సంస్కృతం
సంస్కృతము संस्कृतम् saṃskṛtam | ||||
---|---|---|---|---|
ఉచ్ఛారణ: | సంస్కృతం | |||
మాట్లాడే దేశాలు: | భారతదేశం | |||
మాట్లాడేవారి సంఖ్య: | 14,135 (2001 జనాభా లెక్కల ప్రకారం) [1] | |||
భాషా కుటుంబము: | — సంస్కృతము | |||
వ్రాసే పద్ధతి: | దేవనాగరి, పలు బ్రాహ్మీ లిపి ఆధారిత లిపులు, లాటిన్ లోకి లిప్యంతరీకరణ | |||
అధికారిక స్థాయి | ||||
అధికార భాష: | భారతదేశం,ఉత్తరాఖండ్ | |||
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |||
భాషా సంజ్ఞలు | ||||
ISO 639-1: | sa | |||
ISO 639-2: | san | |||
ISO 639-3: | san | |||
|
సంస్కృతము (దేవనాగరి: संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన గుడి, భారతదేశ 23 ఆధికారిక భాషల లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.
అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని మత్తూరు అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష.
సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి, అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.
సంస్కృతభాషావైభవము
మూలం
జటావల్లభుల పురుషోత్తము ఎం. ఏ. (Lecturer in Sanskrit, S.R.R. & C.V.R College, Vijayawada) చే రచించబడి, 1957 లో ముద్రింపబడిన "భారతీయవైభవము" అను పుస్తకము నుండి తీయబడింది.
ఏదృష్టితో చూచినను సంస్కృతనుడి ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమై, వివిధ భాషామాతయైయలరారు చున్నది; భారత జాతీయతకు జీవగఱ్ఱయై, భారతీయభాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరససాహిత్యజ్ఞానవిజ్ఞానరత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడా ప్రధానభూమికను నిర్వహింపగల్గియుండుట పరమ విశేషము.
మాతృత్వము
సుమారు 150 సంవత్సరములక్రిందట భాషాసాదృశ్య శాస్తము (Comparitive Philology) విజ్ఞాన ప్రపంచములో నుద్భవించెను. గ్రీకు, లాటిను, ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచి మున్నగు యూరోపియన్ భాషలనడుమ, అత్యంత సన్నిహితసంబంధము కలదనియు, ఈభాషలన్నియు ఆదిలో నేకమాతృసంజనితలనియు నపుడు పాశ్చాత్య పండితులు గ్రహించిరి. కొన్నిశతాబ్దములనుండి, ఐరోపాఖండములో వివిధయూరోపియన్ భాషలను నేర్చినవారెందరో యుండినను, వారి కంతకాలమును గోచరింపని యీ పరస్పర సంబంధము సంస్కృత భాషను నేర్చుకొన్నతర్వాతనే గోచరించుట విశేషము. ఇది గోచరించుటతోబాటు, వారికి సంస్కృతము ఆయన్నిభాషలకును తల్లియను విషయముకూడ స్పష్టమాయెను. వివిధ యూరపీయ భాషలు నిలిచియున్న విజ్ఞానరంగములోనికి, సర్వాంగసుందరియైన సంస్కృతభాష ప్రనేశించినప్పుడు, విమర్శకులీమె తల్లియనియు, మిగిలినభాష లక్కచెల్లెండ్రనియు గ్రహించిరి.
ఆదిలో ఇండో యూరోపియన్ భాషా సాదృశ్యశాస్తములో కృషిచేసిన వారిమతమున, సంస్కృతము నిస్సంశయముగ తన్నుడిగనే యుండెను. పిమ్మట నేకారణముచేతనోకాని పాశ్చాత్యపండితులు సంస్కృతమునకు మాతృస్ధానమును తొలగించి, అది యూరోపియన్ భాషలతో పోదరీ సంబంధమునే కలిగియున్నదను సిద్ధాంతమును లేవదీసిరి. ఇట్లు చెప్పిన పాశ్చాత్యపండితులుగూడ నొక్కయంశమునంగీకరింపక తప్పినదికాదు. ఈయక్కచెల్లెండ్రకు తల్లియైన భాషను మిక్కిలి హెచ్చుగ బోలియున్నది సంస్కృతమే కాని మరొకటికాదని వారనుచున్నారు. నిజమైనతల్లి యిపుడు మృగ్యమనియు, చాల విషయములలో నది సంస్కృతమును పోలియుండునని మనమూహించుకొనవచ్చుననియు, విమర్శకులు నుడువుటచే వివిధ యూరపీయభాషలకు సంస్కృతము కీలకమను అంశము వ్యక్తమగుచున్నది.
రాజకీయముగా భారతదేశము పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో, అది విపరీతముగ నుండెడి మాట వాస్తవమే. అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటల నిట ఉల్లేఖించుచున్నాను.
“గ్రీకు, లాటిను, గొతిక్ మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే, ముఖ్యముగా వైదిక సంస్కృతమునుండియే, ఉద్భవించినవి.” (Journal of Royal Asiatic Society of Britain and Ireland అను ప్రసిద్ధ పత్రికలో ః 16 వ సంపుటము ప్రథమ భాగములో 177 వ పుట).
నిష్పక్షపాతబుద్ధితో ఈరీతిగా సంస్కృతభాషకు యూరపీయభాషామాతృత్వము నంగీకరించినవారు కొందరు కలరు. 1834 వ సంవత్సరములో R.A.S. పత్రికలోనే ద్వితీయసంపుటములో Sanskrit Literature అను శీర్షిక క్రింద W.C. టెయిలర్ వ్రాసిన యీక్రిందిమాటలుకూడ గమనింపదగియున్నవి. “ప్రాచీనయూరోపీయభాషల కన్నింటికిని తల్లి హిందూదేశపుభాషయే. దేశములో ఎన్నిమార్పులు వచ్చినను ఆ భాషను హిందూదేశము నిలబెట్టుకొనగల్గినదని మనము ఆశ్చర్యముతో కనుగొంటిమి.”
సంస్కృతమునకు ఇండోజర్మానిక్ భాషలలో జ్యేష్ఠ భగినీత్వము నారోపించుట యిటీవలనే కొందరు పాశ్చాత్యులు చేసినపనియనియు, మాతృత్వమే మొదట అంగీకరింపబడినదనియు నిరూపించుట కీవచనముల నుదాహరించియున్నాను. జ్యేష్ఠభగినీవాదియైన మాక్సుముల్లరుకూడ సంస్కృతమంత ప్రాచీనభాష మరియొకటి లేదనియు, ఇకమీదటకూడ అట్టిది కన్పట్టుట కవకాశము గోచరింపదనియు చెప్పియున్నాడు.
ఎల్లభాషలకు కీలకము
ఇండోయూరపీయ కుటుంబమునకు చెందిన యేభాషలోనైనను కూలంకషమైన పాండిత్యము గల్గుటకు సంస్కృతభాషాజ్ఞానము అత్యంతావశ్యకము. ఇం.యూ. కుటుంబమునకు చెందక, ప్రత్యేకము ద్రావిడభాషా కుటుంబమునకు చెందినవని కొందరిచే భావింపబడుచున్న ఆంధ్రము, కర్ణాటకము మున్నగు భాషలను నేర్చుకొనుటకుకూడ సంస్కృత జ్ఞాన మవసరమే. ఈనడుమ గొందరు పండితులు ఆంధ్రము, సంస్కృత ప్రాకృతజన్యమని రుజువుచేసియుండుటచే, సంస్కృతభాషాప్రాముఖ్యత మరింత హెచ్చింది. ప్రపంచములోని ఏభాషనునేర్చుకొనుటకైనను సంస్కృతము కీలకమని మాక్సుముల్లరు అభిప్రాయపడినాడు. ఆధునికశాస్త్రముల కన్నింటికిని గణితశాస్త్ర మెట్టిదో, ప్రపంచభాషలకన్నింటికిని సంస్కృతమట్టిదని యాయన నుడివినాడు. “What Mathematics is to the Sciences, the same is Sanskrit to the languages of the world”.
సంస్కృతమునేర్చిన పాశ్చాత్య పండితులేకాక, ఇతర పాశ్చాత్య విద్వాంసులుకూడ నీ యభిప్రాయమునంగీకరించారు. జాన్ రస్కిన్ కూడా ఇంగ్లీషుభాషలో పాండిత్యము గలుగవలెనన్నచో మాక్సుముల్లరు రచించిన Biography of words అను గ్రంథమును చదువవలెనని చెప్పినాడు. ఆ గ్రంథములో ప్రధానముగా యూరపీయ భాషాపదముల సంస్కృతభాషా వ్యుత్పత్తి ప్రదర్శింపబడింది. దానిని చదువుటవలన ఇంగ్లీషుపదముల శక్తి, వినియోగ విధానము బాగుగా బోధపడునని రస్కిన్ అభీప్రాయము. (చూ: Sesame and Lilies.)
విజ్ఞానభాండారము
సంస్కతభాష సమస్త భాషలకు మాతయైనట్లే, సంస్కృతభాషాఘటితమైన విజ్ఞానముకూడ సమస్తదేశ ప్రాచీన విజ్ఞానమునకు మూలమైయున్నది. విజ్ఞాన ప్రవాహము భారతదేశమునుండి బయలుదేరి యేరీతిగా పర్షియా, అరేబియా, గ్రీసు మున్నగు దేశములకు వ్యాపించినదో విపులముగా వివరించుచు పోకాక్ అను ఆంగ్లేయుడు India in Greece అను గ్రంథములో నిరూపణచేసియున్నాడు. బాబిలోనియా, ఈజిప్టు మున్నగు దేశములలో అతిప్రాచీననాగరికత యని భావింపబడుచున్నది భారతదేశసంస్కృతియొక్క విస్తారమే యని ఆ గ్రంథములో వివరముగా తెలుపబడింది. ఈ గ్రంథము రచింపబడి నూరు సంవత్సరములగుచున్నది. ఇంత సహేతుకముగా సప్రమాణముగా ప్రపంచనాగరికత భారతీయనాగరికతా విస్తారమేయని నిరూపించిన గ్రంథమునకు దేశములో వ్యాప్తిలేకుండుట ఆశ్చర్యముగానున్నది. ఆ గ్రంథము వ్యాప్తిలోనికి వచ్చుచో భారతీయవిజ్ఞానముపట్ల భారతీయులయొక్కయు, ప్రపంచవాసులయొక్కయు దృక్పథములో మూలమట్టమైన మార్పువచ్చును.
ప్రపంచములోని యేభాషలోను వాజ్ఞయము పుట్టక పూర్వమే, సంస్కృతములో వాజ్ఞయము బయలుదేరినదని ఎల్లరు నంగీకరించుచున్నారు. మానవ పుస్తకభాండాగారములో ఋగ్వేదమే మొదటిగ్రంథమని మాక్సుముల్లరు నుడివియున్నాడు.
“Rig Veda is the first book in the Library of man”
ప్రపంచములో మొదటికావ్యమగు రామాయణము సంస్కృతభాషలో నుద్భవించినది, ప్రపంచములోని మొదటి జ్యౌతిషగ్రంథము, మొదటి నాట్యశాస్త్ర గ్రంథము, మొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతభాషలోనే యుద్భవించినవి. కావున ప్రపంచవిజ్ఞానచరిత్రలో సంస్కృతభాషకు విశిష్టమైనస్థానము ఉంది.
సంస్కృతభాషలోని వాఙ్మయముతో పరిచయమును పొందిన పాశ్చాత్యపండితులెల్లరు, దాని మహత్త్వమును వేనోళ్ల కొనియాడిరి. మహామేధావి, విమర్శకశిరోమణియైన గెటీయను జర్మనుపండితుడు శాకుంతలనాటకమును జర్మనుభాషలో చదివి ముగ్ధుడైనాడు. స్వర్గమర్త్యలోకముల సారసర్వస్వమే శకుంతలయని యాతడు వర్ణించాడు. మానవ హృదయమునకు ఉపనిషత్తు లీయగల శాంతిని మరియేవాఙ్మయము కూర్పజాలదని యెల్లరు నంగీకరించిరి. విశ్వవిఖ్యాతిగల షోపెన్ హోవర్ అను జర్మనువిద్వాంసుడు "ఉపనిషత్పఠన మంత లాభదాయకమైనది, ఔన్నత్యాపాదకమైనది మరొకటిలేదు. అది జీవితకాలమంతయు నాకు ఆశ్వాసజనకముగా నున్నది. మరణ సమయమునకూడ అదియే నాకు ఆశ్వాసహేతువు కాగలదు” అని నుడివినాడు.
ఫ్రెడెరిక్ ష్లెగెల్ "భారతీయుల భాష, విజ్ఞానము” అను గ్రంథములో నిట్లు వ్రాసెను. “ప్రాగ్దేశస్థుల ఆదర్శ ప్రాయమైన విజ్ఞానజ్యోతి ముందర గ్రీకువేదాంతుల తత్వశాస్త్రము అప్రతిబద్ధమై మినుకుమినుకుమను నిప్పునెరసువలె నుండును”.
సంస్కృతభాషయొక్క కట్టుబాటును గురించి మోనియర్ విలియమ్స్ యిట్లు పల్కినాడు. “ఇంతవరకు ప్రపంచములో బయలుదేరిన అద్భుతగ్రంథములలో పాణినివ్యాకరణమొకటి. స్వతంత్ర ప్రతిభ లోను, సూక్ష్మ పరిశీలనలోను పాణినీయ వ్యాకరణముతో పోల్చదగిన గ్రంథమును మరియే దేశమును సృజించుకొనలేదు”.
భాషను నిబంధించు వ్యాకరణశాస్త్రము ఒక శాస్త్రముగా పరిగణింపబడు ఉన్నతస్ధితికి వచ్చుట భారతదేశములో మాత్రమే జరిగింది. సంస్కృతవ్యాకరణమునుగూర్చి యీరీతి వర్ణనను "Most Scientific Grammar” అని అనేక పాశ్చాత్యపండితులు గావించియున్నారు. బుద్ధికి శిక్షణము నొసగు విషయములలో గణితశాస్త్రమొకటి. గణితశాస్త్రమునుగాని, సంస్కృతవ్యాకరణమునుగాని చదువుచో మానవబుద్ధి సరియైన మార్గములో ఆలోచించుటయను అలవాటులో పడునని నిష్పక్షపాతబుద్ధి గల పాశ్చాత్యులే నుడివియున్నారు.
బహుభాషానిబద్ధ సాహిత్యకృషి చేసినవారు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణముతో సమానమైన గ్రంథము లేదనిరి. ఆంగ్లములో గ్రంథకర్తగా ప్రసిద్ధిచెందిన భూతపూర్వ బీహార్ రాజ్యపాల శ్రీ ఆర్. ఆర్. దివాకర్ ఇట్లు వాక్రుచ్చారు. “కొందరు నాతో ఏకీభవించినను, ఏకీభవింపకపోయినను నామట్టునకు నాకు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణము ఉత్తమోత్తమ గ్రంథమనిపించుచున్నది.” (ఆంధ్రపత్రిక 21-7-57 ) . ఇట్టి బహువిషయములలో అగ్రస్థానము మరి యేభాషకును లభించుట లేదు.
జాతిని తీర్చిదిద్దినది
ప్రపంచములో ఏభాషయు సాధింపజాలని యొక విశేషమును సంస్కృతము సాధించినదని శ్రీ వివేకానంద స్వామి నుడివియున్నారు. ఏభాషలోనైనను కావ్యము రసవంతమై రమ్యముగానున్నచో అందు ధర్మబోధ తక్కువగా నుండును. ధర్మబోధ యెక్కువగానున్నచో రమ్యత తక్కువగానుండును. రమ్యతయు, ధర్మ్యతయు కలియుట మేలనియు, కాని అట్టి కలయిక కన్పట్టుటలేదనియు అరిస్టాటిల్ మున్నగు ప్రాచీనవిమర్శకులు పరితపించారు. పాశ్చాత్య నాటకకర్తలలో మేటియైన షేక్స్పియరులోకూడ ధర్మబోధ ప్రయత్నము తక్కువయనియు, షేక్స్పియరు లోకమునకు సందేశమునిచ్చు దృష్టితో నాటకములను వ్రాయనేలేదనియు విమర్శకులు చెప్పుచున్నారు. రమ్యతను, ధర్మ్యతను అత్యున్నత పథములో సమముగా సాధించిన గ్రంథము వాల్మీకి రామాయణము మాత్రమే. ఈ యంశమును స్వామి వివేకానందుడు అమెరికనులకు తెలుపుచు ఇట్లు పలికెను.
“Nowhere else are the aesthetic and the didactic so harmoniously blended as in the Ramayana”.
ఈ విషయములో రామాయణమునే వరవడిగా నుంచుకొని సంస్కృతకావ్య నాటకాదులు బయలుదేరినవనుట స్పష్టము. ఆలంకారికులుకూడ ఈలక్ష్యమునే ఆదేశించారు. ప్రతాపరుద్ర యశోభూషణములో విద్యానాథడు రచించిన "యద్వేదాత్ప్రభుసమ్మితాదధిగతం” ఇత్యాది శ్లోకసందర్భమును పరికింపదగును.
పాఠకుని హృదయము ఆనందసముద్రములో ఓలలాడుటతో బాటు, ధర్మసౌధశిఖరమును సోపానక్రమముచే అధిరోహించుట రామాయణ పఠనసమయములోనేకాక కాళిదాసాది ఇతర సంస్కృతకవుల గ్రంథములను పఠించు సమయములో కూడా అనుభవగోచరము.
అట్టి గ్రంథములే యింతకాలము భారతీయులను సత్వగుణ ప్రధానులనుగ చేసి, వారికి ప్రపంచములో నొక విశిష్టతను చేకూర్చినవి. ఆధునిక కాలములో (సైన్సు) విజ్ఞానము పర్వతరాశివలె పెరిగిపోయింది. దానిప్రక్కను భారతీయ సంస్కృతియను మరొకపర్వతమున్నది. ఈ సంస్కృతిచే పరిమళింప చేయబడని ఆధునికవిజ్ఞానమును మనముపయోగించుకొందుమేని అది యిప్పటిరీతిగానే ప్రపంచమునకు శాంతి ప్రదానశక్తిలేక, కల్లోలస్ధితికే కారణమగుచుండును. ఈరెండు పర్వతములను కలుపగల వంతెనయే సంస్కృతభాష. భారతరామాయణగాధలు, బోధలును, కాళిదాసాదికవుల గ్రంథములలోని మధురసందేశమును, భర్తృహరి సుభాషితాది హృదయంగమోపదేశములును నేటి విజ్ఞానపర్వతమునకును, భారతీయజీవిత పథమను సంస్కృతికిని సేతుబంధముగా పనిచేయగల్గి ఆధునికనాగరికతలో నూతనయుగము నావిర్భవింపచేయ గలవు. ఇట్టి సేతువును నిర్మింపవలసిన యావశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదుగారు 1952 వ సంవత్సరములో కాశీలోజరిగిల\న సంస్కృత విశ్వపరిషదధివేశమునకు అధ్యక్షతను వహించుచు, స్పష్టపరిచి యున్నారు.
నైతికముగాను, ధార్మికముగాను సంస్కృతము మానవులకు గల్గింపగల యభ్యున్నతి నిరుపమానమైనది. ప్రపంచములో నెక్కడెక్కడ సంస్కృతము ప్రాకినదో, అక్కడక్కడ మానవహృదయమునకు మృదుత్వమేర్పడినదని రవీంద్రనాధటాగోరువంటి విశ్వమానవ సమదృష్టిగల విశ్వకవికూడ నుడివియుండుట గమనింపదగిన విషయము. భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క యీప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా సంస్కృతభాషాద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్ని శతాబ్దములపాటు సంస్కృతము యూరపియనులకు అందలేదు.” (11-2-53 తేదీని కాశీలో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము).
ఇటీవల యూరపియనులు వాణిజ్యాదులకొరకు భారతదేశానికి వచ్చుటయు, సంస్కృతమును నేర్చుకొనుటయు, సంస్కృతసాహిత్యగ్రంథములనేకాక శాస్త్రములనుకూడ తమతమ భాషలలోనికి పరివర్తింపచేసికొనుటయు సంభవించెను. 18 వ శతాబ్దిలో ప్రారంభమైన యీ సంస్కృత సంస్కృతి ప్రసారము పాశ్చాత్యభాషలపైననూ, విజ్ఞానముపైనను అపారప్రభావమును చూపెను. సంస్కృతభాషను నేర్వనివారిపైకూడ ఈ ప్రభావము పడెను. కాంట్, స్పైనోజా మున్నగు దేవాంతులపైనను, ఎమర్ సన్, ఎడ్విన్ ఆర్నాల్డ్, సోమర్ సటే మాగమ్ మొదలైన రచయితలపైనను ఈ ప్రభావము ప్రస్ఫుటముగా గోచరించును. ఐరోపాలో 15 వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు విజ్ఞానపునర్విజృంభణమునకు తరువాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నిటిలోను గొప్పది సంస్కృత సంపర్కమువలన జరిగిన వైజ్ఞానికసంచలనమే యని ఎ. ఎ. మాక్డోనెల్ తన Sanskrit Literature అను గ్రంథములో వ్రాసియున్నాడు. (1 వ పుట)
సంస్కృతభాషను నేర్చి, భారతీయుల జీవితపద్ధతులను చూచిన పాశ్చాత్యపండితు లెల్లరు సంస్కృత భాషానిబద్ధసంస్కృతికిని, భారతీయుల జీవితమునకును గల సన్నిహిత సంబంధమును, సమన్వయమును చూచి యాశ్చర్యపడిరి. భారతీయజీవితము నర్ధముచేసికొనుటకు సంస్కృతభాషా వాఙ్మయపరిచయము అవసరమని గుర్తించిరి. కావుననే బ్రిటిష్ ప్రభుత్వకాలములో ఈ దేశానికి పరిపాలకులుగా రాదలచిన ఐ. సి. యస్. పరీక్షాభ్యర్ధులకు మాక్సుముల్లరు రచించిన India; What can it teach us? అను గ్రంథము పఠనీయముగానుండెను.
పైన పేర్కొనబడిన ఫిన్లెండ్ రాయబారి తన ప్రభుత్వము తన్ను భారతదేశానికి రాజదూతగా పంపిన కారణమును కాశీ విశ్వసంస్కృత పరిషదధివేశములో నిట్లు వివరించెను. 'మా దేశపు ప్రభుత్వము సంస్కృతభాషను నేర్చినవాని నెవనినయినను భారతదేశానికి దూతగా పంపిన బాగుండునని తలంచుచుండెను. నేను 35 సంవత్సరముల క్రిందట, మా దేశములో విశ్వవిద్యాలయములో సంస్కృతము నభ్యసించితిని. కావున ఈ ఉద్యోగమునకు నేను ఎంచుకొనబడుట సంభవించెను'. భారతదేశముతో సంబంధము పెట్టుకొనదలచిన పాశ్చాత్యులకే సంస్కృతభాషాజ్ఞానమంత ముఖ్యముగా భావింపబడుచుండగా, స్వయముగా భారతీయులకా భాష యెంతముఖ్యమో, అది యెంతగా ప్రాణసమానమైనదో వేరుగ చెప్పనక్కరలేదు.
ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగ నిబద్ధమగుటలో విశేషముగ తోడ్పడినది సంస్కృతభాష. రాజకీయ శాస్త్రములో జాతీయతకు (Nationhood) కావలసినవిగ చెప్పబడిన యంశములలో భాషైక్యమొకటి. ప్రాచీనభరతఖండములో ప్రాంతీయభాషలుండినను వివిధప్రాంతముల నడుమ సామాన్యభాషగా నుండినది సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికిని గలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్నప్రాంతముల వారు సమావేశమైనప్పుడుకూడ వారు పరస్పరము అవగాహనము చేసికొనవలయునన్నచో వారివారి భాషలలో సామాన్యముగనుండు సంస్కృత పదజాలమే సహాయము చేయును. ఒక యాంధ్రుడును బీహారు ప్రాంతవాసియు నొకచోట కలిసినప్పుడు ఆంధ్రుడు బీహారీని "మీ నివాస మెక్కడ?” అని తెలుగులో అడిగినను అతని కర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోను సమానమే. 'భోజనము', 'శ్రమ', 'దానము' మున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోను ఉండును. కావున భాషా భేదమున్నను, భారతీయు లెల్లరు సంస్కృతపద సూత్రబద్ధులై భాషైక్యముగూడ పొందియున్నారు.
సంస్కృతభాషవలెనే తద్భాషా నిబద్ధమైయున్న విజ్ఞానముకూడ భారతదేశమున కైక్యమును సాధించింది. రామాయణము, మహాభారతము, భర్తృహరి సుభాషితములు మున్నగునవి భారతదేశములోని ఏప్రాంతమువారికైను సమాన పరిచితములే; వానినిచూచి యుప్పొంగని భారతీయుడు లేడు. సంస్కృతభాషను కాళిదాసాదివిరచితశ్లోకములద్వారమున నేర్పు సంప్రదాయమొకటి మన దేశములో నున్నది. దీనివలన సంస్కృతము, సంస్కృతి కూడా ఒకేసారి బాలబాలికల హృదయములో ప్రవేశించు సదవకాశము కల్గును. జీవితకాలమంతయు జ్ఞప్తియందుంచుకొనవలసిన రసవంతములైన శ్లోకములద్వారా భాష నేర్చుకొనుటవలన యువకులు వానిని కంఠస్థముచేయుటయు, జీర్ణించుకొనుటయు సంభవించును. నేటి పాఠ్యపుస్తకములద్వారా సంస్కృతము నేర్చుకొనుచో నీ ప్రయోజనము బోవును. మహాకవుల గ్రంథములు బాలురకు బోధపడునాయనుశంకకు అవకాశము లేదు. ప్రపంచములో ఏభాషకును లేని విశేషమొకటి సంస్కృతభాషకు ఉంది. ఈభాషలో మహోన్నతకవులే మహాసులభకవులు. వాల్మీకి, కాళిదాసు లెంతగొప్పవారో అంత సులభులు. కావున ఈ విషయమున సంస్కృతభాష మరొక భాషతో పోల్చదగినదికాదు.
“సంస్కృతభాషయు, తన్నిబద్ధవిషయములును భారతదేశమునకు పరంపరాగతములైన పెన్నిధానములు. ఇవి భారతీయులకు పూర్వులనుండి వారసత్వముగా సంక్రమించిన మహోత్కృష్టభాగ్యరాశిగా చెప్పదగినవి. ఇవి భారతదేశములో నిలచియున్నంతకాలము ఈదేశమునకు మూలభూతమైన ప్రతిభ జీవించియుండును” ఇది భారతప్రధాని నెహ్రూ, సంస్కృతభాషావాఙ్మయములనుగురించి వెలుబుచ్చిన అమూల్యాభిప్రాయము.
అమృతభాష
సంస్కృతము ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. భారతదేశములో సంస్కృతము జీవద్భాషయే యనునది స్పష్టమైన సత్యము. మృతభాషలైన గ్రీకు, లాటినులను సంస్కృతముతో పోల్చి చూతుమేని మృతభాషావాదము నిస్సారమని తెలియగలదు. నేడు ఒక సంస్కృతగ్రంథము ముద్రింపబడుచో సంవత్సరమునకు కొన్ని వేల ప్రతులు విక్రయింపబడుటను చూచుచున్నాము. అట్టి గ్రంథములు వందలకొలది ముద్రితము లగుచున్నవి; చెల్లుబడి యగుచున్నవి. గ్రీకు, లాటిన్ గ్రంథముల కింత ఆదరము లేదు సరికదా యిందులో శతాంశమైనను లేదు. నేడు వేలకొలది ప్రజలుగల సభలలో సంస్కృతమున ఉపన్యాసములు జరుగుటయు, ప్రజలు వాని నర్థముచేసికొనుటయు చూచుచున్నాము. మద్రాసువంటి ఆధునికపట్టణములో వేలకొలది మంది అర్థము చేసికొను భాషను మృతభాషయనుటకంటె అసత్యము మరొకటి యుండదు. గ్రీకు భాషలో ఉపన్యాసము జరుగుచో ఇంగ్లండులోనేకాదు గ్రీసు దేశములోకూడ ఏపట్టణములోను నూరుమందికూడ అర్థము చేసికొనజాలరు. ఇట్టి యనేక కారణములవలన సంస్కృతము నేటికికూడ జీవద్భాషయే యని స్పష్టమగుచున్నది. సంస్కృతము నేర్వనివారికి కూడా లోకోక్తి రూపముగాను, సుభాషితరూపముగాను పదులకొలదిగనైనను సంస్కృతశ్లోకములు వచ్చియుండును. పైని చెప్పిన లక్షణములలో ఏదియు మృతభాష కుండదు.
సంస్కృతము మృతభాష కాకుండుటయేకాక మాధుర్యభరితమై యున్నందున అమృతభాషయని చెప్పదగియున్నది.
హిందూమతముతో బాటు సంస్కృతమును జీవింపక తప్పదు. సంస్కృతవిరహితమైన హిందూమతము ఊహకుకూడ అందనిది. హిందువుల మతగ్రంథములన్నియు - వేదములు, పురాణేతిహాసములు, భాష్యములు మున్నగునవన్నియు - సంస్కృతములోనే యుండుటచేతను, నిత్యకర్మలును. నిషేకాదిశ్మశానాంతకర్మలును, శ్రేతపౌరాణిక యజ్ఞములును, పారాయణగ్రంథములును, అన్నియు సంస్కృతములోనే యున్నందున హిందువులకిది శాశ్వతముగ సమాశ్రయణీయము. మహాత్మా గాంధి యిప్పట్ల నుడివిన యీ మాటలు గమనింపదగినవి.
“ప్రతి హిందూబాలుడును, బాలికయును సంస్కత భాషాజ్ఞానమును సంపాదింపవలయును. ప్రతి హిందువును అవసరము వచ్చినప్పుడు సంస్కృతములో మాట్లాడగల్గి యుండవలయును.” (Mahatma Vol. II, p 361)
ఒకప్పడు క్రైస్తవమతమునకు పవిత్రభాషగా నుండి క్రైస్తవమతముతోబాటు శాశ్వతముగా జీవించీతీరునను అభిప్రాయమును గల్గించుచుండిన లాటిను భాష ఈనాడు క్రైస్తవమతమును వీడినట్లే సంస్కృతముకూడ హిందూమతమును వీడదాయను సందేహమెవరికైనను కలుగవచ్చును. ఆ సాదృశ్యము సరియైనదికాదు; (1) ఆదిలో లాటిను ద్వారా క్రైస్తవమతము ఐరోపాలో వ్యాపించినను, తన్మత మూలగ్రంథము లాటిను పుట్టియుండలేదు. కావున లాటిను కును క్రైస్తవమునకును సంబంధము మూలమట్టమైనదికాదు. (2) హిందూమత మూలగ్రంథములలో అర్ధశక్తియేగాక అక్షరశక్తికూడ కలదు ఆ అక్షరములు అదేరీతిగా, అదేస్వరముతో ఉచ్చరింపబడుచో అపూర్వము పుట్టునని యీ మతములోని సిధ్ధాంతము. కావున మూల గ్రంథమునకు ప్రముఖస్ధానము ఎప్పుడును పోదు. (3) ఈ మతమునకు చెందిన ఉద్గ్రంథములలో - ముఖ్యముగ త్రిమతస్ధుల ప్రస్థానత్రయ భాష్యములలో శబ్దవిచారమే ముఖ్యముగా చేయబడింది. “ఇచ్చట ఏవకారమునకు ప్రయోజన మేమి?”, ”అక్కడ ఆధాతువునకు ఆప్రత్యయము వచ్చినందున ఆయర్ధము తెలుపబడుచున్నది”—ఇత్యాది ధోరణిలో భాషమీదనే విశేషముగ విచారణ జరిగియున్నందున, ఈ మతముతో సంస్కృత భాషకుగల సంబంధ మెన్నటికిని పోదు. (4) ఇంతవరకు భారతీయ భాషలలో రామాయణ భారత భాగవతములకు అసంఖ్యాక పరివర్తన గ్రంథములు బయలుదేరినను ఏ యొక ధార్మికవిషయమునగాని భక్తివిషయమునకాని తత్వవిషయమున కాని సందేహము వచ్చినను మూల సంస్కృతగ్రంథమును చూచియే సందేహమును తీర్చుకొనుచున్నారుకాని యీ ప్రాంతీయభాషాగ్రంథములను చూచి సందేహమునెవ్వరును తీర్చుకొనుటలేదు. కావున ప్రామాణికత మూలసంస్కృత గ్రంథములకు పోయే అవకాశము లేదు. (5) సంస్కృతమువంటి అమూల్యరత్న నిధానమును హిందువులు విడిచిపెట్టుకొందురనుటకంటె వీరికిచేయబడు అన్యాయము వేరొండు లేదు.
భారతీయ భాషలకు ప్రాణము
ఆధునిక యుగమున భారతదేశములో ఫ్రాంతీయ భాషలకు సంస్కృతమువలన కలుగు పరిపుష్టి వర్ణనాతీతము. ఏభావమునైనను, భావచ్చాయనైనను తెలుపగల పదములు సంస్కృతములో సిద్ధములై యుండుటయేకాక అవసరమైనకొలదియు నూతన పదములను సృజించుకొను అవకాశము ఇందున్నంత పుష్కలముగా మరి యేభాషలోను లేదు. ఆయా ధాతువులకు చేర్చబడు ఉపపర్గల వలనను తిఙకృత్ప్రత్యయముల వలనను అనంతపదజాలము కల్పింపబడుట కవకాశమున్నది. అట్లే సుబంత తద్ధిత రూపములును కొల్లలుగా సంపాదింపబడును. ఒక్కథాతువునుండి సుమారు 150 పదములను సృజించు అవకాశము సంస్కృతములో ఉంది. ఇట్టి యవకాశము మరి యే భాషలోను లేదు. ఇంత భాగ్యవంతమును, సమృద్ధి మంతమును అయిన భాష ఆధునికయుగములో నిర్వహింపవలసిన కార్య మెంతయో ఉంది.
బహువిధోద్యమములతోను, వైజ్ఞానిక సంచలనములతోను చైతన్యవంతమైన ఆధునిక కాలములో సంస్కృతము చేయుచున్నట్టియు, చేయగల్గినట్టియు సహాయ మింతింతయని చెప్పజాలము. సంస్కృత సహాయము లేనిచో సుమారు అర్థశతాబ్దినుండి ఆంధ్రదేశములో ( అట్లే యితర భాషాప్రాంతములలో ) విజృంభించుచున్న అనేకోద్యమము లింతగా ప్రజల హృదయములను తాకెడివికాదు. గ్రంథాలయోద్యమము, వయోజన విద్యాప్రచారము, సహాయ నిరాకరణోద్యమము, గ్రామ్య, గ్రాంధికభాషా వివాదము, భావకవిత్వ ప్రస్ధానము, సారస్వత విమర్శనము, చారిత్రక పరిశోధనము - అది యిది యననేల – ఆధునిక జీవిత విజృంభణ మంతయు సంస్కృత భాషావలంబనము చేతనే జరిగింది. సంస్కృతమునకా పటుత్వమున్నది. ఏయుద్యమము బయలుదేరినను అది ప్రజల హృదయములలో నాటుకొనిపోవులనట్లు చేయగల అమోఘమైన శక్తి సంస్కృతభాష కుండుటచేత సంస్కృతముద్వారా ఉద్యమములు వ్యాపించుటయే కాక ఉద్యమములద్వారా సంస్కృతభాష కూడా అపారముగా వ్యాపించిపోయింది. ఏమాత్రము విద్యాగంధము లేనివారికికూడ ఆయాయుద్యమ భావములతోఁబాటు సంస్కృతభాషా పదములుకూడ అందఁజేయఁబడినవి. తత్ఫలితముగా నేడు సంస్కృత పదములు వెనుకకంటె హెచ్చు వ్యాప్తిలోనికి వచ్చినవి. మునుపు సంస్కృత పండితులకు మాత్రమే యర్థమగుచుండిన కొన్ని సంస్కృతపదములు నేడు సామాన్యజనుల కర్ధమగుచున్నవి.
1920 వ సంవత్సరమునకు పూర్వము మనదేశములో "గ్రంథపఠనము”, “స్వార్థపరుడు”, “దృఢసంకల్పము” మున్నగు పదములకు అర్థమేమని దారినిపోవువాని నెవ్వని నైనను అడుగుచో అతడు తెల్లబోయెడివాడు. నేడు ఆంధ్రపత్రిక, ఆంథ్రప్రభ మున్నగు పత్రికలను చదువు సామాన్యజనుడు కూడా వీనియర్ధమును గ్రహించగల్గుచున్నాడు. కారణమేమి? ఆయా ఉద్యమములతోపాటు ఇట్టి పదములు కూడా ప్రజలకు పరిచితములైపోయినవి. మనకు తెలియకుండగనే సంస్కృతము మనకు సహాయము చేస్తోంది. అది సమస్తాధునికోద్యమములకు సహాయము చేయుచు, అన్నింటి మూలమునను కూడా వ్యాప్తిచెందుచు తన విలక్షణప్రభావమును లోకమునకు చాటుచున్నది.
ఆధునిక నాగరికతకును సంస్కృతభాషకును ఇట్టి సంబంధము ఉంది. ఇది భారతదేశములోని అన్ని ప్రాంతీయ భాషలకును వర్తించును. కావుననే భారత కేంద్రప్రభుత్వమునకు అధికారభాష కావలసిన హిందీ పదములను స్వీకరింపవలసినపుడు ముఖ్యముగా సంస్కృతము నుండియు, తరువాత ఇతర భారతీయభాషల నుండియు (...by drawing, whereever necessary or desirable, for the vocabulary, primarily on Sanskrit and secondarily on other languages) స్వీకరింపవలయుననని భారత రాజ్యాంగ ప్రణాళికలో ఉపనిబద్ధమైయున్నది. (Part XVII, Chapter IV, 351)
భారతదేశములోనేకాదు, ఇతరదేశములలో కూడా ఆధునిక వ్యవహారములకు సంస్కృత సహాయము పొందబడుచున్నది. సయాం, జావా మున్నగు దేశములలో దేశీయ భాషలు ఆధునిక వ్యవహారములకు ఉపయోగవడుటకై పరిపుష్టిని సంస్కృతభాషనుండి పొందుచున్నవి. సింహళ విశ్వవిద్యాలయాచార్యులైన వి. జి. సేకరే స్వీయ దేశ భాషాభివృద్ధి మార్గమును నిర్దేశించుచు నుడివిన యీమాటలు గుర్తింపదగినవి. “ఇంత కాలముపేక్షింపబడిన దేశీయభాష త్వరలోనే గురుతర బాధ్యతలను వహింపవలసివచ్చును. ఈ దేశీయభాషాభీవృద్ధిసందర్భమున మనకు ప్రధానమైన స్ఫూ ర్తి సంస్కృతభాషనుండి రావలసియున్నది. దీనినెల్లరు నంగీకరింతురు. విపులమైన శబ్దజాలము, శాస్త్రీయపారిభాషిక పదసమూహము సంస్కృతమున కాస్థానమును గల్గించుచున్నవి. సంస్కృత ధాతువుల నాధారముగా చేసికొనియే మనము నూతనపదములను నిర్మించుకొనవలసి యున్నది.” (22-6-54 తేదీని జాఫ్నాలో జరిగిన సంస్కృత మహాసభలోని ఉపన్యాసము.)
భారతదేశములోని యే ప్రాంతీయ భాషాసాహిత్యములోనైనను ప్రవేశించుటకు గాని గ్రంథరచనగావించుటకుగాని సంస్కృతభాషాజ్ఞానము తప్పనిసరిగా నుండదగినది. ఈ సంస్కృతప్రభావము ప్రాచీనరచనలలోను, అర్వాచీనరచనలలోను సమానముగానే యున్నది. ప్రాంతీయభాషాప్రత్యయములను తొలగించి సంస్కృత ప్రత్యయములను చేర్చుచో సంస్కృతభాషగానే మారిపోవు రచనలు నాడును నేడును గూడ సర్వ ప్రాంతీయభాషలలోను ఉన్నాయి. సంస్కృతపద భూయిష్టములైన రచనలే అన్ని ప్రాంతీయ భాషలలోను జనసామాన్యముచే ఆదరింప బడుచున్నవి. ఏగ్రంథములు సంస్కృత పదములను వాడరాదను అభిప్రాయముతో కవులచే రచింపబడినవో ఆ గ్రంథములే కృతిమములు గాను, కఠినములు గాను గన్పట్టుచున్నవి. ధారాళముగా సంస్కృత పదములు ప్రయోగింపబడిన గ్రంథములు జనసామాన్యమున కర్థమగుచున్నవి. కొన్నిపట్ల సంస్కృతపదభూయిష్ఠ రచనయు కఠినముగా నుండవచ్చును. కాని యా కాఠిన్యతనకు కారణము ఆపదములు సంస్కృత పదములై యుండుటకాదు. అట్టిపదములు సంస్తృతగ్రంథములలో నున్నను ఆ గ్రంథములు సంస్కృత పండితులకు కఠినముగానే యుండును. వానికి బదులుగా తేలికయైన సంస్కృతపదములు వాడబడుచో ఆ రచన తెలుగు గ్రంథములోనున్నను తేలికగనే యుండును. సంస్కృతగ్రంథములలోనున్నను తేలికగానే యుండును. కావున కాఠిన్య, సౌలభ్యములు ఆ ప్రయుక్తపదములకు సంబంధించినవే కాని భాషకు సంబంధించినవి కావు.
నేటి భారతీయ భాషాసాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢసంబంధము గట్టిగా మనస్సునకు తట్టవలయునన్నచో అప్పుడప్పుడు జరుగుచుండు సర్వప్రాంతీయ కవిసమ్మేళనమములలో పద్యములను మనము వినవచ్చును. ఇంచుమించు అన్ని ప్రాంతీయభాషలలోను అవే సంస్కృత పదములు విననగును; భిన్నభారతీయ భాషలనడుమ ఎంత ఐక్యతకలదో స్పష్టముగ గోచరించును.
నేటి మన వ్యవహారరంగములోను, సాహిత్యరంగములోను సంస్కృతమెంత సన్నిహిత సంబంధమును గల్గియున్నదో, సంస్కృతాభ్యాసము పెరుగుచో ఈ ఉభయరంగములలోను మన భాషాపాటవ మెంతగా పెరుగునో, జాతీయజీవన మెంత సౌభాగ్య వంతముగానుండునో పై విచారణమువలన తెలియగలదు. నవయుగములో సంస్కృత పునరుజ్జీవము ప్రాంతీయభాషా పునరుజ్జీవములో నొక ముఖ్యభాగముగా భావింపవలయుననియు, సర్వప్రాంతీయ భాషలలోను సంస్కృతపదజాలము పెరుగుచున్న కొలదియు భిన్నభిన్న ప్రాంతములవారు పరస్పరము దగ్గరకు చేరుకొనుటకును, భారతీయులలో ఏకజాతీయభావము ఇతోధికముగా సునిరూఢమగుటకును దోహదమేర్పడుననియుకూడ దీనివలన స్పష్టమగుచున్నది.
మరొక విషయమేమనిన సంస్కృతము అత్యంత ప్రాచీన భాష యే కాదు. ఆ ప్రాచీనకాలము నుండి నేటివరకు నవనవోన్మేషముగా నిలబడియున్న భాష. ఉదాహరణకు షేక్స్ పియర్ మహానుభావుడు వ్రాసిన ఆంగ్ల నాటకము లో వాడబడిన భాష ఈరోజు వాడబడు ఆంగ్లభాష చాలావరకు మార్పు చెందినది. హీబ్రూ మొదలైన ప్రాచీన భాషల విషయమున ఇట్లే. కానీ సంస్కృత భాష విషయములో చూచినచో క్రీస్తు శకం 5 వ శతాబ్దమున కాళిదాసు వ్రాసిన రఘు వంశము, కుమారసంభవాదులను ఈరోజు సంస్కృత అభ్యాస వ్యాసంగమున 1 వ తరగతి యని చెప్పదగిన శబ్దమంజరి యందలి ఒక ఇరువది శబ్దములను, ఒక పది సంధి సూత్రములను ఒక నాలుగు సమాసములను నేర్చిన ఎవరైనను తెలిసి కొన వచ్చును. "వాగర్థావివ సమ్ప్రుక్తౌ వాగర్థ ప్రతిపత్తయే" మొదలైన శ్లోకములను మనమందరమూ తెలిసి కొని యుండుట మన యనుభవము లోనిదే. ఆదికవి వాల్మీకి రామాయణమును కొద్ది పాటి శబ్ద జ్ఞానము సంధి జ్ఞానము లతో మనము తెలిసికొనుట అత్యంతము అద్భుతమైన విషయము. ఆంధ్ర సాహిత్యమున మనము చదువుకొను నన్నయ భారత కాలమే క్రీస్తు అనంతర 10 యవ శతాబ్ది. 1300 సంవత్సరముల పూర్వము వ్రాసిన "నుత జల పూరితమ్ములగు నూతులు నూరిటి కంటె ఒక్క బావి మేలు" అను పద్యము ను మనము ఏ సహాయము లేకనే అర్థము చేసికొనుచున్నాము అన్నచో ఈ 1300 సంవత్సరములనుండి లేదా 1800 సంవత్సరములనుండి మనవరకు తెచ్చిన గురువులకు ఋణ పడి యుందుము. ఎదర రాబోవు 2000 సంవత్సరములు లేదా అనంత కాలము వరకు ఈ ప్రవాహమును నిరంతరాయముగా తీసుకొని పోవుట అందు కొరకు సంస్కృతమును తెలిసికొని ముందు తరములకు బోధించుట మన కర్తవ్యమయి ఉన్నది
శబ్దశక్తి
సంస్కృతమునకు ప్రాంతీయభాషలతోగల సంబంధమును గురించిన విచారణము ఇంతటితో నాపి సంస్కృత పదముల సహజశక్తిని గురించి యొకింత చెప్పవలసియున్నది. ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క వదము చెప్పగలదు. నాలుగు ఉదాహరణములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను. యాయజూకః = తఱచుగా యజ్ఞములు చేయువాడు. జిగమిషా = పోవలయునను కోరిక. రామతే = రామునివలె ఆచరించుచున్నాడు. కేశాకేశి = జుట్టుజుట్టు పట్టుకొని యుద్ధముచేయునట్లు. ఇట్టి శబ్దపటుత్వము నేటి ప్రపంచభాషలలో దేనికిని లేదు.
ఇంతియేకాక, రెండు, మూడు అక్షరములు గల చిన్న పదములు గొప్ప భావమును స్ఫురింపజేయుట సంస్కృతములోనే కాంచనగును. ధర్మ శబ్దమువలన దాని నాచరించువాడు మంచిస్ధితిలో ధరింపబడునని బోధింప బడుచున్నది. రథ్యా శబ్దమువలన పూర్వము వీధులు రథము నడుచుటకు తగినంత వెడల్పుగా నుండెనని తెలుపబడును. శరీర శబ్దమువలన నిది శిథిలమైపోవునను (శీర్యతే) తత్వబోధ చేయబడుచున్నది. స్మృతి శబ్దమువలన మనుస్మృత్యాది గ్రంథములు, వేదములను స్మరించుచు వ్రాయబడినవే కాని తత్కర్తల స్వకపోలకల్పితములు కావని తెలియుచున్నది. ఈరీతిగా సంస్కృత శబ్దములకు లోకోత్తరశక్తి కన్పట్టుచున్నది. ఇతర భాషలలో నిది మిక్కిలి తక్కువ. మూలధాతువునకు కాని, మూల పదమునకు కాని దూరము కాకుండ, ప్రత్యభీజ్ఞానావకాశము గల్గునంత దగ్గరలో సంస్కృత పదములు నిలిచి యుండుట యీ పరిస్ధితికి గల కారణములలో నొకటి. ఇతర భాషలలో పదములకు సరియైన వ్యుత్పత్తులు లభించుటే కష్టము; లభించినను అవి భాషా ప్రాజ్ఞులకో, విశేష పరిశోధన గావించిన వారికో మాత్రమే లభించును. అజ్ఞాత వ్యుత్పత్తికములు సంస్కృతములో ఉన్నంత తక్కువగా మరి యెందును లేవు.
ప్రపంచములో ఏ భాషలోని పదములకైనను వ్యుత్పత్తికావలసినచో సాధారణముగా ఇతర భాషలలోనికి పోయి వెదుకవలసి యుండును. ఒక ఇంగ్లీషు పదమునకు వ్యుత్పత్తి కావలసినచో కెల్టిక్, ట్యుటానిక్, హైజర్మన్, లోజర్మన్, లాటిన్, గ్రీక్ మున్నగువానిలో అది లభించును; అట్లే యితర భాషాపదములకును, ఈ మూలభాష లనుకొనబడుచున్నవాని పదములకు వ్యుత్పత్తి కావలసినచోకూడ మరొక భాషలో నన్వేషణము చేయవలసియుండును. గ్రీకులోని పదములకు కూడా అనేకములకు సంస్కృతములో వ్యుత్పత్తి లభించును. ఒక్క సంస్కృతములోని పదములకు మాత్రము వ్యుత్పత్తి అన్య భాషల కేగనక్కరలేకుండ ఆభాషలోనే లభించును. సంస్కృతముయొక్క సర్వ ప్రాచీనతకును స్వతంత్రతకును ఇది ప్రబల నిదర్శనము.
శ్రావ్యత
అర్ధముకానివారికి కూడా శ్రవణ సుఖమును గల్గించు భాష సంస్కృతము. సంస్కృత శ్లోకములను విని యానందింపని వాడుండడు. నేటి భాషలలో కాని, గ్రీకు, లాటినులలోగాని సంస్కృత వృత్తములంత మధురములైన వృత్తములు లేవు. Most musical metres – మధురతమ వృత్తములు - ఆని ఎ. ఎ. మాక్డొనెల్ సంస్కృత వృత్తములను వర్ణించి యున్నాడు. భగవద్గీతాది గ్రంథములలోని అనుష్టుప్ శ్లోకములు, మందాక్రాంత, వియోగిని, ద్రుతవిలంబితము, మాలిని మున్నగు వృత్తములు మధురాతి మధురములై సర్వ మనోరంజక శక్తిగలవై యొప్పుచున్నవి.
చరమపరీక్ష
సంస్కృత పండితులు సరస సాహిత్య సల్లాపములను గావింపునపుడు కాని, వేదాంతగోష్ఠిని నెరపునపుడు కాని, పురాణ ప్రవచనము సలుపునపుడు కాని వినునట్టి నవీన విద్యానాగరికతా సంపన్ను లెల్లరును తద్భాషా సౌందర్యము నకును, విషయ మహత్త్వ మాధుర్యములకును ముగ్ధులగుటను గాంచుచున్నాము. ఆధునిక సభ్యతలో నెంత ఉన్నతస్థతిలో నున్న వారును ఈ భాషాను వాఙ్మయమును నేర్చియుండినచో తమ జన్మ ధన్యమయ్యెడిదని భావించుట సర్వత్ర కాంచనగును. సంస్కృతమునకు గల అద్వితీయ మాధుర్య మహత్త్వముల కిది ప్రబల నిదర్శనము.
ఇట్టి సర్వతోముఖ సౌరభ సౌభాగ్యములు గల్గిన సంస్కృతభాష భారత భాగ్యరాశిలో అమూల్యరత్న మగుటయేకాక భారతీయులకు భారతీయతను నిలబెట్టగల్గిన సర్వప్రముఖ సాధనమై యలరారుచున్నది.
చరిత్ర
ఒకప్పుడు సంస్కృతం భారత దేశ అధికారిక భాష. సామాన్య శకం పూర్వం 4000 సంవత్సరాల పై చరిత్ర కలిగిన భాష.
సాహిత్యం
ప్రాచీన జ్ఞాన సంపదయైన వేదాలు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, మను స్మృతి, వాస్తు శాస్త్రం, అర్థ శాస్త్రం మొదలైనవన్నీ సంస్కృతంలో వ్రాయబడినవే. మధ్య యుగాల్లో తెలుగు కవులు సంస్కృత సాహిత్య పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించినప్పుడు ఎన్నో సంస్కత పదాలు తెలుగు భాషలో చేరాయి. అలాగే ఇతర ద్రావిడ భాషలపై సంస్కృత భాష ప్రభావము ఎంతైనా ఉంది. తెలుగు భాషలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, శూద్రకుడు రచించిన మృచ్చకటికము, భాసుడు రచించిన స్వప్న వాసవదత్తము, శ్రీహర్షుడు వ్రాసిన రత్నావళి, వాత్సాయనుడు వ్రాసిన కామసూత్రములు మొదలైనవి ప్రసిద్ధి చెందిన అనువాద గ్రంథాలు.
రచయితలు
చూడండి
మూలాలు
2. మూలం: "భారతీయవైభవము", జటావల్లభుల పురుషోత్తము ఎం. ఏ. (Lecturer in Sanscrit, S.R.R. & C.V.R College, Vijayawada) గారి చే 1957 లో ముద్రింపబడింది.
బయటి లింకులు
- Rashtriya Sanskrit Sansthan
- Rashtriya Sanskrit Sansthan
- Samskrita Bharati Archived 2008-05-16 at the Wayback Machine
- Transliterator from romanized to Unicode Sanskrit
- Sanskrit Voice: Learn, read and promote Sanskrit
- Sanskrit transliterator with font conversion to Latin and other Indian Languages
- Sanskrit Alphabet in Devanagari, Gujarati, Bengali, and Thai scripts with an extensive list of Devanagari, Gujarati, and Bengali conjuncts
- Academic Courses on Sanskrit Around The World
- Sanskrit Documents
- Sanskrit Documents: Documents in ITX format of Upanishads, Stotras etc. and a metasite with links to translations, dictionaries, tutorials, tools and other Sanskrit resources.
- Read online Sanskrit text (PDF) of Mahabharata, Upanishada, Bhagavad-Gita, Yoga-Sutra etc. as well as Sanskrit-English spiritual Dictionary
- Digital Sanskrit Buddhist Canon
- GRETIL: Göttingen Register of Electronic Texts in Indian Languages, a cumulative register of the numerous download sites for electronic texts in Indian languages.
- Gaudiya Grantha Mandira - A Sanskrit Text Repository. This site also provides encoding converter.
- Sanskrit texts at Sacred Text Archive
- Clay Sanskrit Library publishes Sanskrit literature with facing-page text and translation.
- [2] for texts and word-to-word translations
- [=languageSorter%3A%22Sanskrit%22&and[]=collection%3A%22digitallibraryindia%22] for DLI scanned books
- Primers
- Sanskrit Self Study by Chitrapur Math
- Discover Sanskrit A concise study of the Sanskrit language
- A Practical Sanskrit Introductory by Charles Wikner.
- A Sanskrit Tutor
- Ancient Sanskrit Online from the University of Texas at Austin
- Grammars
- An Analytical Cross Referenced Sanskrit Grammar By Lennart Warnemyr.