స్వప్న సుందరి
స్వప్న సుందరి 1950లో విడుదలైన తెలుగు సినిమా.[1][2] ప్రతిభా ఫిలింస్ పతాకంపై నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన జానపద చిత్రం.అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు, గరికపాటి వరలక్ష్మి, కస్తూరి శివరావు మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం సి.ఆర్.సుబ్బరామన్ ఘంటసాల సమకూర్చారు.
స్వప్న సుందరి (1950 తెలుగు సినిమా) | |
చందమామ పత్రికలో స్వప్న సుందరి ప్రకటన | |
---|---|
దర్శకత్వం | ఘంటసాల బలరామయ్య |
నిర్మాణం | ఘంటసాల బలరామయ్య |
తారాగణం | అంజలీదేవి, జి.వరలక్ష్మి, నాగేశ్వరరావు, శివరావు, ముక్కామల, బాలసరస్వతి, సీత |
సంగీతం | సి.ఆర్.సుబ్బురామన్, ఘంటసాల |
నేపథ్య గానం | ఆర్.బాలసరస్వతీ దేవి, ఘంటసాల, జి.వరలక్ష్మి, పి.లీల, జిక్కి |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | పి.శ్రీధర్ |
నిర్మాణ సంస్థ | ప్రతిభ ఫిలిమ్స్ |
నిడివి | 173 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నేపద్యం
అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమలో ప్రవేశించిన తొలి రోజుల్లో జానపద కథానాయకునిగా ఎక్కువ చిత్రాల్లో నటించి, రాణించారు. ఆ ఇమేజి దృష్టిలో వుంచుకొని నిర్మాత బలరామయ్య ఈ ‘స్వప్నసుందరి’ జానపద చిత్రానికీ అక్కినేని వారినే హీరోగా నిర్ణయించి నియమించారు. సముద్రాల సీనియర్ చిత్రానికి పాటలు-మాటలు సమకూర్చారు. కాశీమజిలి కథలను అనుసరించి, చక్కని అల్లికతో చిత్రకథను రూపొందించారు. ఈ చిత్రానికి వీనులవిందైన సంగీతాన్ని సి.ఆర్. సుబ్బరామన్ సమకూర్చగా సంయుక్త సంగీత దర్శకునిగా ఘంటసాలవారు పనిచేశారు. టైటిల్స్‌లో వారి పేరు జి.వి.రావుగా ప్రకటించారు. నృత్యం-వేదాంతం రాఘవయ్య, ఛాయాగ్రహణం- శ్రీ్ధర్, ఎడిటింగ్- జి.డి.జోషి, స్టంట్స్- కత్తిసాధన, స్టంట్- సోము, స్వామినాథన్ అండ్ పార్టీ, నిర్మాణ నిర్వాహకుడు - ప్రతిభాశాస్ర్తీ (టి.వి.ఎస్.శాస్ర్తీ) నిర్మాత-దర్శకుడు: ఘంటసాల బలరామయ్య.
సంక్షిప్త చిత్రకథ
అనగనగా ప్రభు అనే ఒక రాజకుమారుడు అబ్బి అనే జతగాడిని తీసుకొని దేశాటనకు బయల్దేరతాడు. కలలో ఒక సుందరి మరులు గొలిపి మాయమవుతుంది. ఆమెను చూడాలని ప్రయత్నించిన ప్రభు ఒక కోయరాణి వలలో చిక్కుకుంటాడు. ఆమె ప్రేమను కాదని తప్పించుకొని బయటపడ్డ ప్రభుకు నిజంగానే స్వప్నసుందరి కనిపించి తన లోకానికి తీసుకొని వెల్తుంది. ఇంతలో యీ విషయం తెలుసుకొన్న ఆ లోక పాలకుడు భూలోకానికి పొమ్మని ఇద్దర్ని పంపించి వేస్తాడు. అప్పుడు హాయిగా ఇద్దరూ భూలోకంలో విహరిస్తుంటారు. ఇంతలో ఓ మాయల మరాఠీ తరహా మాంత్రికుడు పున్నమి విందుకోసం సుందరిని అపహరించి తన మందిరానికి చేరుస్తాడు. ప్రభు ఓ పూటా కూళ్ళమ్మ సహాయంతో మాంత్రికుని జాడ తెలుసుకొని అక్కడికి ప్రవేశించగా మాంత్రికుడు బంధిస్తాడు. ఇంతలో ప్రభు జాడ తెలుసుకొన్న కోయరాణి తన పరివారంతో మాంత్రికుని గుహకు చేరుకొని ప్రభుకు విముక్తి కలిగిస్తుంది. ప్రభు మాంత్రికున్ని సంహరిస్తాడు. ఆ పోరాటంలో కోయరాణి ప్రాణాలు కోల్పోతుంది. ప్రభు తన స్వప్నసుందరి కలుసుకుంటారు.
విశేషాలు
ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని చాలా విమర్శలు వచ్చినట్లు అనిపిస్తుంది. వాఠిని నిరోధించమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడానికి రూపవాణి ఒక వినతి పత్రాన్ని తమ పత్రికలో ప్రచురించింది. [1][permanent dead link]
పాటలు
- కానగనైతివిగా నిన్ను కానగనైతివిగా(ఘంటసాల వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతి దేవి)
- సాగుమా సాహిణీ ఆగని వేగము జీవితము (ఘంటసాల వెంకటేశ్వరరావు )
- ఓ పరదేశి మరే జాడల చూడవురా ( ఘంటసాల వెంకటేశ్వరరావు, వరలక్ష్మి)
- నీ సరి నీవేనే జవానా ( ఘంటసాల వెంకటేశ్వరరావు, వరలక్ష్మి)
- కోపమేల నాపైన నాగిణీ (కస్తూరి శివరావు )
- నిజమాయె కల నిజమాయె ( ఘంటసాల వెంకటేశ్వరరావు )
- నటనలు తెలుసునులే ఓ సొగసరి (రావు బాలసరస్వతి)
- నిన్నె వలచె కొనరా తొలివలపు ( రావు బాలసరస్వతి )
- ఈ సీమ వెలసిన హాయి ( రావు బాలసరస్వతి, ఘంటసాల వెంకటేశ్వరరావు )
- కానగనైతినిగా నిన్ను ( ఘంటసాల వెంకటేశ్వరరావు )
- పలుకే పిల్లా నాతో ( కస్తూరి శివరావు , జిక్కి)
- ఓహోహో మారాజా చూడచక్కని వాడా(కె.రాణి బృందం)
- మరలిరావో మనసు లేదో మనకథే(జి.వరలక్ష్మి)
- కాదోయీ వగకాడా కల కాదోయి(ఘంటసాల వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతి దేవి)
మూలాలు
- ↑ APK. "Swapna Sundari (1950)". Cinegoer. Archived from the original on 14 January 2007. Retrieved 16 February 2010.
- ↑ "Swapna Sundari (1950)". Idlebrain.com. Archived from the original on 11 December 2000. Retrieved 16 February 2010.