కాంచీపురం
Kanchipuram | |
---|---|
Corporation | |
Nickname(s): Spiritual Capital of Tamil Nadu,City of Thousand Temples, Silk City, Temple City, Capital of Pallava Nadu | |
Coordinates: 12°49′07″N 79°41′41″E / 12.818500°N 79.694700°E | |
Country | భారతదేశం |
State | Tamil Nadu |
Region | Tondai Nadu |
జిల్లా | Kanchipuram |
Government | |
• Type | Mayor-Council |
• Body | Kanchipuram Municipal Corporation |
• Mayor | M. Mahalakshmi (DMK) |
• Corporation Commissioner | G. Kannan I.A.S |
• Member of legislative assembly | C.V.M.P. Ezhilarasan |
• Member of Parliament | G.Selvam |
విస్తీర్ణం | |
• Total | 36.14 కి.మీ2 (13.95 చ. మై) |
• Rank | 15 |
Elevation | 105 మీ (344 అ.) |
జనాభా (2011) | |
• Total | 2,34,353 |
• Rank | 15 |
• జనసాంద్రత | 6,500/కి.మీ2 (17,000/చ. మై.) |
Demonym | kanchipuramites |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 631501-631503 |
Telephone code | 044 |
Vehicle registration | TN-21 |
కాంచీపురం, కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉంది. జిల్లా రాజధాని కాంచీపురం పాలార్ నది ఒడ్డున ఉంది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేడన్ తాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉంది.
జనాభా వివరాలు
2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం కాంచీపురం జనాభా 152,984. అందులో 50% పురుషులు, 50% స్త్రీలు. కాంచీపురం అక్షరాస్యత శాతం 75%. ఇది భారతదేశ సగటు అక్షరాస్యత (59.5%) కంటే చాలా ఎక్కువ. పురుష అక్షరాస్యత శాతం 81%, స్త్రీ అక్షరాస్యత 69%. ఆరు సంవత్సరాల కంటే వయస్సుకల పిల్లలు కాంచీపురం జనాభాలో 6% మంది ఉన్నారు.
సరిహద్దులు
కాంచీపురం జిల్లాకు ఉత్తరాన చెన్నై, తిరువళ్ళూరు జిల్లాలు, పశ్చిమాన వెల్లూరు, తిరువణ్ణామలై, దక్షిణాన విల్లుపురం జిల్లా, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. ఈ జిల్లా 11°00' నుండి 12°00’ ఉత్తర అక్షాంశాల మధ్య, 77°28' నుండి 78°50' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. జిల్లా విస్తీర్ణం హెక్టార్లు. జిల్లాను మూడు రెవెన్యు విభాగాలుగాను, ఎనిమిది తాలుకాలు గాను విభజించారు. జిల్లా మెత్తంలో 648 గ్రామ పంచాయితీలు, 13 బ్లాకులు ఉన్నాయి. జిల్లా వెంబడి 57 కి.మీల తీర రేఖ విస్తరించి ఉంది.
కాంచీపురం చరిత్ర
పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ నగరేషు కంచి మధ్య యుగములలో ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం. అప్పటిచైనా రాయబారి హుయాన్ సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని. పల్లవులు తమ పరిపాలన కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడ రేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్పవిద్వాంసుడు, సాహితీవేత్త. ఈయన పరిపాలనా కాలంలో కంచిని సందర్శించిన హుయాన్ సాంగ్ నగర చుట్టుకొలత 6 మైళ్ళు ఉన్నదని, ప్రజలు ధైర్యవంతులు, దయగలవారని వర్ణించాడు. బుద్ధుడు కూడా కంచిని సందర్శించాడు. అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయడంలో, విద్యాబోధనలో కాశీ అంత ప్రాముఖ్యం పొందింది. క్రీ.పూ.రెండవ శతాబ్దంలో పతంజలి వ్రాసిన మహాభాష్యాలలో కూడా కంచి యొక్క ప్రస్తావన ఉంది. మణిమెక్కళ్ అనే తమిళ కవి, పెరుమపంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. సా.శ.మూడవ శతాబ్దం నుండి తొమ్మిదో శతాబ్దం వరకు పాలించిన పల్లవరాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన కృష్ణా నది నుండి దక్షిణాన కావేరి వరకు పాలించారు. పల్లవుల తరువాత కంచిని చోళులు పదవ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తరువాత విజయ నగర రాజులు 14 నుండి 17 శతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలి గోపురాన్ని, వెయ్యి స్తంభాల మండపాన్ని, వరదరాజ స్వామి దేవాలయంలోని శిల్పకళాచాతుర్యం విజయనగర రాజుల కాలంలో జరిగింది. విజయనగర రాజుల తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయ్యింది. ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్ కు ఒక హారాన్ని బహుకరించాడని దానిని క్లైవ్ మకరకండి అని పిలుస్తారు. కంచి హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా తీర్థ స్థలం.
దేవాలయాలు
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |పురీద్వారావతీ చైవ సప్తైతే మోక్ష దాయికాః | భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం, అద్వైతవిద్యకు ఆధారస్థానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠవైభవంతో కంచి నగరశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డాణము. అతి ప్రధానమైన శక్తిక్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు దేహవిముక్తి నందిన పుణ్యస్థలం.
ఏకాంబరేశ్వర దేవాలయం
కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం,ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కైంద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు.ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. తిరునిలథింగల్ తుండం అనే మహా విష్ణువు సన్నిధి ఉంది. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తరువాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింప జేయగా, పార్వతి గంగను ప్రార్థించి, వారిద్దరు శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగనస్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.. ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు.
కామాక్షి దేవాలయం
పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది.
కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెరకుగడ,, తామర పుష్పాన్ని, చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.
కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగంన్ని ప్రతిష్ఠచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు.
ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి.భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్థించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది.
ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆతర్వాత కామాక్షి దేవికి ఎదురుగా గోపూజ చేస్తారు.
గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు.[1]
వరదరాజ పెరుమాళ్ ఆలయం (కాంచీపురం)
1053 సంవత్సరం చోళులు ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటిమీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి, బంగారు బల్లులు తాకి, తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకొంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం, బంగారు తామర తటాకం ఉjన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవతా మూర్తి విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. 1979వ సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును కోనేరు నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు.మళ్ళీ 2019వ సంవత్సరం జూన్ నేలలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం . ఈ దేవాలయ ప్రాకారాలు పదకొండొవ శతాబ్దం తరువాత చోళ రాజులైన మెదటి కులుత్తోంగ చోళ, విక్రమ చోళ తరువాత విజయనగర రాజుల చేత నిర్మించబడ్డాయి, పునరుద్ధించబడ్డాయి. ఈ దేవాలయంలో కూడా వెయ్యి స్తంభాల మండపం ఉంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని కృత యుగములో బ్రహ్మ, త్రేతా యుగములో గజేంద్రుడు, ద్వాపరయుగములో బృహస్పతి, కలి యుగములో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఈ దేవాలయ మహాత్మ్యం హస్తిగిరి మహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడ మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది.[2]
కంచి పట్టుచీరలు
కంచి జిల్లా దేవాలయాలకే కాకుండా చేనేత పట్టు వస్త్రాలకు జగత్ప్రసిద్ధి పొందింది. కంచి పట్టణంలో 400 సంవత్సరాల నుండి సుమారు 5,000 కుటుంబీకులు చేనేత వృత్తిని జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ఈ చేనేత వృత్తికారులు నేసిన పట్టు వస్త్రాలు, మల్బరీ పట్టు నుండి తయారు చేయబడిన పట్టు చీరలు, వివిధ రంగుల జరీలు, ఇక్కడి నేత కార్మికుల పనితనానికి మచ్చుతునక.
మహాబలిపురం
మహాబలిపురం, పల్లవులకాలంలో ప్రాముఖ్యత పొందిన చారిత్రాత్మక తీరపట్టణం. ఈ పట్టణతీరంలో దేవాలయం, ఏకశిలపై చెక్కబడిన శిల్పాలు, పాండవులు, ద్రౌపది పేర్లమీద చెక్కబడిన ఏకశిలా రథాలు పల్లవుల శిల్పకళకు తార్కాణాలు. మహాబలిపురంలో ఉన్న దేవాలయాలు పల్లవ రాజైన మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ కాలంలో నిర్మించబడ్డాయి. సముద్ర తీరంలో ఉన్న దేవాలయం యునెస్కో వారిచే పరిరక్షింపబడుతున్న ప్రపంచ చారిత్రాత్మక హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి.
వ్యవసాయం
కంచి జిల్లాలో 47% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వరి ప్రధాన పంట. వరి కాకుండా చెఱకు, వేరుశెనగ, మినుములు, జొన్నలు కూడా పండిస్తారు.
విద్యాసంస్థలు
కాంచీపురంలో ఉన్న విద్యా సంస్థలు, పట్టభద్ర కళాశాలలు
- శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ (SCSVMV)
- అరుళ్‌మిగు మీనాక్షి అమ్మళ్ ఇంజనీరింగ్ కళాశాల (AMACE)
- ఎస్.పి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల
- పల్లవల్ ఇంజనీరింగ్ కళాశాల
- కంచి శ్రీ కృష్ణ కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్
- తిరుమలై ఇంజనీరింగ్ కళాశాల
- లార్డ్ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల
- పల్లవన్ పాలిటెక్నిక్ కళాశాల
- పల్లవన్ ఫార్మసీ కళాశాల
- భక్తవత్సలం పాలిటెక్నిక్ కళాశాల
- పచ్చయప్ప ఆర్ట్స్ కళాశాల
కాంచీపురంలో ప్రసిద్ధి చెందిన పురాతన పాఠశాలలు ఉన్నాయి.
- శాంగ్‌ఫోర్డ్ పాఠశాల (అమెరికా తరపు విద్యాసంస్థ
- యం.ఎల్.ఎం. మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరి పాఠశాల
- ఏండర్సన్ హైయర్ సెకండరీ స్కూలు
- పచ్చయప్ప హయ్యర్ సెకండరీ స్కూలు
- ఎస్.ఎస్.కె.వి హయ్యర్ సెకండరీ స్కూలు
- ఎస్.ఎస్.కె.వి మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూలు
- ఇన్‌ఫెంట్ జీసస్ మెట్రిక్యులేషన్ హయర్ సెకండరీ స్కూలు
శీతోష్ణస్థితి
కంచి జిల్లాలో ఉష్ణోగ్రతలు
ఋతువు | అత్యధిక ఉష్ణోగ్రత | అత్యల్ప ఉష్ణోగ్రత |
---|---|---|
వేసవికాలం | 36.6° సె | 21.1° సె |
శీతాకాలం | 28.7° సె | 19.8° సె |
- వర్షపాతం
ఋతుపవనాల ముందు పడే వర్షపాతం జిల్లా అంతా ఒక లాగే ఉంటుంది. సముద్ర తీరం వైపు ఉన్న తాలుకాలకు ఋతుపవనాల వల్ల కలిగే వర్షపాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాలు 54% వర్షపాతాన్ని, నైఋతి ఋతుపవనాలు 36% వర్షపాతం కలుగజేస్తున్నాయి. సంవత్సరంలో సగటు వర్షపాతం 1213.3 మి.మీ.
చిత్రమాలిక
-
ఏకాంబరేశ్వర దేవాలయం
-
ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు.
-
శ్రీ కైలాస నాథుని ఆలయం
-
శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము
-
శ్రీ వరదరాజస్వామి ఆలయం
-
శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం, కుమరకోట్టం
-
శ్రీ విజయేంద్ర సరస్వతి
మూలాలు
- ↑ "కామాక్షి దేవాలయం వెబ్ సైటు నుండి". Archived from the original on 2007-08-11. Retrieved 2007-08-19.
- ↑ "Kanchipuram on the web". Archived from the original on 2000-04-20. Retrieved 2007-08-19.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
- కాంచీపురంలో ఉన్న దేవాలయాలు
- జాతీయ సూచన సంస్థ వారు అందిస్తున్న కాంచీపురం జిల్లా వెబ్ సైటు Archived 2017-09-08 at the Wayback Machine
- కాంచీపురం తీర్థయాత్ర గురించి సమాచారం అందించే వెబ్ సైటు
- తమిళనాడు రాష్ట్ర పర్యాటకశాఖ వారి వెబ్ సైటు-కాంచీపురం Archived 2007-06-27 at the Wayback Machine
- http://www.kamakoti.org/ కంచి పీఠం వెబ్ సైట్
- మొదటిసారిగ కంచి వేళ్ళే వాళ్ళు ఈ బ్లాగు చూడండి.