌సపొనిఫియబుల్‌మేటరు | 0.8-1.0% |
ఒకకేజి నూనె కెలరిఫిక్ విలువ 9000కిలోకెలరిలు.
నూనె ఉపయోగాలు
- వంటనూనెగా ఉపయోగిస్తారు.నూనెయొక్క స్మోకు పాయింట్ (smoke point)4500F.అందువలన నూనెతో వేపుడులు చెయ్యవచ్చును.[6]
- వనస్పతి తయారిలో (కేకులనుండి సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ద్వారా తీసి, రిఫైండ్ చేసిన నూనె) వేరుశనగ నూనెను కలుపుతారు.
- మలబద్ధకం నివారణ మందులలో వాడెదరు[7]
- చర్మరక్షణ, పసిపిల్లలకై వాడు పదార్థాలతయారిలో వేరుశనగ నూనెను వాడెదరు[7]
ఇవికూడా చూడండి
మూలాలు/ఆధారాలు
- ↑ "Groundnut". britannica.com. Retrieved 2015-03-15.
- ↑ SEAHandBook-2009,By TheSolventExtractors' Association ofIndia
- ↑ "Expeller Press". oilgae.com. Retrieved 2015-03-15.
- ↑ Fatty Acid Composition of 16 Groundnut (Arachis hypogaea, L.).Cultivars grown under Malaysian Conditions.SHIV K. BERRY,Department ofFood Science, Faculty ofFood Science and Technology
- ↑ "GROUNDNUT (PEANUT) OIL - SPECIFICATION" (PDF). law.resource.org. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-03-15.
- ↑ "Peanut oil nutrition facts". nutrition-and-you.com. Retrieved 2015-03-15.
- ↑ 7.0 7.1 "PEANUT OIL". webmd.com. Retrieved 2015-03-15.