సమాధి

గాంధీ సమాధి రాజ్ ఘాట్, ఢిల్లీ

ఒక జీవి మరణించినప్పుడు ఆ జీవి జ్ఞాపకార్ధం నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. సాధారణంగా శ్మశానంలో మరణించిన వ్యక్తి యొక్క శవాన్ని పూడ్చిన చోట సమాధిని నిర్మిస్తారు. కొందరు తమ కుటుంబ సభ్యులు ఏవరైనా చనిపోతే తమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత స్థలములలో చనిపోయిన వ్యక్తి యొక్క మృత శరీరమును పూడ్చి, చనిపోయిన వారికి గుర్తుగా సమాధిని నిర్మిస్తారు. శ్మశానంలో అనేక సమాధులు నిర్మించబడి ఉంటాయి. కొందరు తమ కుటుంబ సభ్య్లల సమాధుల వద్దకు, లేదా తమ అభిమాన నాయకుల సమాధుల వద్దకు ప్రతి సంవత్సరం చనిపోయిన వ్యక్తి యొక్క పుట్టినరోజు అనగా జయంతి రోజు, అలాగే చనిపోయిన రోజు అనగా వర్ధంతి రోజు ఆ సమాధి వద్దకు వచ్చి పూజలు చేసి మేము బాగుండాలని దీవించమని వేడుకుంటారు. కొందరు ప్రముఖ వ్యక్తులకు ప్రభుత్వమే సమాధిని నిర్మిస్తుంది, అలాగే వారికి జయంతోత్సవమును, వర్ధంతోత్సవమును నిర్వహిస్తుంది. ఉదాహరణకు మహాత్మా గాంధీకి అంత్యక్రియలు జరిగిన చోట నల్లని పాలరాతితో రాజ్ ఘాట్ అనే స్మారక కట్టడంను నిర్మించారు. అక్కడ ప్రభుత్వమే ప్రతి సంవత్సరం గాంధీ పుట్టిన రోజున గాంధీ జయంతి ఉత్సవాలను, గాంధీ చనిపోయిన రోజున గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. సాధారణంగా సమాధిపై చనిపోయిన వ్యక్తి యొక్క పేరును, పుట్టినరోజు యొక్క తేదిని, అలాగే మరణించిన రోజు యొక్క తేదిని తెలియపరచు శిలాఫలకం ఉంచుతారు, ఇంకా ఈ శిలాఫలకముపై అతని మతమునకు సంబంధించిన చిహ్నములను చిత్రిస్తారు. కొందరు హిందువులు సమాధిపై తులసి మొక్కను నాటుతారు. హిందువులకు సంబంధించిన సమాధులు ఉత్తర, దక్షిణాలు పొడవుగా వుంటాయి, తూర్పు, పడమరలు పొట్టిగా వుంటాయి. ఎందుకంటే సమాధిలో చనిపోయిన వ్యక్తి యొక్క కాళ్ళు ఉత్తరం వైపుకు, తల దక్షిణం వైపుకు ఉండేలా మృతదేహమును ఉంచుతారు. సాధారణంగా భార్యాభర్తలకు సంబంధించిన సమాధులు పక్కపక్కనే నిర్మిస్తారు. సాధారణంగా భార్యాభర్తల సమాధులలో భర్త సమాధి పడమర వైపు, భార్య సమాధి తూర్పు వైపు ఉండేలా పక్కపక్కనే నిర్మిస్తారు. సాధారణంగా సమాధులు చాలా వరకు తల వైపు గుమ్మటంలా నిర్మిస్తారు, ఈ గుమ్మటంలో దీపాలను వెలిగించుటకు వీలుగా గూడులను ఏర్పాటు చేస్తారు, కొందరు సమాధిని మండపంగా నిర్మిస్తారు.

ప్రసిద్ధిచెందిన సమాధులు

తాజ్ మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి.[1] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. ఈ సమాధి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా, ప్రపంచంలోని కొత్త ఏడు అద్భుతాలుగా జాబితా చేయబడినది. తాజ్ మహల్ భారతదేశంలోని మొఘల్ నిర్మాణానికి ఉత్తమ ఉదాహరణ.

మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన తాజ్ మహల్ సమాధి
ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు సమాధి

మూలాలు

  1. "సెప్టెంబరు 1 నుంచి తెరుచుకోనున్న తాజ్‌మహల్". m.eenadu.net/ap/latestnews/Taj-Mahal-Set-To-Reopen-From-Sept-1/1700/120097737
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.