రాజేష్ ఖన్నా
రాజేశ్ ఖన్నా | |
---|---|
జననం | జతిన్ ఖన్నా 1942 డిసెంబరు 29 |
మరణం | 2012 జూలై 18 | (వయసు 69)
ఇతర పేర్లు | Jatin Khanna Kaka RK |
వృత్తి | Film actor and producer |
క్రియాశీల సంవత్సరాలు | 1966–2012 (actor)
1991–1996 (politics) 1971–1995 (producer) |
జీవిత భాగస్వామి | డింపుల్ కపాడియా (1973–1984) |
పిల్లలు | [[ట్వింకిల్ ఖన్నా]] [[రింకీ ఖన్నా]] |
[[రాజేశ్ ఖన్నా]] (అసలు పేరు జతిన్ ఖన్నా; డిసెంబర్ 29, 1942 - 18 జూలై, 2012) హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. భారతీయ సినిమా మొదటి సూపర్ స్టార్ గా వ్యవహరింపబడే ఈయన 163 చిత్రాలలో నటించారు. 1970 నుండి తను సోలోగా నటించిన చిత్రాలు వరుసగా 15 విజయవంతం కావటంతో ఈయనకు ఈ పేరు సార్థకమైనది. ఇంతవరకూ ఈ రికార్డుని ఎవరూ బద్దలకొట్టలేక పోయారు. మార్చి 1973 లో డింపుల్ కపాడియాతో వివాహం జరిగింది. డింపుల్ తొలిచిత్రం బాబీ (హిందీ) విడుదలకి ఆరు నెలల ముందు ఈ వివాహం జరిగింది. డింపుల్ కూడా ఖన్నా అభిమాని కావటం యాదృచ్ఛికం. అయితే 1984 లో వీరిద్దరూ విడిపోయారు. వీరి పెద్ద కుమార్తె [[ట్వింకిల్ ఖన్నా]], నటుడు అక్షయ్ కుమార్ ని వివాహమాడినది. చిన్న కుమార్తె [[రింకే ఖన్నా]] కూడా లండన్ లోని ఒక వ్యాపారవేత్తని వివాహమాడినది.
గత చరితం
1942 డిసెంబరు 29న్ జన్మించిన జతిన్ అరోరా, 1940 లో తన స్వంత తండ్రి అప్పటికీ భారతదేశంగానే ఉన్న పాకిస్థాన్ నుండి అమృత్ సర్ కి రావటంతో చున్నీలాల్ ఖన్నా-లీలావతీ ఖన్నా దంపతులచే దత్తత తీసుకొని పెంచబడ్డాడు. రవి కపూర్ (జితేంద్ర)తో బొంబాయి లోని సెయింట్ సెబాస్టియన్ గోవన్ హై స్కూలులో విద్యాభ్యాసం సాగించాడు. ఈ ఇద్దరి స్నేహితుల తల్లులు కూడా స్నేహితురాళ్ళే. నాటక రంగం పైన ఆసక్తి గల ఖన్నా పాఠశాల, కళాశాల స్థాయిల్లో తన ప్రదర్శనలకు గాను చాలా బహుమతులనందుకొన్నాడు. చిత్రసీమలో అడుగుపెట్టే తన నిర్ణయాన్ని తెలుసుకొన్న పెంపుడు తండ్రి రాజేశ్ ఖన్నాగా పేరు మార్చాడు. తనని అందరూ కాకా అని వ్యవహరించేవారు.
సంబంధాలు
70వ దశకానికి ఖన్నా నటి, ఫ్యాషన్ డిజైనర్ అయిన అంజు మహేంద్రుని ప్రేమించాడు. వారి మధ్య సంబంధం ఏడేళ్ళు నడిచింది. విడిపోయిన పదిహేడేళ్ళూ వారి మధ్య మాటలు లేవు అని మహేంద్రు అంటుంది. తర్వాత డింపుల్ ని చేసుకొన్న ఖన్నా షూటింగుల కారణంగా ఇంటి పట్టునే ఉండలేక పోవటం, డింపుల్ కి నటించాలనే ఉద్దేశం ఉండటం వలన 1984 లో వారు విడిగా జీవించడం మొదలుపెట్టినా, విడాకులు మాత్రం తీసుకోలేదు. 80వ దశకంలో టీనా మునింతో మొదలైన సంబంధం ఆమె చిత్రసీమలో ఉన్నన్ని రోజులూ నడిచింది. తన మరణానికి కొన్ని వారాల ముందు రాసిన వీలునామాలో తన ఆస్తులు మొత్తం కూతుళ్ళిరువురికీ పంచారు.
1966-1975
1965 లో యునైటెడ్ ప్రొడ్యూసర్స్, ఫిలిం ఫేర్ సంయుక్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా టాలెంట్ కాంటెస్ట్ లో పాల్గొన్న పది వేల అభ్యర్థుల్లో చివరిదాకా నిలబడ్డ ఎనిమిది మందిలో ఖన్నా ఒకరు. అందులో ఆయనే విజేత. ఇందుకు గానూ, 1966 లో ఆఖరీ ఖత్, రాజ్ (1966) లలో ఆయనకి అవకాశాలు వచ్చాయి. 1967లో నిర్వహించబడ్డ 40వ ఆస్కార్ అకాడమీ అవార్డులలో ఉత్తమ పరభాషా చిత్రంగా ఆఖరీ ఖత్ కి ప్రవేశార్హత లభించటం గమనార్హం. యునైటెడ్ ప్రొడ్యూసర్స్ ద్వారానే ఔరత్, డోలీ, ఇత్తెఫాక్ వంటి చిత్రాలలో అవకాశాలు దక్కించుకొన్నారు. బహారోన్ కే సప్నే, డోలీ, ఇత్తెఫాక్ లలో అతని నటనతో ప్రశంసలందుకొన్నారు. వహీదా రెహమాన్ అసిత్ సేన్ నిర్మిస్తున్న ఖామోషీలో కథానాయకుని పాత్రకి సిఫారసు చేసింది. ఆరాధన విజయంతో ఒక్కసారిగా దేశం మొత్తం నుండి అభిమానం చూరగొన్నాడు. విమర్శకులు ఖన్నాని భారతదేశపు తొలి సూపర్ స్టార్ గా అభివర్ణించారు. ఈ చిత్రంలో ఖన్నా తండ్రీ కొడుకులుగా షర్మీలా టాగూర్, ఫరీదా జలాల్ సరసన ద్విపాత్రాభినయం చేశారు. తెలుగులో ఇదే కన్నవారి కలలుగా రూపొందించబడింది. ఈ చిత్రంతో కిషోర్ కుమార్ గాయకునిగా నిలదొక్కుకొనడమే కాక, ఖన్నాకి అధికారిక నేపథ్యగాయకుడిగా స్థాపించబడ్డాడు. ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు అంటే నమ్మలేనంతగా ఖన్నాకి కిషోర్ గొంతు సరిపోయిందంటే అతిశయోక్తి కాదు. 1991 వరకూ ఈ ద్వయం అనేక విజయాలని నమోదు చేసింది. 1971 లో విడుదలైన హాథీ మేరే సాథీ కూడా భారీగా విజయవంతమై అప్పట్లో మంచి లాభాలను గడించింది. సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ లకి ఈ చిత్రం ద్వారా స్క్రీన్ ప్లే రచయితలుగా మొట్ట మొదటి అవకాశం ఇచ్చిన ఘనత కూడా ఖన్నాదే.
నటి ముంతాజ్ (హిందీ)తో ఎనిమిది చిత్రాలలో ఖన్నా నటించారు. ఇరుగు-పొరుగు కావటం మూలాన వారిరువురి మధ్య మంచి సామ్యం ఉండేది. ఈ జంట నటన పండటానికి ఈ సామ్యం కూడా ఒక కారణమే. ఖన్నా వివాహం తర్వాత తను కూడా మయూర్ మధ్వానీ అను కోటీశ్వరుడిని పెళ్ళి చేసుకోవాలనుకున్న ముంతాజ్, అప్పటికి ఖన్నాతో ఆప్ కీ కసమ్, రోటీ, ప్రేమ్ కహానీ లలో నటిస్తోంది. ఈ చిత్రాలు పూర్తి చేసిన తర్వాతే తను వివాహం చేసుకొన్నది. ముంతాజ్ చిత్రాల నుండి నిష్క్రమించిన తర్వాత ఖన్నాలో ఆమె లేని వెలితి కనబర్చారు. తన అభిమానుల గురించి ముంతాజ్ ఖన్నాని ఆట పట్టించేదనీ మద్రాసులో తను దిగిన హోటల్ వద్ద 600 అమ్మాయిలు ఖన్నాని చూడటానికి క్యూ కట్టేవారనీ, ఖన్నాతో బాటు తనకీ కొంత గుర్తింపు వచ్చేదనీ, తనని కూడా ఆటోగ్రాఫ్ అడిగేవారనీ, ఖన్నా తన అనుచరులతో చాలా కలివిడిగా ఉంటూ పార్టీలు ఎక్కువగా హాజరయ్యేవాడనీ ముంతాజ్ ఒకానొక ముఖాముఖిలో చెప్పినది.
ఖన్నా నటుడిగా వెలుగొందుతున్న సమయంలో బహిరంగ ప్రదేశాలలో కనబడినప్పుడు అతని అభిమానులు గుంపులు గుంపులుగా తరలి వచ్చేవారు. లిప్ స్టిక్ ముద్రలతో అతని కారుని నింపేస్తూ, రోడ్డుకిరువైపుల నిలబడి అతని పేరుని బిగ్గరగా ఉఛ్ఛరించేవారు. మహిళా అభిమానులు తమ రక్తంతో రాసిన లేఖలు అతనికి పంపేవారు. అతని బంగళా ఎదుట నిర్మాతలు, వెర్రిగా అభిమానించే ఫ్యాన్లు వరుస కట్టేవారు. బాంబే టు గోవా చిత్రంలో బస్సు డ్రైవర్ రాజేశ్, కండక్టరు పేరు ఖన్నా కాగా, ఇందులో మెహమూద్ ఖన్నాని అనుకరించాడు. ఈ నాటికి కూడా మిమిక్రీ కళాకారులు ఖన్నా శైలిని, సంభాషణలని అనుకరిస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నాడు. అమర్ ప్రేమ్ లోని చింగారీ కోయీ భడ్కే గీతం మొత్తం హౌరా బ్రిడ్జి నేపథ్యంగా ఖన్నా, షర్మీలా ఒక పడవలో చిత్రీకరించే యోచనని విరమించుకోవాలని అధికార వర్గాలు సూచించాయి. ఖన్నా అభిమానులకి ఈ విషయం తెలిస్తే అతనిని చూడటానికి వచ్చే జన సముద్రం బరువుకి ఆ వంతెన మోయలేక కూలిపోతుందని వారి భయం. సినీ విమర్శకుడు మనోజిత్ లాహిరి "ఖన్నా ఫోటోలతో పెళ్ళిళ్ళు చేసుకొని, వారి వ్రేళ్ళని కోసుకుని వచ్చిన రక్తంతో అమ్మాయిలు సింధూరంగా దిద్దుకొనేవారు. ఖన్నాని వారు దైవంగా కొలుచుకొనేవారు. ఒక కథానాయకుడికి అభిమానం ఇంతగా ఎప్పుడూ హద్దులు మీరలేదు." అని అంటారు.
ఖన్నా చిత్రాలలో నటించినంత కాలం సంగీతం అత్యంత ప్రముఖంగా ఉండేది. అతని చాలా చిత్రాలకు ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ - ప్యారేలాల్లు బాణీలు కట్టారు. ఖన్నా-కిషోర్-ఆర్ డి త్రయం కటీ పతంగ్, అమర్ ప్రేం, షెహ్జాదా, అప్నా దేశ్, మేరే జీవన్ సాథీ, ఆప్ కీ కసం, అజ్నబీ, నమక్ హరామ్, మహా చోర్, కర్మ్, ఫిర్ వహీ రాత్, ఆంచల్, కుద్రత్, అశాంతి, అగర్ తుం న హోతే, ఆవాజ్, హం దోనో, అలగ్ అలగ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని చేసింది.
గురు దత్, మీనా కుమారి, గీతా బాలి తన అభిమాన నటులుగా ఖన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దిలీప్ కుమార్లోని దీక్షాదక్షత, తీవ్రతలు, రాజ్ కపూర్ లోని చాతుర్యత, దేవానంద్ శైలి, షమ్మీ కపూర్ శృతి తన ప్రేరణలు అని తెలిపాడు.
1976-1978
1976 నుండి 1978 వరకూ ఖన్నా నటించిన చిత్రాలలో నాలుగు చిత్రాలు విజయవంతం కాగా తొమ్మిది నిరాశ పరచాయి. ప్రేమకథలు, సాంఘిక చిత్రాల నుండి యాక్షన్ భరిత చిత్రాలకు మొగ్గు పెరగటంతో ఖన్నాకి ఆదరణ ఒకింత తగ్గింది. ఎమర్జెంసీ విధించబడటంతో కథానాయకులు వ్యవస్థని ఎదిరించడం ప్రేక్షకులు కోరుకొనేవారు. ఈ సమయంలో ఖన్నాకి చెప్పుకోదగ్గ విజయాలంటే మహా చోర్, అనురోధ్, కర్మ్.
1979-1991
1978 తర్వాత ఖన్నా అమర్ దీప్, ఫిర్ వహీ రాత్, బందిష్, థోడీ సీ బేవఫాయి, దర్ద్, [ కుద్రత్, ధన్ వాన్, అశాంతి, అవతార్, అగర్ తుం న హోతే, సౌతేన్, జాంవర్, ఆశా జ్యోతి, ఆవాజ్, నయా కదమ్, హం దోనో, బాబు, ఆజ్ కా ఎం ఎల్ ఏ, రాం అవతార్, శత్రు, ఇంసాఫ్ మై కరూంగా, అనోఖా రిష్తా, నజరానా, అంగారే, అధికార్, అమృత్, అవం లతో మళ్ళీ విజయదుందుభి మోగించాడు. భారతీరాజా 1978లో తను దర్శకత్వం వహించిన ఎర్ర గులాబీలు హిందీలో ఖన్నా హీరోగా చేయించారు. అయితే దక్షిణాదిలో ఈ చిత్ర కథానాయకుడు కమల్ హాసన్కి ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ పురస్కారం పొందినా, సగటు హిందీ ప్రేక్షకుడు ఖన్నాని మానసిక రోగిగా చూడలేకపోయాడు.
80వ దశకంలో ఖన్నా-టీనా మునిం ల జంట పంట ఫిఫ్టీ ఫిఫ్టీ, సురాగ్, సౌతెన్, ఆఖిర్ క్యూ, బేవఫాయి, ఇంసాఫ్ మై కరూంగా, అధికార్ లతో పండినది. 1981 లో మరాఠీ చిత్రం "సుందర సాతర్కార్"లో నటించారు. తన తరం నటులతో పోలిస్తే అందరి కన్నా తక్కువ మల్టీ స్టారర్ చిత్రాలలో నటించారు. చేసిన కొన్ని మల్టీ స్టారర్ లలో కూడా ఖన్నా దే ముఖ్యమైన/పైచేయి గలవై ఉండేవి. రాజ్ పుత్, ధరం ఔర్ కానూన్, పాపీ పేట్ కా సవాల్ హై, జమానా, దిల్-ఏ-నాదాన్, ఘర్ కా చిరాగ్ అతని మల్టీ స్టారర్ చిత్రాలలో కొన్ని. తన స్నేహితుడు జితేంద్రతో కలసి నటించిన ధరం కాంటా, నిషాన్, మక్సద్ లు కూడా మంచి విజయాలు సాధించాయి. మక్సద్ 1984 నాటికి బాలీవుడ్ బాక్సాఫీసుకు 8.5 కోట్లను వసూలు చేసి రికార్డులలో రెండవ స్థానం దక్కించుకొన్నది.
ఆర్.డి.బర్మన్, కిషోర్ కుమార్ లపై ఖన్నాకి మంచి మమకారం పెంచుకొన్నాడు. మంచి స్నేహితులైన వీరు కలసి ముప్ఫై రెండు చిత్రాలకు కలసి పనిచేశారు.