హోమ్ రూల్ స్వరాజ్యోద్యమం
హోమ్ రూల్ అను ఆంగ్లపదమునకు స్వపరిపాలనయని అర్దమగుచున్నది. భారతదేశమున 18వ శతాబ్దమునుండి బ్రిటిష్ వ్యాపార సంస్థవారు రాజ్యాధికారములు వహించుతూ క్రమేణా యావద్భారతదేశమును వలస రాజ్యముగా చేసుకుని పరిపాలించసాగెను. తరువాత ఇంగ్లండు లోని బ్రిటిష్ర్ ప్రభుత్వమువారే తమ ప్రతినిధుల ద్వారా భారతదేశమును పరిపాలింప సాగెను. బ్రిటిష్ పరిపాలననుండి విముక్తిపొంది దేశమును దేశీయులే పరిపాలించుకునవలెనను (హోమ్ రూల్) రాజకీయ పరిజ్ఞానము భారతీయులలో క్రమేణా కలగినది. బ్రిటిష్ వారు చేయుచున్న నిరంకుశ పరిపాలనా స్వరూపము కూడా విశదమౌవటంతో భారతీయులలో స్వరాజ్య కాంక్ష ఉద్భవించి దేశంనలువైపులా స్వరాజ్యముకావలెనన్న ఉద్యమములు తీవ్రముగా ప్రబలమైనవి. స్వరాజ్యమునకు ఉద్యమములు స్వరాజ్యోద్యమములు. మొట్టమొదటిసారిగా 'స్వరాజ్యము' (స్వరాజ్) అను మాట జాతీయకాంగ్రెస్సు 1906 మహాసభలో దాదాభాయి నౌరోజీ అధ్యక్షుడుగా చేసిన ప్రసంగములో వెల్లడించినట్లు చరిత్రలో కనబడుచున్నది. తరువాత కాలములో ఆనినాదము మంత్రముగావెల్లివిరిసినది. బాలగంగాధర తిలక్ స్వరాజ్యము నా జన్మ హక్కు అని మరో నినాదముచేసెను. అనేక స్వరాజ్యోద్యమముల లక్ష్యమొకటే; బ్రిటిష్ పరిపాలననుండి స్వరాజ్యముపొంది స్వపరిపాలన చేసుకునట. గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాలు ప్రవేశపెట్టకమునుపటి స్వరాజ్యోద్యమములలో ప్రముఖమైన ఉద్యమము, 'హోమ్ రూల్ లీగ్' కాని 1919 నుండి అనిబిసెంటు రాజకీయములనుండి తొలగి దూరమగుటయే కాక బ్రిటిష్ ప్రభుత్వమునకు సానుభూతి ప్రకటించసాగెను. 1917-18 లో బిసెంటుయొక్క పలుకుబడి, ప్రముఖత భారతదేశరాజకీయాలలో శిఖరాగ్రమునకు చేరి క్రమేణ అస్తమించి 1919నుండి ఆమెరాజకీయ నిర్యాణముతో ఆమె స్థాపించిన హోమ్ రూల్ లీగుకూడా క్రమేణ శక్తిహీనమై కాంగ్రెస్స్ లో కలసిపోయింది. 1919నాటికి తాను దాఖలుచేసిన పరువునష్టపు దావా (ఇంగ్లండులో Sir Valentine Chirol 1910 ప్రచురించిన పుస్తకము Indian Unrest లో తిలక్ పై నిందారోపణలున్నందున తిలక్ పరువునష్టపు దావా దాఖలు చేశను) విచారణకురాగా తిలక్ ఇంగ్లడుకు వెడలిపోవుట తదుపరి 1920 లో పరమదించుటతో లోకమాన్య తిలక్ స్థాపించిన హోమ్ రూల్ ఉద్యమముగూడా కాంగ్రెస్సులో కలసి మహాత్మా గాంధీ నాయకత్వముక్రిందకి వచ్చింది.[1] [2]
హోమ్ రూల్ లీగ్
హోమ్ రూల్ లీగ్ (HOME RULE LEAGUE) అను సంస్థ భారతదేశమును బ్రిటిష్ వారి పరిపాలనక్రింద బానిసరాజ్యముగా విముక్తిచేసి బ్రిటిష్ సామ్రాజ్యములో అధినివేశ స్వరాజ్యము (డొమీనియన్ స్టేటస్) పొందుటకు జాతీయ కాంగ్రెస్కు చేదోడుగా తగిన ఉద్యమము సాగించుటకు స్థాపించబడింది. ఆ సంస్థను అనీబిసెంటు 1916 సంవత్సరము సెప్టెంబరు మాసమున మద్రాసు (ఇప్పటి చెన్నై) లో స్థాపించారు. అదే సంవత్సరము ఏప్రిల్ మాసములో పూనాలో (పూనే) లోకమాన్యుడని ప్రసిధ్దిచెందిన బాలగంగాధర తిలక్ కూడా హోమ్ రూల్ లీగ్ అను స్వరాజోద్యమ సంస్థ ప్రారంభించి యుండెన. శక్తివంతమైన బ్రిటిష్ ప్రభుత్వము క్రింద స్వరాజ్య ఉద్యమములు కొనసాగవలెనన్నచో శక్తివంతమైన రాజకీయసంస్థ యుండవలెనని తలంపుతో అనిబిసెంటు ఆ సంస్థను స్థాపించారు. మండలి లేదా సమ్మేళనము అను అర్ధమునిచ్చు ఆంగ్ల పదము "లీగ్" (League) నకు అనుగణముగా ఆమె స్థాపించిన హోమ్ రూల్ లీగ్ యొక్క లక్ష్యము 20వ శతాబ్దారంభములో భారతదేశములో స్వరాజ్యసాధన లక్ష్యముగాకలిగిన ఉద్యమములను సమ్మేళనము చేసి శక్తివంతమైన స్వరాజోద్యమములు సాగించుట . ఆమె స్వదేశమైన ఐర్లాండు బ్రిటిష్ సామ్రాజ్యములో వలసరాజ్యముగానుండి స్వరాజ్యపోరాటమునందు 19 వ శతాబ్దము చివరిలో స్థాపించబడ్డ ఐరిష్ హోమ్ రూల్ లీగ్ (తదుపరి ఐరిష్ పార్లమెంటు పార్టీగా మారినది) మాదిరి స్వరాజ్యోద్యమలక్ష్యము కలిగిన రాజకీయ పార్టీ లాంటిదే భారతదేశములో ఆమె స్థాపించిన హోమ్ రూల్ లీగ్ సంస్థ. ఆ సంస్థకు అతిస్వల్పకాలములోనే యావత్భారతదేశములో అనేక శాఖోపశాఖలు కలిగినవి. అంతేకాక ఆ సంస్థతో పాటుగా 'న్యూఇండియా' మరియూ 'కామన్ వీల్' (The Commonweal. weal;prosperity) అను పత్రికలను స్థాపించి జాతీయచైతన్యము, రాజకీయపరిజ్ఞానము కలుగజేసి భారతదేశము స్వరాజ్యము పొందుటకు ఆమె సలిపిన కృషి గణనీయము. అనీబిసెంటు 1907 సంవత్సరమునుండి మద్రాసులోని అడయార్ లోని దివ్యజ్ఞాన సమాజమునకు (Theosophical Society) అధ్యక్షురాలు గానుండిన ప్రఖ్యాత భారతదేశపు పాశ్చాత్య-స్వరాజ్య వాది. ఆమెతో సహకరించిన దేశీయ స్వరాజ్యవాది బాల గంగాధర తిలక్. ఆయన స్వరాజ్య ఆందోళనలకు మార్గదర్శకుడుగానుండిన కాంగ్రెస్సు అతివాద పక్ష నాయకులలో ప్రముఖుడు. భ్రిటిష్ ప్రభుత్వ దృష్టిలో తీవ్ర స్వరాజ్యవాదిగా పేరుపొంది, దేశాంతర వాస శిక్ష అనుభవించి (1908 నుండి 1914వరకూ) బర్మాలోని మండలే జైలునుండి విడుదలై వచ్చిన తరువాత ఆమెకు సహాయము చేయనారంభించెను. ఒకే సంవత్సరములో కొన్ని నెలలు తేడాలో స్థాపించ బడ్డ ఆ రెండు హోమ్ రూల్ సంస్థల మద్య వివాద విభేదములు లేక సరిసమాన సహకారంతోనుండినవి. తిలక్ స్థాపించిన హోమ్ రూల్ మహారాష్ట్ర ప్రాంతములకు పరిమితమైయుండగా అనీ బిసెంటు స్థాపించిన హోమ్ రూల్ సంస్థకు దేశము నలుమూలలా శాఖలుండి స్వరాజ్యోద్యమ కార్యక్రమములు దేశమంతటా నడిపించటమే గాక ఆమె లండన్ నగరమున కూడా హోమ్ రూల్ ఫర్ ఇండియా లీగ్ అను శాఖను స్థాపించి బ్రిటిష్ ప్రజలకు భారతదేశానికి స్వరాజ్యమునియ్యవలసిన ఆవశ్యకతను అందుకు సలుపుచున్న ఉద్యమములను గూర్చి వెల్లడించెను. ఆమె హోమ్ రూలు లీగు లండన్ శాఖ స్థాపించిన సందర్భమున లండన్ టైమ్సు పత్రిక సంపాదక వర్గము అనీబిసెంటుపై వ్యక్తిగతమైన విషపూరిత విమర్శ ప్రకటించెను. పత్రికా సంపాదకీయముద్వారా వెలువడిన ఆ విమర్శనుబట్టి ఆనాటి బ్రిటిష్ రాజకీయ నాయకుల దృష్టిపరిధిలో స్వతంత్ర భారతదేశ కాంక్ష ఊహాతీతమని తెలియుచున్నది. యుగాంతకమైనట్టియు, బ్రిటిష్ సామ్రాజ్యఅస్తమయానికి అంకురార్పణమైనట్టి విషయముగా పరిగణంపబడినది (భారతదేశపు బ్రిటిష్ సామ్రాజ్య అస్తమయం). అనీబిసెంటు స్థాపించిన హోమ్ రూల్ లీగులోని సభ్యులగానున్న కొందరు ప్రముఖులు బి.జి. హార్నిమన్ (బొంబాయి క్రానికల్ పత్రికాధిపతి) సరోజినీ నాయుడు , జమన్ దాస్ ద్వారకాదాస్, శంకర్ లాల్ బ్యాంకర్, ఉమర్ శోభాని మొదలగు వారు.[1]
పూర్వోత్తర సందర్భాల చరిత్రాంశాలు
బ్రిటిష్ ఇండియా చరిత్రలో 20 శతాబ్దమున రెండవ దశాబ్ధములో (1909-1919) చాలా ప్రముఖమైన చరిత్రాంశములు కలిగియున్నవి. భారతీయులలో మేలుకున్న స్వతంత్ర కాంక్ష మరిపించుటకు రాజ్యతంత్రములతోకూడిన ఉపశమన చర్యగామింటో-మార్లే సంస్కరణలు (1909) ప్రవేశపెట్టిరి. ఆ సంస్కరణలవలన ముస్లిములు ఎన్నికలలో ప్రత్యేక ప్రాతినిధ్యము పొందిరి. అందుచే వీరి నాయకులు భవిష్యత్తులో తమ నియెజకవర్గములో ఓట్ల కోసము కాంగ్రెస్సు పొందుకోరక దూరముగానుండిరి. బ్రిటిష్ వారి విభజించి పాలించమన్నతీరుకు తగినట్లుగనే జరిగింది. 1907 లో జాతీయ కాంగ్రెస్సులో అతివాదులు మితవాదుల విభజనజరిగింది. అవి హోమ్ రూల్ లీగ్ స్థాపించునాటి దేశ పరిస్థితులు. 1907 సూరత్ కాంగ్రెస్సుమహా సభలో అతివాదులు మితవాదులగా ఆనాటి కాంగ్రెస్సు నాయకులు వేరుపడినందున ఆ రెండు పక్షముల కాంగ్రెస్సు నాయకులను తిరిగి కలుపుటకు అనీబిసెంటు హోమ్ రూల్ సంస్ధ ద్వారా ప్రయత్నించెను. కాని మితవాదుల పక్ష ప్రముఖ నాయకుడు దిన్షా వాచా కాంగ్రెస్స్ అతివాదుల మదత్తు అనిబిసెంటుకు కలిగియున్నదని ఆరోపించి హోమ్ రూల్ సంస్తకు కాంగ్ర్రెస్సు సహకారము నిరాకరించెను. అట్టి వివాదస్పద కాంగ్రెస్సు మదతును లెఖ్క చేయని అనిబిసెంటు ఒంటరి కృషివలననే ఆ హోమ్ రూల్ సంస్థ పురోగమించింది. 1915 లో మితవాద పక్షనాయకుడు ఫిరోజ్ షా మెహతా, గోపాల కృష్ణ గోఖలే చనిపోయినతరువాత మితవాదపక్ష కాంగ్రెస్సు అభ్యంతరములు తగ్గుముఖముపట్టినది. అప్పటినుండి స్వతంత్రసమరయోదమున కాంగ్రెస్సుకు చేదోడుగా హోమ్ రూల్ ఉద్యమము కొనసాగెను. భారతదేశము బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలన క్రింద వలసరాజ్యముగా కొనసాగుచుండగా ఆకాలమున ఐరోపా ఖండములో నెలకొనియున్న అంతర్జాతీయ పరిస్థితులు కూడా భారతీయులలో స్వరాజ్యకాంక్ష పెంపొందించుటకు కారణమైనవి. 1917 లో మాంటెగూ (Edwin Samuel Montagu) భారతదేశ యాత్రచేసి బ్రిటిష్ పార్లమెంటులో చేసిన ప్రకటన భారతదేశములో చాల ఉత్సాహము కలుగజేసినది (చూడు మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము ). గొప్ప స్వరాజ్య వాది అయిన అనీ బిసెంట్ కూడా మాంటెగూ పై ఉన్నతాభిప్రాయము కలిగి భారతదేశానికి కెనడా డొమీనియన్ మాదిరి అధినివేశ స్వరాజ్యము (డొమీనియన్ స్టేటస్ ) వచ్చునని ఆశించెను. దివ్యజ్ఞాన కార్యాక్రమాలు పక్కనపెట్టి ఆమె చేపట్టిన హోమ్ రూల్ సంస్థను బ్రిటిష్ ప్రభువులు మొదట్లో చులకనగా చూచినప్పటికి క్రమేణ ఆ ఉద్యమమువలన భారతదేశములో పెరుగుచున్న రాజకీయ పరిజ్ఞానము, తీవ్రమౌవుతున్న స్వరాజ్య కాంక్ష తత్ఫలితమైన రాజకీయ పరిణామములు బ్రిటిష్ ప్రభువులను కలవరపరచసాగెను. మద్రాసు రాష్ట్ర గవర్నర్ లార్డు పెంట్లాండ్ ఆమెను ఏవిదముగనైన అరికట్టదలచెను. మొదట ఆవిడ నడుపు పత్రికలపైన, తదుపరి ఆమె అనుచరులపైన ఆంక్షలు విధించెను. ఆమె ఫ్రారంభించిన ఉద్యమము భారతీయులకు స్వపరిపాలన కలుగజేయుట బ్రిటిష్సార్వభౌమత్వము క్రిందనేనని ఉద్ఘోషించినప్పటికిని ఆ లక్ష్యసాధనకు తీవ్రవాదక చర్యలు ప్రోత్సహించుచున్నదని నిందారోపణచేసి ఆమెను నిర్దుష్టమైన డిఫెన్సు ఆఫ్ ఇండియా చట్ట నిబందనల క్రింద మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీచేసి 1917 జూన్16 తేదిన నిర్భందించిరి. ఆమెతో పాటుగ బి.పి. వాడియా ( దివ్యజ్ఞాన సమాజవేత్త, న్యూ ఇండియా పత్రిక సంపాదకుడు) జి.యస్ అరుండేల్ ( దివ్యజ్ఞాన సమాజవేత్త, రచయిత) ను గూడా ఉదకమండలము, కోయంబత్తూరు లలోని ఖారగారములందు నిర్భందించిరి. ఆమె విడుదలకొరకు దేశమున చాల ఆందోళనకార్యమములు గాందీజీ నాయకత్వములో జరిగిన మీదట ఆమెను 1917 సెప్టెంబరు లోవిడుదలచేసిరి. అటుపై అనిబిసెంటు 1917 కలకత్తా కాంగ్రెస్సు మహా సభకు అద్యక్షతవహించెను. 1919నుంచి అనిబిసెంటులో చిత్రమైన రాజకీయ పరివర్తన కలిగి బ్రిటిష్ ప్రభుత్వముచేసిన మాంటెగు షెమ్సుఫర్డు సంస్కరణలకు మద్దతు పలుకనారంభించెను. క్రమేణ ఆమె రాజకీయనిర్యాణముతో పాటు ఆమెస్థాపించిన హోమ్ రూల్ లీగు కూడా ప్రాముఖ్యత కోల్పోయి కాంగ్రెస్సులో కలసిపోయింది.[1][3]