జకాత్
జకాత్ (అరబ్బీ : زكاة ) ఇస్లాం ఐదు మూలస్తంభాలలో నాలగవది. జకాత్ అనగా "శుద్ధి", తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా, తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడం. ప్రతి ముస్లిం తన సాంవత్సరిక ఆదాయం, ధనములో 2.5% అల్లాహ్ మార్గంలో అవసరమున్నవారికి లేదా పేదవారికి సహాయం చేయాలి, ఈధార్మిక విధానాన్ని జకాత్ అంటారు. ఈ జకాత్ ను రంజాన్ మాసంలో లెక్కగట్టి చెల్లిస్తారు.
జకాత్ ఇస్లాం ఐదు మూలస్తంభాలలో ఒకటి, దీని ప్రస్తావన ఖురాన్ లోనూ, హదీసు లలోనూ ఉంది.
ఖురాన్ లో జకాత్ గురించి
ఖురాన్ లో జకాత్ గురించి దాదాపు ముప్ఫై ఆయత్ లలో వర్ణింపబడింది. మరీ ముఖ్యంగా మదనీ సూరా లలో. ఖురాన్ ప్రకారం జకాత్ "ధన వికేంద్రీకరణ విధానము", ధనము ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, అవసరనిమిత్తమైన వారి దగ్గరకు కూడా చేర్చబడే విధానము. జకాత్ కు ఇస్లాంలో "పన్ను" కన్నా ఉత్తమ స్థానమున్నది. ఇది మోక్ష మార్గాలకు దారులలో ఒకటి. ముస్లిమేతరులు దీనిని చెల్లించనక్కరలేదు, కానీ జిజియా రూపంలో చెల్లించవచ్చును. కానీ ఖురాన్ లో ఈ విధంగా ప్రకటింపబడింది." ఎవరైతే జకాత్ చెల్లిస్తారో వారికి పరలోకంలో మంచి బహుమానాలున్నాయి, ఎవరైతే పట్టించుకోరో వారికి శిక్ష తప్పదు". జకాత్ చెల్లింపు ద్వారా తన ధనాన్ని, ఆత్మను శుద్ధి చేసుకోవచ్చును.[1]
ముస్లింలకు పన్నులు చెల్లించడం (జకాత్ తో సహా), పరమేశ్వరునికి మానవాళికి మధ్యన ఒక వారధి లాంటిది. [ఖోరాన్ 2:83][1]
జకాత్ ఎవరికి ఇవ్వవచ్చో దీనికి ఖురాన్ వర్ణిస్తుంది.[2]
హదీసులలో జకాత్ గురించి
హదీసు లలో జకాత్ ఇవ్వని వారి గూర్చి విమర్శించడం జరిగింది. జకాత్ చెల్లించకపోవడం మునాఫిక్ ల పని, ఇలాంటి వారి ప్రార్థనలను అల్లాహ్ అంగీకరించడు. హదీసుల ప్రకారం ధనికులు జకాత్ చెల్లిస్తే పేదలు ఆకలితో అలమటించరు. జకాత్ చెల్లించువారి ధనం జకాత్ చెల్లించడం ద్వారా శుద్ధి అగును, పరిపూర్ణ స్వచ్ఛత పొందును. జకాత్ చెల్లిస్తే, వారి ధన మాన ప్రాణ రక్షణల బాధ్యత అల్లాహ్ దే. చెల్లించని వారు ప్రళయదినాన లెక్కలు ఇవ్వవలసినదే, శిక్ష పొందవలసినదే.[2]
ఒక సంవత్సరం పాటు ధనం వుంచుకున్నట్లయితే దానిపై జకాత్ చెల్లించాలి. లేదా లావాదేవీల ప్రకారం మొత్తం ధనం, మొత్తం లాభం, వాటిపై "నిసాబ్" ప్రకారం ఏడున్నత తులాల బంగారం విలువ లేదా ఏభైరెండున్నర తులాల వెండి విలువ పోనూ మిగిలిన మొత్తం పై రెండున్నర శాతం జకాత్ ను చెల్లించాలి.[2]
హదీసుల ప్రకారం, ప్రభుత్వాలు జకాత్ ను వసూలు చేయవచ్చు. వసూలు చేసే అధికారులు, చెల్లించవలసిన జకాత్ కన్నా అధికంగా వసూలు చేయరాదు. జకాత్ చెల్లింపుదారులు జకాత్ ను ఎగ్గొట్టరాదు. జకాత్ వసూలు చేసే అధికారం లేని వారు జకాత్ వసూలు చేయడం నేరం, శిక్షార్హులు. (చూడుము beneficiaries of zakat).[2]