స్వాతి నక్షత్రం (ఖగోళశాస్త్రం)
Observation data Epoch J2000 Equinox J2000 | |
---|---|
Constellation | Boötes |
Pronunciation | /ɑːrkˈtjʊərəs/ |
Right ascension | 14h 15m 39.7s[1] |
Declination | +19° 10′ 56″[1] |
Apparent magnitude (V) | −0.05[2] |
Characteristics | |
Spectral type | K0 III[3] |
Apparent magnitude (J) | −2.25[2] |
U−B color index | +1.28[2] |
B−V color index | +1.23[2] |
R−I color index | +0.65[2] |
Note (category: variability): | H and K emission vary. |
Astrometry | |
కోణీయ వేగం (Rv) | −5.19[4] km/s |
Proper motion (μ) | RA: −1093.45[5] mas/yr Dec.: −1999.40[5] mas/yr |
Parallax (π) | 88.83[1] mas |
Absolute magnitude (MV) | −0.30±0.02[6] |
Details | |
Mass | 1.08±0.06[7] M☉ |
Radius | 25.4±0.2[7] R☉ |
Luminosity | 170[8] L☉ |
Surface gravity (log g) | 1.66±0.05[7] cgs |
Temperature | 4286±30[7] K |
Metallicity [Fe/H] | −0.52±0.04[7] dex |
Rotational velocity (v sin i) | 2.4±1.0[6] km/s |
Age | 7.1+1.5 −1.2[7] Gyr |
Other designations | |
Alramech, Alramech, Abramech, α Boötis, 16 Boötes, BD+19° 2777, GJ 541, HD 124897, HIP 69673, HR 5340, SAO 100944, LHS 48, GCTP 3242.00 | |
Database references | |
SIMBAD | data |
Data sources: | |
Hipparcos Catalogue, CCDM (2002), Bright Star Catalogue (5th rev. ed.), VizieR catalog entry |
భూతేశ్ (Boötis) నక్షత్రరాశిలో కనిపించే అతి ప్రకాశవంతమైన నక్షత్రం స్వాతి. ఇది ఉత్తరార్ధ గోళానికి సంబందించిన నక్షత్రాలలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైనది. ఆరెంజ్ రంగులో ప్రకాశించే దీని దృశ్య ప్రకాశ పరిమాణం – 0.05. నిరాపేక్ష ప్రకాశ పరిమాణం విలువ -0.31. భూమి మీద నుంచి చూస్తే ఆకాశంలో రాత్రిపూట కనిపించే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాలలో నాల్గవది స్వాతి నక్షత్రం. (మొదటి మూడు నక్షత్రాలు వరుసగా సిరియస్, కానోపస్, ఆల్ఫా సెంటారి). ఇది మనకు 36.7 కాంతి సంవత్సరాల దూరంలో వుంది. భూతేశ్ నక్షత్రరాశిలో కనిపించే ఈ నక్షత్రాన్ని బేయర్ నామకరణ పద్దతిలో α Bootis (Alpha Bootis) గా సూచిస్తారు. ఆంగ్లంలో ఆర్క్ చురస్ (Arcturus) గా పిలిచే ఈ నక్షత్రాన్ని తెలుగులో స్వాతి నక్షత్రం అని వ్యవహరిస్తారు.
ఆరెంజ్ రంగులో ఉజ్వలంగా మెరుస్తూ కనిపించే స్వాతి నక్షత్రం నిజానికి ఒక రెడ్ జెయంట్ స్టార్. ఇది K తరగతికి చెందిన ‘ప్రధాన క్రమ’(Main Sequence) దశలో వున్న హైపర్ జెయంట్ నక్షత్రం. వర్ణపటరీత్యా ఇది K0III తరగతికి చెందిన లేత పసుపు-ఆరెంజ్ (Pale Yellowish Orange) వర్ణనక్షత్రం. ఇది సూర్యునికంటే వ్యాసంలో 25 రెట్లు పెద్దది, తేజస్సు (Luminosity) లో సుమారుగా 170 రెట్లు పెద్దది. దీని ద్రవ్యరాశి సూర్యుని కన్నా కొద్దిగ ఎక్కువ.(1.1 M☉)
నక్షత్ర పరిశీలన
భూతేశ్ (బూటేస్) నక్షత్రరాశి ఆరు ప్రధాన నక్షత్రాలతో కూడి, చూడడానికి ఒక గాలిపటం లాగ కనిపిస్తుంది. ఈ గాలిపటం తాలూకు అడుగు భాగంలో ఆరెంజ్ రంగులో మెరుస్తూ ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రమే స్వాతి. దీనిని సప్త ఋషి మండలం ద్వారా కూడా తేలికగా గుర్తుపట్టవచ్చు. సప్త ఋషి మండలం (ఉర్సా మేజర్ లేదా గ్రేట్ డిప్పర్ నక్షత్రరాశి) లోని చివరి మూడు నక్షత్రాలు వంపులో కనిపిస్తాయి. ఆ వంపును అదేవిధంగా తూర్పుకు పొడిగిస్తే ప్రకాశవంతమైన స్వాతి నక్షత్రం కనిపిస్తుంది.
స్వాతి నక్షత్రాన్ని వసంతకాలపు త్రిభుజం (Spring Triangle) లో భాగంగా కూడా గుర్తించవచ్చు. ఉత్తరార్ధ గోళంలో వున్న వారికి స్వాతి, చిత్ర (స్పైకా), మఘ (రెగ్యులస్) నక్షత్రాలు – ఈ మూడు అతి ప్రకాశవంతమైన నక్షత్రాలు వసంతకాలంలో (మార్చ్ - జూన్) రాత్రిపూట ఆకాశంలో ఒక ఊహాత్మక త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. దీన్ని వసంతకాలపు త్రిభుజం (Spring Triangle) గా పేర్కొంటారు. ఈ మూడు నక్షత్రాలు వేర్వేరు నక్షత్ర రాశులకు చెందినప్పటికీ వాటి మొదటి ప్రకాశ పరిమాణ తరగతి కారణంగా వసంతకాలపు రాత్రివేళలో ఈ త్రిభుజం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వసంతకాలపు త్రిభుజాన్ని గుర్తించడం ద్వారా, ఆరెంజ్ రంగులో వెలిగిపోతూ ఒక శీర్షంలో వున్న స్వాతి నక్షత్రాన్ని సులువుగా గుర్తుపట్టవచ్చు.
దృశ్యత (visibility)
స్వాతి నక్షత్రం ఉత్తరార్ధ గోళానికి చెందిన నక్షత్రం. ఉత్తరార్ధ గోళంలోని అన్ని ప్రాంతాలలోను స్పష్టంగా కనిపించే ఈ నక్షత్రం, భూమధ్యరేఖ నుండి మరింత దక్షిణంగా పోయే కొలదీ క్షితిజానికి దగ్గరగా కనిపించడం ప్రారంభమవుతుంది. సిద్ధాంతపరంగా స్వాతి నక్షత్రాన్ని చూడడానికి దృశ్య అక్షాంశ పరిమితి 70° 49' 03.99" S. అందువలన 70.82°S కు దక్షిణంగా వున్నఅక్షాంశ ప్రాంతాలలో ఆకాశంలో స్వాతి నక్షత్రం కనిపించదు. 70.82°S కు ఉత్తరంగా వున్న అక్షాంశ ప్రాంతాల వారికి మాత్రమే ఆకాశంలో స్వాతి నక్షత్రం కనిపిస్తుంది.
భారతదేశంలో స్వాతి నక్షత్రం క్షితిజానికి (horizon) బాగా ఎత్తులో (75° పైబడి) కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ నక్షత్రం చెన్నై నగరంలో క్షితిజానికి 83.9° ఎత్తు లోను, విజయవాడలో 87.32° ఎత్తులోను, ముంబై లో 89.9° ఎత్తులో, కొలకత్తాలో 86.61° ఎత్తులోను, న్యూ ఢిల్లీ లో 80.57° ఎత్తులో, శ్రీనగర్ లో క్షితిజానికి 75.1° ఎత్తులో కనిపిస్తుంది. దక్షిణార్ధ గోళంలో భూమధ్యరేఖ నుండి మరింత దక్షిణంగా పోయే కొలదీ ఈ నక్షత్రం క్షితిజానికి దగ్గరగా కనిపించడం ప్రారంభమవుతుంది. 70.82°S అక్షాంశ ప్రాంతం నుండి చూస్తే ఇది క్షితిజం మీద ఉంటుంది.
ఉత్తరార్ధ గోళపు వసంతకాలం (Spring)లో లేదా దక్షిణార్ధగోళపు శరత్కాలం (Autumn) లో ఏప్రిల్ 27 అర్ధరాత్రి, జూన్ 10 రాత్రి 9 గంటల సమయంలో ఈ స్వాతి నక్షత్రం పరాకాష్ట స్థాయికి చేరుకొంటుంది. ఆ సమయంలో పరిశీలకునికి ఈ నక్షత్రం క్షితిజానికి గరిష్ట ఉన్నతి స్థితిలో కనిపిస్తుంది.
70° 49' 03.99" N కు ఉత్తరాన్న స్వాతి నక్షత్రం ధృవ పరిభ్రమణ తారగా వుంటుంది. అనగా ఉత్తర ధృవం నుండి 19.18° అక్షాంశ పరిధిలోపల ఇది ధృవ పరిభ్రమణ తార అవుతుంది. దీని దిక్పాతం 19° 10' 56.00" N. అందువల్ల 70.82°N కు ఉత్తరంగావున్న అక్షాంశ ప్రాంతాలపై నుండి ఆకాశంలో చూస్తే స్వాతి నక్షత్రం ధృవనక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు వుంటుంది. 70.82° N కు దక్షిణంగావున్న అక్షాంశ ప్రాంతాలపై నుండి చూస్తే స్వాతి నక్షత్రం ఆకాశంలో క్షితిజానికి దిగువన అస్తమిస్తుంది.
దూరం
స్వాతి నక్షత్రం సూర్యుని నుండి 36.7 కంటి సంవత్సరాల దూరంలో వుంది. హిప్పార్కస్ శాటిలైట్ టెలీస్కోప్ ఏడాదికి 88.83 మిల్లీ ఆర్క్ సెకండ్ల పారలాక్స్ షిఫ్ట్ (దృష్టి విక్షేపణ విస్థాపనం) ను ఆధారంగా చేసుకొని ఈ నక్షత్రం సూర్యుని నుండి 36.7 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నిర్ధారించింది. ఈ దూరం 0.54 మిల్లీ ఆర్క్ సెకండ్ల పారలాక్స్ దోషంతో లెక్కించబడింది. అంటే సూర్యుని నుండి ఈ నక్షత్రానికి గల దూరం, 36.7 ± 0.23 కాంతి సంవత్సరాలు లేదా 11.26 ± 0.069 పార్ సెకన్ల అవధులు మధ్య ఉంటుంది. మనకు స్వాతి నక్షత్రం సుమారుగా 37 కాంతి సంవత్సరాల దూరంలో వుంది అంటే స్వాతి నక్షత్రం నుండి కాంతి మనకు చేరడానికి 37 సంవత్సరాల కాలం పడుతుందని అర్ధం. అంటే ఇప్పుడు మనకు ఆకాశంలో కనిపిస్తున్న స్వాతి నక్షత్రం, నిజానికి 37 సంవత్సరాల క్రితం స్వాతి ఆకాశంలో ఎలా ఉండేదో ఆ స్థితిలో వున్న నక్షత్రం మాత్రమే మనకు కనిపిస్తున్నది అని అర్ధం.
సమీప ఖగోళరాశులు ముప్రిర్డ్ నక్షత్రం: స్వాతి నక్షత్రానికి కేవలం 3.24 కాంతి సంవత్సరాల దూరంలో ఈటా భూతేశ్ (η Bootis) లేదా ముప్రిర్డ్ అనే నక్షత్రం వుంది. +2.68 ప్రకాశ పరిమాణం గల ఈ నక్షత్రం స్వాతీ నక్షత్రానికి పడమరలో కొద్ధి డిగ్రీల కోణీయ దూరంలో వుంది. అయితే మనకు స్వాతి ఎంత దూరంలో వుందో, అంతే దూరంలో ముప్రిర్డ్ నక్షత్రం కూడా వుంది. మన భూమిపై నుంచి చూస్తే మనకు మెర్క్యూరీ గ్రహం ఎంత కాంతివంతంగా కనిపిస్తుందో, అదేవిధంగా స్వాతి నక్షత్రంపై నుండి చూస్తే ముప్రిర్డ్ నక్షత్రం కూడా అంటే కాంతివంతంగా (-2.5 పరిమాణంతో) కనిపిస్తుంది. అలాగే భూమి మీద నుండి చూస్తే మనకు శుక్ర గ్రహం ఎంత ప్రకాశవంతంగా కనపడుతుందో, అదేవిధంగా ముప్రిర్డ్ నక్షత్రంపై నుండి చూస్తే స్వాతి నక్షత్రం కూడా అంతే ప్రకాశవంతంగా (-5.2 పరిమాణంతో) కనిపిస్తుంది.
నక్షత్ర గమనం
సూర్యుని స్థిర నేపథ్యంలో ఒక నక్షత్రం ఒక ఏడాది కాలంలో చేసిన స్థానభ్రంశాన్ని క్రమ గమనం (Proper motion) అంటారు. స్వాతి నక్షత్రం మనకు కొంత సమీపంగానే ఉండడం వల్ల ఏడాదికి 2.29 ఆర్క్ సెకండ్ల చొప్పున స్థానభ్రంశం చెందుతూ వుంది. అందువలన దీని క్రమ గమనం అధికంగా వుంది. అంటే 2000 సంవత్సరాల కాల వ్యవధిలో స్వాతి నక్షత్రం 1° పైగా స్థానభ్రంశం చెందింది అని అర్ధం. మొదటి ప్రకాశ పరిమాణ నక్షత్రాలలో ఆల్ఫా సెంటారి తరువాత అత్యధిక క్రమ గమనం గల నక్షత్రం స్వాతి మాత్రమే. స్వాతితో పోలిస్తే మనకు ఆల్ఫా సెంటారి నక్షత్రం 9 రెట్లు సమీపంగా వుండటం వలనే ఆల్ఫా సెంటారికి అత్యధిక క్రమ గమనం వుంది.
రేడియల్ వేగం: డాప్లర్ ప్రభావం ప్రకారం స్వాతి నక్షత్ర వర్ణపట రేఖలను పరిశీలిస్తే ఈ నక్షత్రం మనలను సమీపిస్తున్నదని తెలుస్తున్నది. ఇది 5.5 కి.మీ./సె. రేడియల్ వేగంతో మన సొర వ్యవస్థ వైపుకు కదులుతుంది. దీనికి విరుద్ధంగా సూర్యునితో పోలిస్తే స్వాతి నక్షత్రం 122 కి.మీ./సె. సాపేక్ష వేగంతో అతివేగంగా కదులుతూ వుంది. ఇంతటి అధిక వేగంతో మరేతర మొదటి పరిమాణ నక్షత్రాలేవీ కూడా చలించడం లేదు.
మన పాలపుంత డిస్క్ లో పరిభ్రమించే సాధారణ నక్షత్రాలతో పోలిస్తే స్వాతి నక్షత్రం విలక్షణంగా కదులుతున్నది. ఈ నక్షత్రం మన పాలపుంత డిస్క్ గుండా దాదాపు 90° కోణంతో జారుతున్నట్లుగా ప్రయాణిస్తున్నది. దీని గమన మార్గం మిల్కీవే డిస్క్ ను ఖండించే సమయంలో, ఇది మన సూర్యునికి అతి సమీపంలోని రావడం జరుగుతుంది. అయితే ఇప్పటికే స్వాతి సూర్యునికి అతి సమీప స్థితికి దాదాపుగా చేరుకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం వున్న 36.7 కాంతి సంవత్సరాల దూరానికి, మరికొద్ది దూరం (అంటే సుమారుగా ఒక కాంతి సంవత్సరంలో కొన్ని వందల వంతు దూరం) దగ్గరగా వచ్చినపుడు స్వాతి నక్షత్రం సూర్యునికి అతి సమీప స్థితికి చేరుకొంటుంది. అయితే ఇది జరగడానికి మరో నాలుగు వేల సంవత్సరాల కాలం పడుతుంది. పాలపుంత కేంద్రం చుట్టూ తిరిగే సాధారణ నక్షత్రాల వలె కాక స్వాతికి గమన మార్గం ప్రత్యేకంగా వుండటం వల్ల, సూర్యునికి అతి సమీప స్థానం లోకి చేరుకొన్న తరువాత స్వాతి నక్షత్రం త్వరగానే మన దృష్టిపథం నుండి మరలిపోతుంది. ఆ తరువాత భూమిపై నుండి ఆకాశంలోకి చూస్తే కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఇది మనకు కనిపించే అవకాశం వుండదు.
స్వాతి సమూహం (Arcturus Group): స్వాతి నక్షత్రంతో పాటు మరో 52 నక్షత్రాలు మన పాలపుంత డిస్క్ కు దాదాపు 90° కోణంతో, డిస్క్ గుండా జారుతున్నట్లుగా ప్రయాణిస్తున్నాయి. ఈ విధంగా పాలపుంత కేంద్రం చుట్టూ తిరిగే సాధారణ నక్షత్రాలకు భిన్నంగా ఈ 53 నక్షత్రాలు ఒక విలక్షణమైన గమన మార్గం కలిగి వుండటం వలన వీటిని ఆర్కచురస్ గ్రూప్ లేదా స్వాతి సమూహం అని పేర్కొంటారు.
పరిమాణం - ద్రవ్యరాశి
రెడ్ జెయింట్ స్టార్ అయిన స్వాతి నక్షత్రం సూర్యుని కంటే వ్యాసంలో సుమారు 26 రెట్లు పెద్దది. ద్రవ్యరాశి సూర్యుని కంటే కేవలం 1.1 రెట్లు మాత్రమే పెద్దది.
దీప్యత (Luminousity), వర్ణ పటాలను బట్టి లెక్కిస్తే స్వాతి నక్షత్రం సూర్యుని కంటే 26 రెట్లు పెద్దదని తెలుస్తుంది. కోణీయ పరిమాణం ప్రకారం లెక్కిస్తే స్వాతి, 0.0210 ఆర్క్ సెకండ్ల వ్యాసంతో అనగా సూర్యుని కంటే 25 రెట్లు పెద్దదని తెలుస్తుంది. దీని వ్యాసార్థం 18 మిలియన్ల కిలోమీటర్లు.
పరిశీలించిన భౌతిక పరామితులను, నక్షత్ర పరిమాణాత్మకతతో పోలిస్తే స్వాతి ద్రవ్యరాశి సూర్యుని కంటే 1.08 ± 0.06 రెట్లు వుందని (1.08 ± 0.06 M☉) తెలియవస్తుంది. అదేవిధంగా మొదటి పరిమాణ దశకు (అనగా మెయిన్ సీక్వెన్స్ దశ నుండి రెడ్ జెయింట్ దశకు) చేరుకొన్న నక్షత్రపు ఆక్సిజన్ ఐసోటోప్ నిష్పత్తిని పరిశీలిస్తే, దీని ద్రవ్యరాశి సూర్యుని కంటే 1.2 రెట్లు పెద్దదని (1.1 M☉) తెలుస్తుంది.
అయితే ద్రవ్యరాశికి సంబంధించినంత వరకు స్వాతి నక్షత్రానికి ఒక ప్రత్యేకత వుంది. ఒక జెయింట్ స్టార్ గా ఉండాల్సిన ద్రవ్యరాశి కన్నా స్వాతి నక్షత్రపు ద్రవ్యరాశి చాలా తక్కువగా వుంది. దీప్యత, వర్ణపటాల ప్రకారం చూస్తే స్వాతి వంటి జెయింట్ నక్షత్రాలు, సూర్యుని కన్నా 4 రెట్లు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉండాలి. అయితే స్వాతి కి అంతటి ద్రవ్యరాశి లేదు. సూర్యుని కంటే స్వాతి కేవలం 1.1 రెట్లు మాత్రమే అధిక ద్రవ్యరాశిని కలిగి ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిజానికి స్వాతి ప్రారంభ దశలో వున్న రెడ్ జెయింట్ స్టార్ కాబట్టి ఇతర రెడ్ జెయింట్ స్టార్ ల వలె తన ద్రవ్యరాశిని భారీగా పోగొట్టుకొందని కూడా చెప్పలేము. ఏది ఏమైనప్పటికి సాపేక్షంగా ఇంత తక్కువ ద్రవ్యరాశిని కలిగి వున్న స్వాతి నక్షత్రం తన పరిణామ క్రమంలో భాగంగా చిట్టచివరకు ఒక డ్వార్ఫ్ స్టార్ (మరుగుజ్జు నక్షత్రం) గా మారుతుందని భావించవచ్చు.
ప్రకాశం
భూమిపై నుంచి చూస్తే ఆకాశంలో కనిపించే నాల్గవ ఉజ్వలమైన నక్షత్రం స్వాతి. దీని దృశ్య ప్రకాశ పరిమాణం విలువ –0.05. సూర్యుని మినహాయిస్తే ఈ విధంగా ఋణాత్మక దృశ్య పరిమాణ విలువలు గలవి కేవలం నాలుగు నక్షత్రాలు మాత్రమే (సిరియస్, కానోపస్, ఆల్ఫా సెంటారి, స్వాతి) వున్నాయి. భూతేశ్ నక్షత్రరాశిలో అతి ప్రకాశవంతమైన నక్షత్రం స్వాతి.
వసంతకాలంలో కనిపించే స్వాతి, ఉత్తరార్ధగోళానికి చెందిన తొలి మూడు ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఒకటి. మిగిలిన రెండూ - వేసవిలో కనిపించే వేగా నక్షత్రం (+0.03), శీతాకాలంలో కనిపించే కాపెలా నక్షత్రం (+0.08). ఈ మూడు తారలలో స్వాతి నక్షత్రమే మిగిలిన రెండింటికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది. అంటే మొత్తం ఉత్తరార్ధ గోళానికి సంబందించిన తారలలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైనది స్వాతి నక్షత్రమే.
అంతేకాదు సిరియస్ (−1.46 దృశ్య పరిమాణం), కానోపస్ (-0.72), ఆల్ఫాసెంటారి (−0.27 సంయుక్త దృశ్య పరిమాణం) తారల తరువాత భూమిపై నుంచి చూస్తే ఆకాశంలో కనిపించే నాల్గవ ఉజ్వలమైన నక్షత్రం స్వాతి. అయితే, "ఆల్ఫా సెంటారి AB" అనేది ఒక జంట నక్షత్ర వ్యవస్థ. దీని జంట తారలు - ఆల్ఫాసెంటారి A, ఆల్ఫాసెంటారి B ల యొక్క దృశ్య ప్రకాశ పరిమాణాలు విడివిడిగా చూస్తే వరుసగా +0.01, +1.33 గా వున్నాయి. అంటే α సెంటారీ AB జంట తార వ్యవస్థ లోని సహచర తారలు రెండూ విడివిడిగా చూస్తే స్వాతి కన్నా తక్కువ ప్రకాశవంతమైనవే. సాధారణ కంటితో చూసినపుడు మాత్రం ఈ జంట తార వ్యవస్థ −0.27 దృశ్య పరిమాణంతో స్వాతి కన్నా కొద్దిగ ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనినిబట్టి నక్షత్రాలను విడివిడిగా (individual stars) పరిగణిస్తే సిరియస్ A, కానోపస్ తారల తరువాత స్వాతి నక్షత్రమే, ఆకాశంలో కనిపించే మూడవ ఉజ్వలమైన నక్షత్రం అవుతుంది.
సూర్యాస్తమయ సమయంలో గాని లేదా సూర్యాస్తమయానికి కొద్దిగా ముందు గాని ఆకాశంలో మామూలు కంటితో కూడా స్వాతి నక్షత్రాన్ని చూడవచ్చు. సూర్యుడు, సూపర్ నోవా లను మినహాయిస్తే టెలీస్కోప్ లో పగటివెలుగులో చూసిన మొదటి నక్షత్రం స్వాతి. 1635 లో ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు అయిన జీన్-బాప్టిస్ట్ మోర్న్ టెలీస్కోప్ లో పగటిపూటనే స్వాతి నక్షత్రాన్ని గమనించాడు. దీని నిరాపేక్ష ప్రకాశ పరిమాణం విలువ -0.31. .
ఉష్ణోగ్రత
స్వాతి నక్షత్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 4290° K. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత (5780° K) కన్నా దీని ఉపరితల ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల, సూర్యునితో పోలిస్తే దీని ఉపరితలం సాపేక్షంగా చల్లగా ఉందని చెప్పవచ్చు. అందువలనే రాబర్ట్ బర్నహమ్ స్వాతి నక్షత్రపు వర్ణపటం, సన్ స్పాట్ (Sunspot) యొక్క వర్ణపటం మాదిరిగానే ఉంటుందని పేర్కొన్నారు. K2 తరగతికి చెందిన జెయింట్ స్టార్ అయిన స్వాతి నక్షత్రపు కోర్ భాగంలో హైడ్రోజన్ సంలీనం ఆగిపోయింది. ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ నక్షత్రపు కోర్ భాగంలో హీలియం సంలీనం ప్రారంభమైనట్లు, తద్వారా కోర్ భాగంలో భారయుతమైన మూలకాలు ఏర్పడటం మొదలైనట్లుగా భావిస్తున్నారు. ఉపరితల ఉష్ణోగ్రత తక్కువగా వుండటం వలన దీని శక్తిలో గణనీయమైన భాగం పరారుణ (infrared) రూపంలో వికిరణం చెందుతుంది.
దీప్యత (Luminosity)
సూర్యుని సమీపంలో గల వేగా, సిరియస్ ల మాదిరి అత్యంత తేజస్సు గల నక్షత్రాలలో స్వాతి నక్షత్రం కూడా ఒకటి. సాధారణ కంటితో చూస్తున్నప్పుడు, స్వాతి నక్షత్రం సూర్యుని కంటే 113 రెట్లు ఎక్కువగా దేదీప్యమానంతో వెలుగుతూ ఉంటుంది. అంటే 1 సెకండులో స్వాతి సూర్యుని కంటే 113 రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
సూర్యుని ఉపరితలంలో పోలిస్తే స్వాతి నక్షత్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత తక్కువగా వుంది. దీనర్ధం ఈ రెడ్ జెయింట్ నక్షత్రం యొక్క శక్తిలో గణనీయమైన భాగం పరారుణ (infrared) వికిరణం చెందుతూ వుంది. అందువల్ల దృగ్గోచర కాంతి (visible light) లో తక్కువ శక్తి (సూర్యుని కంటే 113 రెట్లు మాత్రమే) వెలువడుతుంది. పరారుణ రూపంలో వికిరణమయ్యే శక్తిని కూడా లెక్కిస్తే స్వాతి సూర్యుని కంటే 180 రెట్లు అధిక శక్తిని వెలువరిస్తున్నట్లవుతుంది. అంటే స్వాతి నుండి ఉద్గారమయ్యే పరారుణ వికిరణాన్ని కూడా పరిగణించినపుడు, స్వాతి నక్షత్రం సూర్యుని కంటే 180 రెట్లు దేదీప్యమానంతో వెలిగిపోతూ వుంటుంది.
పరిశీలనా చరిత్ర
నామీకరణ (Nomenclature)
బేయర్స్ నామకరణ పద్దతిలో స్వాతి నక్షత్రాన్ని α Bootis గా సూచిస్తారు. Ἀρκτοῦρος (Arktouros) అనే ప్రాచీన గ్రీకు పదం నుండి ఆర్క్ చురస్ అనే పేరు ఈ నక్షత్రానికి వచ్చింది. గ్రీకు భాషలో ఈ పదానికి "ఎలుగుబంటి సంరక్షకుడు" (గార్డియన్ అఫ్ ది బేర్) అని అర్ధం. arktos (ἄρκτος) అనగా గ్రీకు భాషలో "ఎలుగుబంటి " అని అర్ధం. ouros (οὖρος) అనే పదానికి "సంరక్షకుడు" అని అర్ధం. ఈ రెండు పదాల నుంచే Arcturus (ఆర్క్ చురస్) అనే పదం ఏర్పడింది. గ్రీకు కవి హెసియోడ్ (క్రీ.పూ.750-650) కాలానికే ఇది ఈ పేరుతోనే పిలువబడుతూ ఉండేది.
ఖగోళ శాస్త్రజ్ఞులు తమ తమ నక్షత్రాల వర్గీకరణ జాబితాలో స్వాతి నక్షత్రాన్ని విభిన్న హోదాలతో గుర్తించడం జరిగింది. స్వాతి నక్షత్రం బేయర్స్ వర్గీకరణలో α Bootis గాను, బ్రైట్ స్టార్ కేటలాగ్ లో HR 5340 గాను, హెన్రీ డ్రేపర్ (HD) నక్షత్ర జాబితాలో HD 124897 గాను, హిప్పార్కస్ జాబితాలో HIP 69673 గాను వర్గీకరించబడింది. ఇంకా - ల్యూటెన్ హాఫ్ సెకండ్ (LHS) జాబితాలో LHS 48 గాను, గ్లీజి జాబితా (Gliese Catalogue of Nearby Stars) లో Gl 541 గాను, దచ్ము స్టెరాంగ్ జాబితాలో BD: +19° 2777 గాను, జనరల్ కేటలాగ్ అఫ్ ట్రిగనోమెట్రిక్ పారలాక్సస్ జాబితాలో GCTP 3242.00 గాను, స్మిత్ సోనియన్ ఆస్ట్రో ఫిజికల్ అబ్జర్వేటరీ వారి నక్షత్ర కేటలాగ్ లో SAO 100944 గాను స్వాతి నక్షత్రాన్ని గుర్తించడం జరిగింది. ఈ నక్షత్రాన్నే అల్రామెక్, అబ్రామెక్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.
నక్షత్ర జాబితాను ప్రామాణీకరించడం కోసం, నక్షత్రాలకు సరైన పేర్లను పెట్టడంకోసం 2016 లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) నక్షత్రాల పేర్ల పై ఒక వర్కింగ్ గ్రూప్ (WGSN) ను నిర్వహించింది. ఈ వర్కింగ్ గ్రూప్ ఆమోదించిన జాబితాలో ఆర్క్ చురుస్ నక్షత్రం పేరు కూడా వుంది. ప్రస్తుతం ఈ పేరును ఐ.ఏ.యు కేటలాగ్ లో కూడా చేర్చడం జరిగింది.
చారిత్రిక సాంస్కృతిక ప్రాముఖ్యత
రిఫరెన్సులు
బయటి లింకులు
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 ఉల్లేఖన హెచ్చరిక:
vanLeeuwen2007
పేరుతో ఉన్న<ref>
ట్యాగును మునుజూపులో చూపలేం. ఎందుకంటే అది ప్రస్తుత విభాగానికి బయటైనా ఉండి ఉండాలి, లేదా అసలు దాన్ని నిర్వచించకపోయి అయినా ఉండాలి. - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Ducati, J. R. (2002). "VizieR Online Data Catalog: Catalogue of Stellar Photometry in Johnson's 11-color system". CDS/ADC Collection of Electronic Catalogues. 2237: 0. Bibcode:2002yCat.2237....0D.
- ↑ Gray, R. O.; Corbally, C. J.; Garrison, R. F.; McFadden, M. T.; Robinson, P. E. (2003). "Contributions to the Nearby Stars (NStars) Project: Spectroscopy of Stars Earlier than M0 within 40 Parsecs: The Northern Sample. I". The Astronomical Journal. 126 (4): 2048. arXiv:astro-ph/0308182. Bibcode:2003AJ....126.2048G. doi:10.1086/378365.
- ↑ Massarotti, Alessandro; Latham, David W.; Stefanik, Robert P.; Fogel, Jeffrey (2008). "Rotational and Radial Velocities for a Sample of 761 HIPPARCOS Giants and the Role of Binarity". The Astronomical Journal. 135 (1): 209–231. Bibcode:2008AJ....135..209M. doi:10.1088/0004-6256/135/1/209.
- ↑ 5.0 5.1 Perryman; et al. (1997). "HIP 69673". The Hipparcos and Tycho Catalogues.
- ↑ 6.0 6.1 ఉల్లేఖన హెచ్చరిక:
aj135_3_892
పేరుతో ఉన్న<ref>
ట్యాగును మునుజూపులో చూపలేం. ఎందుకంటే అది ప్రస్తుత విభాగానికి బయటైనా ఉండి ఉండాలి, లేదా అసలు దాన్ని నిర్వచించకపోయి అయినా ఉండాలి. - ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 ఉల్లేఖన హెచ్చరిక:
ramirez_prieto_2011
పేరుతో ఉన్న<ref>
ట్యాగును మునుజూపులో చూపలేం. ఎందుకంటే అది ప్రస్తుత విభాగానికి బయటైనా ఉండి ఉండాలి, లేదా అసలు దాన్ని నిర్వచించకపోయి అయినా ఉండాలి. - ↑ ఉల్లేఖన హెచ్చరిక:
aaa465_2_593
పేరుతో ఉన్న<ref>
ట్యాగును మునుజూపులో చూపలేం. ఎందుకంటే అది ప్రస్తుత విభాగానికి బయటైనా ఉండి ఉండాలి, లేదా అసలు దాన్ని నిర్వచించకపోయి అయినా ఉండాలి.