ఉత్తర సర్కారులు
ఉత్తర సర్కారులు సర్కారులు | |||||
మద్రాస్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | |||||
| |||||
Flag | |||||
బ్రిటిషు వారి హక్కుభుక్తమైన తరువాత ఉత్తర సర్కారులు | |||||
చరిత్ర | |||||
- | బ్రిటిషు వారు సర్కారులపై హక్కులు కొనడం | 1823 | |||
- | భారత స్వాతంత్ర్యం | 1947 | |||
విస్తీర్ణం | 78,000 km2 (30,116 sq mi) |
ఉత్తర సర్కారులు (సర్కారులు) అంటే స్థూలంగా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నుండి ప్రకాశం జిల్లా ఉత్తర భాగం వరకూ గల ప్రాంతం ఇంకా దక్షిణ ఒడిషాలోని గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, నవరంగపూర్ ఇంకా మల్కనగిరి జిల్లాలు అని చెప్పవచ్చు. అయితే ఈ భౌగోళిక పరిధులు వివిధ కాలాల్లో వివిధ పాలకులకు అనుగుణంగా మారుతూ వచ్చాయి. తెలుగు ప్రజలుండే ఈ ప్రాంతాలు ప్రస్తుతం ఇప్పటి ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఉన్నాయి. చాలా పురాతన చరిత్రకలిగిన ఆ ప్రాంతములలో ఫారసీ మరియూ ఉర్దూ మాటలు అనేకం రాజ్యపరిపాలనకి సంబంధించినవి వాడుకలోకి వచ్చాయి. ఆ మాటల్లో ‘’సర్కార్’’ ఒకటి. తెలుగు నుడికారము తగిలించుకుని "సర్కారులు" అని సర్కారువారు పరిపాలించు ప్రాంతములు అయినట్టుగా చరిత్రలో కనబడుచున్నది. ”సర్కార్”తో బాటుగా వాడుకలోకి వచ్చిన ఇంకొన్ని ఫారసీ-ఉరుదూ మాటలు సందర్బమునకు తగినవి ఉదాహరణకు “సుబా”, “సుబేదార్” (సుబేదారు), తాబేదార్, "అమాన్", ఇజారా, ముజరా,ఇజారా దారులు,“తాకీద్” “కరాయిదా”, "పేష్కష్" “హవేలీ”, “హవేలీ భూములు, పరగణాలు, ”జాగీర్", (జాగీర్దారు), అవేకాక పీఠభూములు (Deccan Plateau) వంటి తెలుగుమాటలు కూడా సర్కారుల చరిత్రలో కనబడుతున్నాయి. ఉత్తరసర్కారుల చరిత్రలో తరుచుగా వచ్చే ఇంకో మాట "సీమ". ఒక కేంద్రముతో కలిసియున్న భూభాగములని తెలుపుటకు వాడినట్లుగా కనబడుతున్నది. ఇంతేకాక. సా.శ. 15 వ శతాబ్దములో వచ్చిన విదేశీయ వర్తక కంపెనీ ప్రతినిధులు పోర్చుగీసు, ఫ్రెంచి, ఆంగ్ల దేశీయులు గూడా ఫారసీ-ఉర్దూ మాటలనే ఉపయోగించి ప్రభుత్వాలు నెలకొల్పి పరిపాలన సాగించారు. ఆవిధంగా అర్ధమైన సర్కారుల చరిత్రలో ఉత్తరసర్కారులు చాల ముఖ్యమైనవి. బహుపురాతన చరిత్రాధారాలు కలిగిన తెలుగు ప్రాంతములు.
భౌగోళికం
భౌగోళికంగా ఉత్తర సర్కారులనబడునవి ఏ ఏ ప్రాంతములు అనే ప్రశ్నవచ్చినప్పుడు ఎవరి పరిపాలనా కాలంలోనో చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే కాలగర్భంలో పరిపాలకులు మారినప్పడల్లా వారు పరిపాలించిన భూభాగములు, కలసియన్న సీమలు, భూపరిధులను విభజించి రాజ్య సరిహద్దులు తిరిగి వ్రాయటం, సీమల పేర్లు మార్చటం జరిగింది. అంతేకాక, విశాల భూభాగమును ముక్కలు ముక్కలుగాచేసి వేరు వేరు ప్రదేశాలలోనున్న ముక్కలను కలుపుకుని తమ రాజ్యములోనివని ఒక ఖండముగా నామాంకితం చేసినప్పుడు సరిహద్దులు చెప్పవలెనన్నచో రాజ్య సరిహద్దులే కాక విడిముక్కల సరిహద్దులు కూడా చెప్పవలసిన అవసరమున్నది. అందువలన భౌగోళికస్థితితో బాటుగా చరిత్రకూడా తెలుసుకోవాలి. సా.శ. 1480 లోబహమనీ సుల్తాన్ మహమ్మద్ షా సామ్రాజ్యములో భాగముగానున్న సర్కారులనబడినవి: కొండపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, మచిలీబందరు (మచిలీపట్నం). తరువాత బహమనీ సుల్తానుల వారసులు గోల్కొండను రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ నవాబు (కుతుబ్ షాహి) పరిపాలనలో చికాకోలు, కూడా 1575 లో ఉత్తర సర్కారుల జాబితాలో చేరింది. ఇంకా కాలపరిధి మనవైపు జరిగినకొలదీ ఉత్తర సర్కారులనబడిన భూభాగంలో ఇంకా కొన్ని మార్పులు చెంది ఇంకా పెద్దపరిధిగా మారింది. 18వ శతాబ్దములో హైదరాబాదు నిజాం పరిపాలనలో నున్నప్పడు ఉత్తర సర్కారులనబడినవి ఐదు - గుంటూరు (మూర్తజానగరు ( కొండవీడు)), కొండపల్లి (ముస్తఫానగరం), ఏలూరు, రాజమహేంద్రవరం, చికాకోలు (శ్రీకాకుళం). మోటుపల్లి నుండి గోదావరి దాకానున్న పీలికలాంటి భూభాగము మచిలీపట్టణం హవేలీ అనిప్రసిధ్ధి చెందినది. ఆక్కడి భూములు హవేలీ భూములు. 19వ శతాబ్దంలో ఆంగ్లేయుల పరిపాలనలో ఉత్తర సర్కారులనబడిన భూభూగంలో ఇప్పటి ఒడిస్సాలోని జిల్లాలు; గజపతి, కొరాపుట్, గంజాం ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలు; శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు ప్రకాశం జిల్లాలు రాకముందు ఒక కేంద్రపరిధిలోనున్న అనేకప్రదేశములను కలిపి ఆ కేంద్రనామంతో సీమ (ఉదాహరణకు ఏలూరుసీమ, గుంటూరుసీమ) అని చెప్పబడినట్లు చరిత్రలో కనబడుచున్నది.[1]
చరిత్ర
ఉత్తర సర్కారుల చరిత్ర చాలా పురాతనమైనదగుటచే అనేక మలుపులు తిరిగి విశేషములతో గూడిన పెద్ద చరిత్ర. ఆ కాలంనాటి అనేక జమీందారీ సంస్థలు, జమీందారీల వారసత్వంకోసం జరిగిన రాజకీయాలలోనూ, దేశీయ పరిపాలకుల రాజకీయకుట్రలతో విదేశీయ పరిపాలకులను ఆశ్రయించటంవలనే కాక, విదేశీయ సంస్థల ధన సంపాదన మరియూ పరిపాలనాధికార కాంక్షల వల్ల జరిగిన యుధ్దములు మొదలగు చరిత్రాంశములతోనిండిన ఈ ఉత్తర సర్కారుల చరిత్ర సుప్రసిధ్ధమైనది. ఉత్తరసర్కారుల చరిత్రలో ఆంగ్లేయులస్వాధీనమైనతరువాత వారి పరిపాలనా ఘట్టం (1823-1947) ప్రాముఖ్యత వహించింది. ఎందువలనంటే వారి పరిపాలనా కాలము దాదాపుగా శతాబ్దమున్నర పాటు నిరవధికముగా సాగినందుననూ, ఆ కాలపరిధిలో వారు ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు ముఖ్యముగా పోలీసు, న్యాయవ్యవస్థ, పరిపాలనా యంత్రాంగములోనూ, విద్యారంగములోనూ, స్వతంత్ర భారతదేశాభివృధ్ధికి తోడ్పడినవి. అందువలన ఈ ఉత్తర సర్కారుల చరిత్ర మొత్తం రెండు భాగములుగా చెప్పటమైనది.
ఆంగ్లేయులకు స్వాధీనం కాకపూర్వం
ఆంగ్లేయులు భారతదేశమున పరిపాలన చేయటానికి చాలా ముందు, చరిత్రలో ఈ ఉత్తర సర్కారులనబడిన ప్రాంతములు సా.శ. 13 శతాబ్దముకన్నా ముందు పరిపాలించిన కాకతీయ రాజుల వంశీయుడైన ఓరుగంటి ప్రతాపరుద్రుని సామ్రాజ్యము లోనివి. అతడి తదనంతరం రెడ్డి రాజులు కొంతకాలం పరిపాలించారు. తరువాత రాజమహేంద్రవరానికి ఉత్తర భాగంలో నున్న భూభాగం కళింగ నేలిన రాజులలో ఒకరైన గజపతివంశ రాజుల వశమైంది. శ్రీకృష్ణ దేవరాయలు కళింగరాజులను జయించి, కొంతభాగాన్ని విజయనగర సామ్రాజ్యములో కలుపుకున్నారు. గుంటూరు, మచిలీపట్టణం సీమలు గూడా రాయలవారి పరిపాలనలో నుండెను. సా.శ. 1471 లో కళింగరాజు వారసులైన గజపతిరాజుల మధ్య కలిగిన వైషమ్యాలతో వారిలో ఒక గజపతి రాజు పర్షియా (ఇప్పటి ఇరాన్) బహమనీ సుల్తాన్‌ను (సుల్తాన్ మహమ్మద్ షా) ఆశ్రయించి అతనికి సామంతరాజుగా లొంగిపోయి అతనిని మన దేశముకు ఆహ్వానించి దండయాత్ర చేయించ బట్టి సా.శ.1480 నుండి భారతదేశములోని ఈ ప్రాంతములు బహమనీ సుల్తానుల పరిపాలనలోకి వచ్చినవి. సా.శ. 1480 నాటికి బహమనీ సుల్తాన్ పరిపాలన క్రింద ఉన్న ప్రాంతములు: కొండపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరం సీమలోదక్షిణ భాగం, గుంటూరు, మచిలీపట్టణం సీమలు.
గోల్కొండ నవాబు పరిపాలన
క్రీ. శ 1512 నాటికి బహమనీ సుల్తాను మహమ్మద్ షా మరణానంతరం జరిగిన రాజ్యవిభజనలో భారతదేశములోని వారి సామ్రాజ్యం కుతుబ్ షాహీ వంశీయుడైన ఇబ్రహీం అనే నవాబు వాటాగా వచ్చింది. కుతుబ్ షాహీ ఇబ్రహీం పీఠభూమిలోని గోల్కొండను రాజధానిగా చేసుకుని ఉత్తర సర్కారులను పరిపాలించాడు. అదుకని ఆయన గోల్కొండ నవాబుగా ప్రసిధ్ధి. 1571 దాకా రాజమహేంద్రవరం, చికాకోలు పూర్తిగా ఆ నవాబుగారి వశం కాలేదు (అవి కళింగరాజు స్వాధీనములోనుండెడివి). 1471లో లాగనే కళింగరాజుల దగ్గిర నుండి పెద్దాపురానికి ఇజారా (శిస్తు వసూళ్ళ హక్కు)ను పొందిన వత్సవాయి వంశపు జమీందారుని తిరుగుబాటు కుట్రల వల్ల 1571 లో రాజమహేంద్రవరం, చికాకోలు పూర్తిగా గోల్కొండ నవాబు చేజిక్కాయి.
హైదరాబాదు నిజాం పరిపాలన
గోల్కొండ నవాబు పరిపాలన జరుగుతూ ఉండగా ఢిల్లీ లోని మొగలు చక్రవర్తి ఔరంగజేబు దక్షిణభారతదేశ దండయాత్రచేసి గోల్కండను చేజిక్కించుకున్నాడు. సా.శ. 1707 లో చక్రవర్తి మరణానంతరం ఆయన ప్రతినిధి నిజాం ఉల్ ముల్క్‌ను దక్షిణ దేశానికి మొగల్ సామ్రాజ్య సుబేదారుగా సా.శ. 1713 లో ప్రకటించారు. నిజాం తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాదుకు మార్చాడు. అప్పటినుండి హైదరాబాదు నిజాంగా ప్రసిధ్థి గాంచాడు. తన దృష్టిని కళింగరాజ్య స్వాధీనంలోనున్న ఉత్తరసర్కారుల వైపు మళ్లించి కర్నాటక నవాబుగా ప్రసిధ్ధిచెందిన అన్వరుధ్ధీన్ ఖాన్‌ను చికాకోలు (శ్రీకాకుళం) సర్కారుకునూ, అతడి సహచరుడు రుస్తుంఖాన్‌ను రాజమహేంద్రవరం సర్కారుకూ పరిపాలకునిగా నియమించాడు. క్రూరకృత్యములకు ప్రసిధిచెందిన రుస్తుమ్‌ఖాన్ పన్నువసూళ్లుచేసే జమీందారులు (ఇజారాదారులు) పన్నువసూళ్ళలో అవకతకలేమైనా జరిగితే తలలు నరికించి రాజమహేంద్రవరలోనూ, మచిలీబందరులోనుా వ్రేళ్లాడగట్టిన సంఘటనలు చరిత్రలోకెక్కినవి. నిజాం ఉల్ ముల్కు1724 నుండి 1748 దాకా పరిపాలించాడు. అతని తరువాత నిజాం వారసత్వానికి అతని మనుమడు నాజిర్ జంగ్, కుమారుడు ముజఫర్ జంగ్ పోటీపడ్డారు. బ్రిటిష్ ఫ్రెంచి వారు చేరో పక్షంతో చేతులు కలిపారు. నాజిర్ జంగ్ రెండవ కర్నాటక యుధ్ధం (1748-1750) లో బ్రిటిష్ వారి మిత్రపక్షం. వారి సహాయంతోనే నిజాముగా సింహాసనం అధిష్ఠించి 1748 నుండి 1750 వరకూ నిజాముగా పరిపాలించాడు. అతని తరువాత 1750 లో ముజఫర్ జంగు ఫ్రెంచివారి సహకారంతో అధికారంలోకి వచ్చాడు. కానీ సంవత్సరంలోనే అతని సోదరుడు సలాబత్ జంగ్ కుట్రలతో పదభ్రష్టుడై హతమార్చబడ్డాడు. సలాబత్ జంగ్ 1751 నుండి 1762 దాకా పరిపాలించాడు. ముజఫర్ జంగు, సలాబత్ జంగ్ ఇద్దరూ కూడా ఫ్రెంచి గవర్నరు డూప్లేకి మిత్రపక్షము. సలాబత్ జంగ్ తరువాత, 1762 నుండి నిజాం అలీఖాన్ నిజాముగా చాలా కాలం 1803 దాకా బ్రిటిష్ వారి మిత్రపక్షముగా పరిపాలించాడు.
డూప్లే-క్లైవు కార్యకాలమునాటి హైదరాబాదు నిజాములు, వారి పరిపాలనా కాలములు
నిజాం ఉల్ ముల్క్ అసిఫ్ ఝా I (మీర్ ఖమర్ ఉద్దీన్ ఖాన్) (1724-1748), నాజిర్ జంగ్ (మీర్ అహమద్ అనీ ఖాన్)(1748-1750), ముజఫర్ జంగ్(1750-1751), సలాబత్ జంగ్ (1751-1763), నిజాం ఉల్ ముల్క్ అసిఫ్ ఝా II(1762-1803)
ఫ్రెంచి వర్తక కంపెనీ స్వాధీనంలోని సర్కారులు
వ్యాపార నిమిత్తము భారతదేశములో ప్రవేశించిన విదేశీయులలో ఫ్రాన్సు దేశపు వర్తక కంపెనీ ఒకటి. వీరు కూడా ఆంగ్లేయుల లాగే వర్తకంతో పాటు రాజకీయం, సైనిక సిబ్బందిని అండగా నుంచుకుని దేశంలో ప్రభుత్వ పరిపాలనను చెలాయించారు. దక్షిణ భారతదేశంలో మొగలు చక్రవర్తికి సుబేదారుడైన హైదరబాదు నవాబు నిజాం ఉల్ ముల్కు తరువాత, సా.శ. 1750 లో ముజపర్ జంగ్ ఫ్రెంచి వర్తక కంపెనీ ప్రధానాధికారి డూప్లే ( Joseph Francois Dupleix ) సహాయంతో సుబేదారుడైనాడు. ఆ కృతజ్ఞతతో ముజఫర్ జంగ్ ఫ్రెంచివారికి ఉత్తరసర్కారులోని ప్రధాన కేంద్రమైన మచిలీపట్టణం ఆ పరిసర ప్రాంతములను ఫ్రెంచివారికి స్వాధీనంచేశాడు. డూప్లే తన సైనికాధికారి బుస్సీ మార్కీస్ దే బుస్సీ (Marquis de Bussy-Castelnau) ని మచిలీపట్టణం సర్కారునకు పరిపాలనాధికారిగా నియమించాడు. ముజఫర్ జంగ్ తరువాత సుబేదారుడైన సలాబత్ జంగ్ సా.శ. 1752 లో ఫ్రెంచివారి సహాయం పొందిన కృతజ్ఞతతో ఉత్తరసర్కారుల నంతా ఫ్రెంచివారికి స్వాధీనంచేశాడు. బుస్సీ పరిపాలనలో ముఖ్య ఘట్టములుగా చెప్పదగ్గవి బొబ్బిలి యుధ్ధం, ఆంగ్లేయులతో యుధ్ధం.
బొబ్బిలి యుధ్ధం
ఉత్తరసర్కారుల పరిపాలకుడైన ఫ్రెంచి సైన్యాధికారి బుస్సీ అక్కడగల అనేక జమీందారీ సంస్ధానములపై ఆంక్షలు విధించి వారు వసూలుచేసిన పన్నులలో మూడవవంతు ఫ్రెంచివారికి చెల్లించనలెననియూ వారి వ్యవహార పర్యవేక్షణకై విజయనగరం జమీందారుడైన విజయరామరాజును నియమించాడు. ఆ వ్యవస్థ చాలమంది జమీందారులకు ఆందోళనకరమయింది. చిక్కాకోలు (శ్రీకాకుళం) సర్కారులోని బొబ్బిలి సంస్థానధిపతి బొబ్బిలి రంగారావుకు ఇది దుస్సహనమైనది. ఆయన బహిరంగంగా బుస్సీని ధిక్కరించటం ఒక ఐతిహాసిక సంఘటన. ఆ ఘటనను దిట్టకవి నారాయణకవి రచించిన రంగరాయ చరిత్రములో ఉత్పలమాల తేటగీతి పద్యాలలో వర్ణించి చెప్పారు.[2] మిగతా జమీందార్లతో కలసి ప్రతిఘటించటానికి నిశ్చయించారు. శ్రీకాకుళం నవాబు జాఫరల్లీ ఖాన్ కూడా ఆ ఉద్యమానికి సానుభూతుడుగా నున్నాడు. ఆ తిరుగుబాటు నణచుటకు బుస్సీ తన ఫ్రెంచిసైన్యము తోను, వేలకొలది దేశీయ సిపాయిలతోనూ విజయరామరాజు సైన్యము చేయూతగా సా.శ. 1756 నవంబరు 16 వ తేదీన బొబ్బిలికోటను ముట్టడించాడు. ఆ యుధ్ధమే సుప్రసిధ్ధమైన బొబ్బిలి యుధ్ధం.
ఫ్రెంచివారితో ఆంగ్లేయుల యుధ్ధం
జమీందార్ల తిరుగుబాటు అణగిన తరువాత కొంతకాలానికి విజయరామరాజు పరమదించగా ఆనందరాజు (ఆనంద గజపతి) విజయనగరం జమీందారైనాడు. బుస్సీ తరచుగా హైదరాబాదులో గడుపుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తర సర్కారుల చరిత్ర మరో మలుపు తిరగనారంభించింది. ఆనందరాజుకు బుస్సీచలువ లభించలేదు. దక్షిణభారతదేశములో ఫ్రెంచివ్యాపార సంస్థవారి పరిపాలనకు రాజధాని పాండిచ్చేరి (పుదుచ్చేరి). అప్పటికి ఫ్రెంచిసంస్థ వారి గవర్నరు లాలీ. ఆంగ్లేయ వ్యాపారసంస్థ వారి పరిపాలనకు చెన్నపట్నం రాజధాని. ఫ్రెంచి గవర్నరు లాలీ చెన్నపట్నాన్ని ముట్టడించటానికి చేసే ప్రయత్నంలో హైదరాబాదునుండి వారి సైన్యాధిపతి బుస్సీను పిలిపించటం, అదే సమయంలో ఫ్రెంచివారితో అసంతృప్తుడైన ఆనందరాజు చెన్నపట్నంలోని ఆంగ్లేయలకు ఉత్తరసర్కారులకు రమ్మని కోరటం జరిగింది. కానీ వారు రానందున వంగరాష్ట్రము (ఇప్పటి పశ్చిమ బెంగాలు) లోని కలకత్తా (కోల్‌కాతా)ను రాజధానిగా చేసుకుని వరిపాలించుచున్న ఆంగ్లేయ సంస్థ సేనాధిపతి రాబర్టు క్లైవుని సా.శ. 1758 లో ఆనందరాజు ఆశ్రయించాడు. క్లైవు తనక్రింది సేనాపతి కర్నల్ ఫ్రాన్సిస్ ఫోర్డును సైన్యముతో ఉత్తర సర్కారులకు పంపించాడు. అప్పటికి ఉత్తర సర్కారులు బుస్సీ తరువాత ఫ్రెంచివారి సేనాపతిగానుండిన కాన్ ఫ్లాన్సు పరిపాలనలో నుండేవి. ఆంగ్లేయులకూ ప్రెంచివారికీ పెద్దాపురం సమీపంలోని చెందుర్తి వద్ద జరిగిన యుధ్ధంలో ఆంగ్లేయ సైన్యం కర్నల్ ఫోర్డు నాయకత్వంలో ఫ్రెంచి వారిని ఓడించింది. ప్రెంచి సేనాపతి కాన్ ఫ్లాన్సు మచిలీబందరుకు పారిపోయి అక్కడనుండి హైదరాబాదు నిజాం సహాయం కోరాడు. కానీ నిజాం వచ్చేలోపలే కర్నల్ ఫోర్డు తనసైన్యముతో వెళ్లి 1759 ఏప్రిల్ లో మచిలీబందరును కూడా ఆక్రమించాడు. ఆ విధంగా ఉత్తర సర్కారులలో ఫ్రెంచి వారి పరిపాలన అస్తమించింది.
ఉత్తర సర్కారులు ఆంగ్లేయులకు స్వాధీనమైన చరిత్ర
సా.శ. 1759 ఏప్రిల్ లో కర్నల్ ఫోర్డ్సు మచిలీబందరులో ఫ్రెంచివారిని ఓడించి ఆక్రమించిన దగ్గరనుండి ఉత్తర సర్కారులు ఆంగ్లేయుల వశము అవటానికి చాలా కార్యక్రమం జరిగింది, చాలా కాలం పట్టింది. కేవలము వారు సైనికబలగంతో సర్కారులంతా స్వాధీనం చేసుకోలేదు.1765 లో రాబర్టు క్లైవు సరాసరి మొగలాయి చక్రవర్తినుంచి తీసుకున్న పట్టాతోనే గాక రాజనీతితో అప్పటి ఉత్తరసర్కారుల పరిపాలకుడు ముగలాయ చక్రవర్తి సుబేదారుడైన హైదరాబాదు నిజాంగారితో అనేక మార్లు ప్రతిపాదనలతోనూ,వప్పందాలతోనూ, నిజాంసోదరులతోనూ, తాబేదార్లతో గూడా రాయబారము బహిరంగముగానూ, చాటుగాను చేసి మొత్తానికి న్యాయబద్దముగా స్వాధీనముచేసుకున్నట్లుగా కనబరచారు ఆంగ్లేయులు. 1823 దాకా ఆంగ్లేయులకు ఉత్తరసర్కారులు పూర్తిగా స్వంతమవలేదు.
1759--1823 ల మధ్య చరిత్ర
ఆ ఆరు దశాబ్దములలో చాల విశేషమైన చరిత్రాంశములు ఆంగ్లేయులకీ హైదరాబాదు నిజాంగారికీ మధ్య జరిగినవి క్లుప్తముగానైనా సంవత్సరాలవారీగా క్రమబధములో చెప్పటం అవసరం.
- 1759 లో సలాబ త్ జంగ్ నవాబుగారితో జరిగిన వప్పందం ప్రకారం తన రాజ్యములో 20 మైళ్ళ వెడల్పుగల తూర్పుసముద్రతీరాన్ని ఆంగ్లేయులకిచ్చారు. అందులోనివి మచిలీబందరు, నిజాంపట్నం, గుడివాడ, కొండపల్లి సర్కారులో కొంత భాగము. అప్పటిలో సలాబత్ గారికి ఒకప్రక్క తన సోదరులైన బసాలత్ జంగ్ మరియూ అలీ ఖాన్ గార్లు అధికార కాంక్షతో చేసే కుట్రలవలననూ ఇంకొక ప్రక్క పడమరనుండి మహారాష్ట్రులో దండయాత్రల వల్లనూ ఉత్తరసర్కారులలో నవాబు సలాబత్ జంగ్ గారి అధికారం అంతంతమాత్రమేయుండెను.
- 1761 లో అలీఖాన్, తన సోదరుడైన సలాబతు జంగ్ ని నిర్బంధించి(తర్వాత హతమార్చి) తనే సుబేదారున్నాడు. మొగలాయి చక్రవర్తి అలీఖాన్ సుబేదారునిగా నియమించారు. నిజాం అలీఖాన్ 1762 లో ప్రతిపాదించినది ఆంగ్లేయులు తనకు సైనిక సహాయం చేసే పధ్ధతిన తన సోదరుడైన బసాలత్ జంగ్ పరిపాలనలోనున్న గుంటూరు సర్కారు తప్ప మిగత నాలుగు సర్కారులు ఆంగ్లేయులకిస్తానన్న ప్రతిపాదనను ఆంగ్లేయులు స్వీకరించని కారణంగా సలాబత్ జంగ్ ఆ నాలుగు సర్కారులనూ తన తాబేదారుడైన హుసేనల్లీ క్రిందనే వుంచాడు. ఆ పరిస్థితిలో ఆంగ్లేయులకూ హుసేనల్లీకీ మద్య వప్పందంజరిగి తనకు సర్కారులమీద వచ్చే ఆదాయం సగం ఆంగ్లేయులకిచ్చేటట్టూ వారు ఆ సర్కారులను స్వాధీనముచేసుకునేటట్టు పధ్ధతిన హుసేనల్లీ ఆంగ్లేయులకు పట్టానిచ్చాడు. కానీ అది నిజాం అలీఖాన్ గారికి ఇష్టంకాలేదు. ఆ పట్టా రధ్దుచేసుకుని ఆంగ్లేయులను సర్కారులను వదిలిపెట్ట మంటే ఆంగ్లేయులు సర్కారులను స్వాధీనముచేసుకున్నందుకైన ఖర్చులు (ముజరా)కావలన్నారు. అందుకు కూడా నిజాం సిధ్ధపడినట్లు లేదు. 1763 లో మచిలీపట్నంలో ఆంగ్లేయ ఛీఫ్ ఇన్ కౌన్సిల్ జాన్ ఫైబస్గారి తరఫున వారి దుభాషి కాండ్రేగుల జోగిపంతులునూ నిజాంగారి ఫౌజుదారుకునుా జరిగిన వప్పందం ప్రకారం నిజాం ఆంగ్లేయులకు రూ 23700 ఖర్చులక్రింద ఇచ్చి ఆంగ్లేయులచేతులనుండి సర్కారులను విడిపించుకున్నారు.
- సర్కారులు ఆంగ్లేయుల స్వాధీనములో లేవనిన సమయంలో విజయనగరం రాజు వచ్చి రాజమహేంద్రవరం ఆక్రమిచుకున్నాడు. ఇక చరిత్ర మళ్లీ తిరిగి ఇదివరకటిలాగ పునరావృత్తమగునట్లైనది. సర్కారులు మళ్లీ ఫ్రెంచి వారి చేతులలోకి వెళుతుందని ఆంగ్లేయులు 1764 లో నిజాంగారికి పంపిన రాయబారము నిష్ప్రయోజనమైనది. కొండపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరం సర్కారులను అప్పటికి ఆంగ్లేయుల సహాయంతో హుస్సేనల్లీ స్వాధీనములో నున్నవి.
- 1765 లో కలకత్తాలోని ఆంగ్లేయ ప్రధానసైనికాధికారి రాబర్టు క్లైవు ఢిల్లీలోని మొగలాయి చక్రవర్తితో సంప్రతింపులు జరిపి ఉత్తరసర్కారులకు పట్టా సంపాదించాడు. ఆ పట్టా షరతులను మచిలీ పట్నంలో ప్రచురించారు.
- కల్లియండ్ CALLIAND అనే సైనికాధికారిని పంపి ఆంగ్లేయులు కొండపల్లి జిల్లాను స్వాధీన పరుచుకున్నారు.
- 1766 నవంబరు 11 న ఆంగ్లేయులకు నిజామల్లీ గారీకి జరిగిన సంధి ప్రాముఖ్యమైనది. ఆ వప్పందం ప్రకారం హుస్సేనల్లీని అతని సైనికులనూ తీసి ఆంగ్లేయులే జమీందర్లద్వారా సిర్తు వసూలు చేనుకునేటట్లునూ.ఆంగ్లేయుల నిజాంగారికి కొంత సైనిక సహాయం చేస్తువుండేట్లునూ, సైనిక సహాయం చేయలేని పక్షంలో నిజాంగారికి ఖర్చులకు సాలునా 9 లక్షలు నిజాంగారికియవలసినదనీనూ, గుంటూరు సర్కారు మాత్రం నిజాంగారి సోదరుడు బసాలాత్ జంగ్ కు జీవితాంతం స్వాధీనములోనుండేటట్లును, సర్కారులలోని వజ్రపు గనులను నిజామల్లీ గారి హక్కుక్రింద వుడేటట్లు జరిగింది.
- ఆ వప్పందమైనతరువాత నిజాం మైసూరు నవాబుగారైన హైదర్ అలీ ఖాన్ ( హైదర్ అలీ )తో చేతులు కలిపి ఆంగ్లేయులను వ్యతిరేకించి తిరుగుబాటు చేయ ప్రయత్నంచి విఫలులైనట్లు చరిత్రలో కనబడుచున్నది.
- 1768 మార్చి 1 తారీకున నిజాం మళ్లీ ఆంగ్లేయులకు సానుకూలుడై 1765 లో ఢిల్లీ చక్రవర్తి ఇచ్చిన పట్టాను అంగీకరస్తూ కొన్ని కొత్త సంధిషరత్తుల ప్రకారం ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు స్వాధీనము చేశారు. ఆ వప్పందంలో ఆంగ్లేయులు నిజాంగారికి సాలూనా 5 లక్షలు ఇచ్చేటట్లునూ అ ఇవ్వబోయే సొమ్ములోంచే నిజాం ఆంగ్లేయులకు ఇవ్వవలసిన యుధ్ధపు ఖర్చులక్రింద 25 లక్షలు మినహాయించుకునేటట్లునూ ఏర్పాటు జరిగింది
- 1769 హుసేనల్లీకిచ్చిన ఇజారా కౌలు సమాప్తమైన తరువాత అతని పరిపాలనలోనున్న సర్కారులను ఆంగ్లేయులే పరిపాలనకు పూనుకున్నారు.
- ఆదోని రాజధానిగా చేసుకుని గుంటూరు సర్కారును పరిపాలించుచున్న సలాబత్ జంగ్ ప్రెంచి సైనికులను నియమించుచున్నాడని తెలుసుకున్న ఆంగ్లేయులు 1778 లో బసాలత్ జంగ్ తో ఒక వప్పందం చేసుకుని ఫ్రెంచి సైనికులను తీసివేసేటట్లు ను, గుంటూరు సర్కారును ఆంగ్లేయులకు కౌలుకిచ్చేట్లునూ, బసాలత్ కు వచ్చే ఆదాయం ఇదివరకు ఎంతవున్నదో అంత ఇచ్చేటట్లునూ వప్పందం చేసుకున్నారు.
- మొగలాయి చక్రవర్తి తమకు పట్టానిచ్చారు కాబట్టి నిజాంగారికి తాము పేష్కస్ ఏమీ చెల్లించకల్లేదన్న ధోరణితోనున్న ఆంగ్లేయులను 1779 లో మళ్లీ నిజాం వ్యతిరేకించి హైదరాలీతో చేయికలపసాగించారు
- ఆ పరిస్థితులలో ఆంగ్లేయుల రాజనీతికుశలతచూపించి తామే ఉత్తరసర్కారులకు ప్రభువలమనే తమ వాదనను మానుకుని నిజాం మంచిచేసుకున్నారు. 1780 లో గుంటూరు సర్కారులను బలసాలత్ జంగుకు తిరిగి ఇచ్చేశారు.
- 1782 లో బసాలత్ జంగ్ చనిపోయినా గుంటూరు సర్కారు ఆంగ్లేయులకు 1788 దాకా పూర్తిస్వాధీనమవలేదు. ఆ గుంటూరు సర్కారుమీద వారు సాలునా 7 లక్షలు కప్పము నిజాంగారికి చెల్లించేవారు.
- 1803 సంవత్సరములో నిజామల్లీ చనిపోయారు. తరువాత వచ్చిన నిజాంగారికి కప్పము చెల్లిస్తూవచ్చారు ఆంగ్లేయులు 1823 దాకా
- సాలూనా కప్పంకట్టేబదులు ఒకే సారిగా రూ 1200లక్షలు నిజాంగారికి చెల్లించి 1823 సంవత్సరములో ఆంగ్లేయకంపెనీ వారు సర్కారులను తమ స్వంత రాజ్యముగా చేసుకున్నారు. అందుకని ఉత్తర సర్కారులలో ఆంగ్ల ప్రభుత్వ స్ధాపనమైన సంవత్సరము 1823[3]
మూలాలు
- ఉత్తరసర్కారుల చరిత్ర కథలు-గాధలు 5వ భాగము (2019) దిగవల్లి వేంకట శివరావు పుటలు53-68. నవచేతన పబ్లిషింగ్ హౌస్