డేవిడ్ బ్రౌన్
రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ (1763-1812) భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మతప్రవక్త. ఇతడు ఆంధ్రభాషాభివృద్ధికి విశేషమైన కృషి చేసిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తండ్రి.
విశేషాలు
ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పాలిస్తున్న తొలి రోజులలో కలకత్తలోని బ్రిటీష్ ఉద్యోగులు పైలాపచ్చీసుగా తిరుగుతూ వుండేవారు. వారిలో అవినీతి పెరిగి, దైవచింతన, పాపభీతి నశించి క్రైస్తవ మత ధర్మాలు మరిచి భోగలాలసతకు దిగజారిపోయారు. తమ ఉద్యోగుల ప్రవర్తన గురించి ఇంగ్లాండులోని కంపెనీ డైరెక్టర్ల దృష్టికి పోయింది. తమ ఉద్యోగుల దుష్ప్రవర్తనను సరిదిద్దడానికి వారు ఇంగ్లాండు నుండి భారతదేశానికి కొంతమంది క్రైస్తవ మత ప్రబోధకులను పంపారు. అలా పంపినవారిలో డేవిడ్ బ్రౌన్ ఒకడు. ఇతడు 1786, జూన్ 8వ తేదీ కలకత్తా నగరంలో అడుగు పెట్టాడు. హౌరాలోని సైనిక అనాథశరణాలయానికి అధికారిగా నియమితుడైనాడు. 1787 సెప్టెంబరులో అనాథ శరణాలయానికి దగ్గరగా ఒక పాఠశాలను నెలకొల్పాడు. ఇతనికి చర్చి మిషన్ ప్రారంభించాలని ఉబలాటంగా ఉండేది. ఇతడు బ్రిటిష్ అధికారులకు పాత చర్చిలోను, సెయింట్ జాన్ చర్చిలోను జ్ఞానోపదేశం చేసేవాడు.
1803లో ఇతడు సెరంపూర్‌లో అల్డీన్ హౌస్‌ను కొనుగోలు చేసి దానిని తన నివాసస్థానంగా మార్చుకున్నాడు. ఆ నివాస స్థలంలో ఒక పాడుబడిన హిందూ దేవాలయం (రాధావల్లభ దేవాలయం) ఉండేది. ఉపన్యాసాలు, ప్రార్థనలు, విరామం లేకుండా చర్చి పాలన విషయాలలో అహోరాత్రాలు మునిగి తేలుతూ ఉండడం వల్ల అతని ఆరోగ్యం దెబ్బతినింది. అయినా సువార్త ప్రచారం మానలేదు. తరువాత ఇంగ్లాండు నుండి క్లాడియన్ బుకనాన్, హెన్నీ మార్టిన్, డానియల్ కోరీ, థామస్ థాంసన్ ఇంగ్లాండు నుండి వచ్చారు. వీరందరికీ డేవిడ్ బ్రౌన్ నివాస స్థలమైన అల్డీన్ హౌస్ ఆశ్రయమిచ్చింది. డేవిడ్ వీరందరికీ వసతులు కల్పించి స్వంత కుటుంబసభ్యులుగా భావించి చూసుకునేవాడు. డేవిడ్ దయామయుడని, భగవంతుని దూత అని, యువమతాచార్యులను స్వంత బిడ్డల్లా ప్రేమాభిమానాలతో చూసుకునేవాడని ప్రజలు అనుకునేవారు. అల్డీన్ హౌస్‌లోని పగోడా (రాధావల్లభ ఆలయం)ను హెన్నీమార్టిన్ ప్రార్థనా స్థలంగా ఉపయోగించేవాడు. క్రైస్తవ మతప్రవక్తలకు ముఖ్యంగా బాప్టిస్టు మిషనరీలకు అల్డీన్ హౌస్ ఆ కాలంలో ఒక సమావేశ స్థలంగా మారింది.
1800లో కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాల ప్రారంభించబడి దానికి ఇతడిని ప్రొవోస్ట్ (అధిపతి)గా నియమించారు. బి.రాయ్ అనే బెంగాలీ బ్రాహ్మణుడు డేవిడ్ బ్రౌన్‌కు మున్షీగా ఉన్నాడు.
ఇతడు 1814 మే 14న ఆరోగ్యం కోలుకోవడానికి సముద్రపు గాలి కోసం పడవలో మద్రాసుకు బయలుదేరాడు. కాని తాను ప్రయాణం చేస్తున్న పడవ మునిగిపోయింది. ఎట్లాగో బతికి బయట పడ్డాడు కానీ ఆరోగ్యం కుదుట పడక తరువాత నెల రోజులకు 1814, జూన్ 14న చౌరంగీలో మరణించాడు. కలకత్తాలోని సౌత్ పార్క్ సెమెట్రీలో ఇతని సమాధి వుంది[1].
కుటుంబం
ఇతడు మొదట మిస్ రాబిన్‌సన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె 1794 మరణించింది. 1976లో ఇతడు కౌలీ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి 9 మంది సంతానం. వారిలో జేమ్స్ కౌలీ బ్రౌన్, జార్జ్ ఫ్రాన్సిస్ బ్రౌన్‌లు బెంగాల్ సివిల్ సర్వీసులో పనిచేశారు. ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కడప డిప్యుటీ కలెక్టర్‌గా పనిచేశాడు.
మూలాలు
- ↑ ఒ.వి. (16 January 1978). "ప్రఖ్యాతుడైన మరో బ్రౌన్". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 64, సంచిక 282. Retrieved 5 January 2018.[permanent dead link]