పురుగుమందు

FLIT manual spray pump for insecticides from 1928

పురుగుమందులు : వ్యవసాయదారులు సస్యరక్షణలో భాగంగా పంటలకు క్రిమికీటకాలు సోకి నష్టాన్ని కలిగించకుండా కొన్ని మందులు వాడుతారు. వాటిని పురుగుమందులు (Insecticides) అంటారు.[1]

పురుగుమందులు కొనేటపుడు, ఉపయోగించేటపుడు రైతులు చేయవలసినవి, చేయకూడనివి

కొనుగోలు చేసేటపుడు చేయవలసినవి
  • సరైన లైసెన్సు ఉన్న అధీకృత డీలర్ వద్దనుంచి మాత్రమే పురుగుమందులు/జైవిక పురుగుమందులు కొనుగోలు చేయాలి.
  • ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక్కసారి సరిపడ పురుగుమందు ఎంత కావాలో అంతే మోతాదులో కొనుగోలు చేసుకోవాలి.
  • పురుగుమందుల డబ్బాలు/సంచులపై అనుమతుల సమాచారం ముద్రించిన లేబుల్ ను గమనించాలి.
  • లేబుల్ మీద బ్యాచ్ నంబరు, నమోదు నంబరు, తయారీ తేదీ, కాల పరిమితి వివరాలను గమనించాలి.
  • డబ్బాలలో చక్కగా ప్యాక్ చేసిన పురుగుమందులనే తీసుకోవాలి.
కొనుగోలు చేసేటపుడు చేయకూడనివి
  • లైసెన్సు లేని వ్యక్తులనుంచి లేదా అనధీక్రుత డీలర్ల నుంచి పురుగుమందులు కొనకూడదు.
  • మొత్తం పంటకాలానికి సరిపోయేపురుగుమందును ఒకేసారి కొనకూడదు.
  • అనుమతితో కూడిన లేబుల్ లేని పురుగుమందును కొనకూడదు.
  • కాలం చెల్లిన పురుగుమందులను ఎప్పుడూ కొనకూడదు.
  • డబ్బాలు పగిలి కారుతున్న, మూత తీసిఉన్నా, కొద్దిగా వాడి ఉన్నా ఆ పురుగుమందును వాడకూడదు.
నిల్వ చేసే సమయంలో చేయవలసినవి
  • పురుగుమందులను ఇంటి ఆవరణకు దూరంగా ఉంచాలి
  • పురుగుమందులను కొన్నప్పడు ఉన్న డబ్బాల్లోనే భద్రపరచండి.
  • పురుగుమందులను/కలుపు సంహారకాలను వేర్వేరుగా భద్రపరచాలి.
  • పురుగుమందులను భద్రపరిచేచోట హెచ్చరికలు పెట్టండి
  • పిల్లలు, కోళ్ళు, పశువులకు పురుగుమందులను అందుబాటులో లేకుండా చూడాలి.
  • నిల్వ ఉంచే స్థలము ఎండ, వానలకు గురి కాకుండా కాపాడుకోవాలి
నిల్వ చేసే సమయంలో చేయకూడనివి
  • పురుగుమందులను ఇంటిలో ఎప్పుడూ ఉంచకూడదు.
  • పురుగుమందులను కొన్నప్పటి డబ్బాలనుంచి వేరే డబ్బాల్లోకి మందును మార్చకూడదు.
  • పురుగుమందులను, కలుపు సంహారకాలతో కలిపి భద్రపరచకూడదు.
  • పురుగుమందులు నిల్వ చేసిన చోటుకు పిల్లలను వెళ్లనీకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పురుగుమందులకు ఎండ, వాననీరు తగలకుండా చూసుకోవాలి.
ఉపయోగించే సమయంలో చేయవలసినవి;
  • రవాణా సమయంలో పురుగుమందులను విడిగా ఉంచవలెను
  • పురుగులమందులు వాడే ప్రదేశానికి జాగ్రత్తగా తీసుకెళ్లడం అవసరం.
ఉపయోగించే సమయంలో చేయకూడనివి
  • పురుగుమందులను ఆహారం/పశువుల మేత/ఇతరఆహార పదార్ధాలతోకలిపి రవాణా చేయకూడదు
  • పురుగుమందులను తల/భుజాలు/వీపు మీద ఎప్పుడూ మోసుకెళ్ళకూడదు
ద్రావకాలను తయారుచేసే సమయంలో చేయవలసినవి
  • ఎల్లప్పుడూ మంచి నీటినే వాడాలి
  • మొత్తం శరీరాన్ని కప్పే విధంగా చేతి తొడుగులు, ముఖానికి తొడుగు, టోపీ, ఏప్రాన్, ప్యాంటు మొదలైనవాటిని విధిగా వాడాలి
  • ద్రావకం చింది ముక్కు, కళ్ళు, చెవులు, చేతులపైన పడకుండా కాపాడుకోవాలి
  • పురుగుమందుల డబ్బా మీది సూచనలను శ్రధ్ధగా చదవాలి.
  • ద్రావకాన్ని అవసరమైనంతవరకు తయారచేసుకుని 24 గం || లోపు వాడాలి.
  • గుళికల పురుగుమందును కూడా అలాగే వాడాలి
  • పురుగుమందు ద్రావకాలను ట్యాంకులో పోసేటపుడు బయటకు చిమ్మకుండా జాగ్రత్త పడాలి
  • సూచించిన పరిమాణంలోనే పురుగుమందులు వాడాలి
  • ఆరోగ్యానికి భంగం కలిగించే ఏ పనులూ చేయకూడదు.
ద్రావకాలను తయారుచేసే సమయంలో చేయకూడనివి
  • బురదనీటినిగానీ, మురికినీటినిగానీ వాడకూడదు
  • శరీరానికి రక్షణ తొడుగులను ధరించకుండా పిచికారి ద్రావకాలను తయారుచేయ కూడదు, స్ప్రే చేయకూడదు.
  • పురుగుమందులు/ద్రావకాలు మీ శరీరభాగాలపైన పడకుండా జాగ్రత్త పడాలి.
  • లేబుల్ మీద...వాడకం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ఇచ్చిన సమాచారాన్ని చదవడం మానకూడదు
  • మిగిలిపోయిన ద్రావకాన్ని తయారుచేసిన 24గంటల తర్వాత ఎప్పుడూ వాడకూడదు
  • గుళికలను నీటితో కలపకూడదు
  • పురుగుమందు చల్లే ట్యాంకు వాసన చూడకూడదు
  • పరిమితిని మించిన పరిమాణం వాడి మొక్క ఆరోగ్యం, పర్యావరణానికి హాని చేయకూడదు
  • పురుగుమందులు వాడు సమయంలో తినడం, తాగడం, పొగ తాగడం, లాంటి పనులు చేయకూడదు
పురుగు మందుల వాడకానికి ఉపయోగించు పరికరాల ఎంపిక సమయంలో చేయవలసినవి
  • మంచి పరికరాలనే ఎంచుకోండి.
  • సరైన పరిమాణమున్న నాజిల్ ఎంచుకోవాలి.
  • పురుగుమందులకు, క్రిమసంహారకాలకు వేర్వేరు పిచికారులను వాడాలి
పురుగు మందుల వాడకానికి ఉపయోగించు పరికరాల ఎంపిక సమయంలో చేయకూడనివి
  • చిల్లులు, లోపాలు ఉన్న పరికరాలను వాడకూడదు
  • సిఫార్సు చేయబడని/లోపభూయిష్టమైన నాజిల్ ఎంచుకోకూడదు. మూసుకుపోయిన నాజిల్ ను నోటితో ఊదడంగానీ, శుభ్రపరచడంగానీ చేయకూడదు
  • పురుగుమందులకు, క్రిమసంహారకాలకు ఒకే పిచికారి వాడకూడదు
ద్రావకాల పిచికారి సమయంలో చేయవలసినవి
  • సూచించబడిన పరిమాణాన్ని, నీటిని మాత్రమే వాడాలి
  • చల్లగా, ప్రశాంతంగా ఉన్నరోజునే పురుగుమందును ఉపయోగించాలి
  • సాధారణంగా పొడిగా ఉన్న రోజుననే పురుగుమందు వాడవలెను
  • ప్రతి పురుగుమందు ఉపయోగానికి వేర్వేరు పిచికారిలను వాడవలెను
  • గాలి వీచే దిశలోనే పురుగుమందు పిచికారి చేయవలెను
  • మందు వాడకం పూర్తయిన తర్వాత పిచికారిలను, బాల్చీలను డిటర్జెంట్/సోప్ లతో మంచినీటితో కడగవలెను
  • పిచికారి పూర్తయిన వెంటనే పొలంలోకి పశువులనుగానీ, కూలీలను గానీ అనుమతించకూడదు
ద్రావకాల పిచికారి సమయంలో చేయకూడనివి
  • సూచించినదానికంటే ఎక్కువ పరిమాణాన్ని, ఎక్కువ గాఢతతో కూడిన ద్రావకాలను వాడకూడదు
  • ఎండ బాగా కాస్తున్నరోజునగానీ, బాగా గాలులు వీస్తున్న రోజునగానీ ద్రావకము పిచికారి చేయకూడదు
  • వర్షాలు రావడానికి ముందుగానీ, వర్షాలు కురిసిన వెంటనేగానీ వాడకూడదు
  • పాలలా చిక్కగా ఉండే ద్రావకాలను బ్యాటరీతో నడిచే యూఎల్వీ పిచికారిని ఉపయోగించకూడదు
  • గాలి వీచే దిశకు వ్యతిరేకంగా పిచికారి చేయకూడదు
  • పురుగుమందులు కలపడానికి ఉపయోగించిన డబ్బాలను, బాల్చీలను ఎంత శుభ్రంగా కడిగినాగానీ ఇంట్లో అవసరాల కోసం వాడకూడదు
  • మందులు చల్లిన వెంటనే రక్షణ దుస్తులు ధరించకుండా పొలంలోకి వెళ్ళకూడదు
పిచికారి పూర్తయిన తర్వాత చేయవలసినవి
  • మిగిలిపోయిన ద్రావకాలను బీడు భూములు వంటి సురక్షిత ప్రదేశంలో పారబోయవలెను
  • వాడేసిన పురుగుమందుల డబ్బాలను ముక్కలుగా చేసి ఊరికి దూరంగా భూమిలో పాతేయండి.
  • తినడానికి/పొగతాగడానికి ముందు చేతులను, ముఖాన్ని శుభ్రమైన నీరు, సోపుతో కడుక్కోవాలి
  • విషప్రభావమేమైన కనబడితే ప్రథమ చికిత్స చేసి రోగిని వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళండి. వాడేసిన పురుగుమందు డబ్బా కూడా వైద్యునికి చూపించాలి
పిచికారి పూర్తయిన తర్వాత చేయకూడనివి
  • మిగిలిపోయిన ద్రావకాలను మురుగు కాలువలలో, చెరువుల్లోగానీ, నీటి కాలవల్లోగానీ పోయకూడదు
  • ఉపయోగించబడిన పురుగుమందు డబ్బాలను తిరిగి వాడరాదు
  • బట్టలు ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా తినడంగానీ, పొగతాగడం గానీ చేయకూడదు
  • విషప్రభావమేమైనా కనబడితే వైద్యుడిదగ్గరకు తీసుకెళ్ళటం మానకండి.అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన ప్రాణం పోయే అవకాశముంది.

వనరులు

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]