ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ (Engineering) అనగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం. ఇంజనీరింగ్ అనే పదం ఆంగ్లంలో ఇంజన్ (Engine) నుంచి వచ్చింది. ఇంజనీరింగ్ కు సమానమైన తెలుగు పదం "అభియాంత్రికత". ఇంజన్ అంటే యంత్రం. ఇంజనీరింగ్ రంగంలో ప్రవేశం ఉన్న వ్యక్తిని ఇంజనీర్ (Engineer) (అభియాంత్రికుడు) అంటారు.
ఆధునిక సమాజం ఇంజనీరింగ్ ఫలాలైన అనేక వస్తువులను దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్నది. వంతెనలు, భవనాలు, వాహనాలు, కంప్యూటర్లు మొదలైనవన్నీ ఇంజనీరింగ్ అద్భుతాలే. ఈ రంగం చాలా విశాలమైనది.
చరిత్ర
ఇంజనీరింగ్ అనే భావన పురాతన కాలం నుంచీ అమల్లో ఉంది. మన ప్రాచీనులు తయారు చేసిన చక్రము, పుల్లీ, లివరు మొదలై, భవనాలు, గృహొపకరణాలు, రోడ్లు, రైళ్లు, అంతరిక్షనౌకల వరకు ఇంజనీరింగ్ వినియోగము విస్తరించింది.
ప్రాచీన యుగం
ప్రపంచ ప్రాచీన వింతలుగా పేర్కొన్న పిరమిడ్లు, వేలాడ ఉద్యానవనాలు, ఫారోస్ లైట్ హౌస్, డయానా దేవాలయం అప్పటి ఇంజనీరింగ్ విద్యకు తార్కాణాలు
పునరుజ్జీవన యుగం
ప్రపంచ నవీన వింతలులో తాజ్ మహల్, చైనా గొప్ప గోడ, మాక్జిమస్ సర్కస్, బాసిలికా చర్చి, పీసా వాలుతున్న గోపురం మొదలైనవి ఈ యుగపు ఇంజనీరింగ్ నిపుణతకు తార్కాణాలు.
ఆధునిక యుగం
1698 లో ఆవిరి యంత్రం ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవానికి పునాదులు పడ్డాయి.దీనితో మెకానికల్ ఇంజనీరింగ్ అభివృద్ధి చెందింది, ఆ తరువాత అవసరమైన రసాయనాలకోసం, కెమికల్ ఇంజనీరింగ్, ఖనిజాలకోసం మెటలర్జికల్ ఇంజినీరింగ్ ప్రత్యేకతలు ఏర్పడ్డాయి. అలాగే 1800 నాటి ఎలెక్ట్రిసిటీ పరిశోధనలతో ఎలెక్ట్రకల్ ఇంజనీరింగ్, జేమ్స్ మాక్స్వెల్, హెయినరిచ్ హెర్ట్జ్ పరిశోధనలతో ఎలెక్ట్రానిక్స్, సర్ జార్జికేలీ పరిశోధనలతో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రత్యేకంగా రూపొందాయి. ఇటీవలి ఎలెక్ట్రానిక్స్ పరిశోధనలు కంప్యూటర్ ఇంజనీరింగ్, సమాచార, సంచార ( communication) సాంకేతిక రంగాలు ఏర్పడ్డాయి.
విద్య
విద్య ఐటిఐ, పాలిటెక్నిక్, ఉన్నత విద్య స్థాయిలలో అందుబాటులో ఉంది. 21 శతాబ్దంలో ఇంజనీరింగ్ లో ఉన్నత విద్య (డిగ్రీ) సామాన్య వృత్తి విద్యగా మారింది. అత్యధిక విద్యార్థులు చదువుతున్నారు.
ఉన్నత విద్య
ఉన్నత విద్య నాలుగు సంవత్సరాల విద్య. ప్రవేశాలు పోటీ పరీక్షల (ఎమ్సెట్) ద్వారా నిర్వహిస్తారు.మొదటి సంవత్సరంలో ఇంజనీరింగ్ గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంగ్లీషు, ఇంజనీరింగ్ డ్రాయింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, వర్క్ షాప్ లాంటి విషయాలుంటాయి. రెండవ సంవత్సరంలో ప్రధాన అంశంలో మూల కోర్సులతో పాటు అంతర శాఖా విషయాలు వుంటాయి. ఉదా: మెకానికల్ విద్యార్థికి మూల ఎలెక్ట్రికల్ అంశాలు, సివిల్ వారికి మూల మెకానికల్ అంశాలు . మూడో సంవత్సరంలో విషయంలో కీలకమైన అంశాలుంటాయి. నాలుగో సంవత్సరంలో ఐచ్ఛికాంశాలతో పాటు, ఒక సమస్యపై పథకం (Project) పని ఇద్దరు లేక ముగ్గురు సహచరులతో కలిసి చేయాలి. మధ్యలోని వేసవి సెలవులలో సమీప పరిశ్రమలలో శిక్షణ తీసుకొనే అవకాశాలుంటాయి.
ఉపాధి
చదువు చివరి సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రముఖ విద్యాలయాల్లో సంస్థలు ప్రాంగణానికే వచ్చి విద్యార్థులకి ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సంస్థలకు ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఎంతో ఉంది. ఇంజనీరింగ్ సర్వీస్ కమిషన్, సమాచార సాంకేతికలో సంస్థలు ఉద్యోగావకాశాల రోజులను నిర్వహిస్తారు. విద్యార్థలకు తోడ్పడే వెబ్ గవాక్షాలున్నాయి.[1]
విభాగాలు
- సివిల్ ఇంజనీరింగ్- భవనాలు, వంతెనలు, డ్యాములు మొదలైన కట్టడాల నిర్మాణాల గురించిన శాస్త్రం.
- మెకానికల్ ఇంజనీరింగ్ - భౌతిక, యాంత్రిక వస్తువుల రూపకల్పన.
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాల రూపకల్పన.
- ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్—సంచార సాంకేతికాలైన రేడియో, టెలివిజన్, ఉపగ్రాహక ఆధారిత సంచారము, అంతర్జాలము మొదలుగు ప్రక్రియలగురించి అధ్యయనం.
- కెమికల్ ఇంజనీరింగ్ - ముడి పదార్థాలను వాడుకునేందుకు వీలుగా తయారు చేసే ప్రక్రియల గురించి అధ్యయనం
- ఏరోనాటికల్ ఇంజనీరింగ్ - విమానాలు,, అంతరిక్ష వాహనాల రూపకల్పన దీని క్రిందకు వస్తాయి.
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - మోటారు వాహనాల రూపకల్పన.
- కంప్యూటర్ సైన్స్ - కంప్యూటర్ల రూపకల్పన.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు మూల కోర్సులు. తరువాత ఇతర కోర్సులు రూపొందాయి. ఇంకా మరెన్నో రకాల విషయాలతో కొత్త పాఠ్యాంశాలలో ఇంజనీరింగ్ విభాగాలు రూపొందుతున్నాయి. ఉదా: ఇన్ఫర్మేషన్ సైన్స్, బయోటెక్నాలజీ.
వృత్తి సంఘాలు
దేశీయ, అంతర్జాతీయ వృత్తి సంఘాలు [2][3][4] సభలు, పత్రికల ద్వారా ఇంజనీర్లలో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుటకు కృషిచేస్తాయి.
బయటి లింకులు
- ↑ "సాక్షి ఇంజనీరింగ్ పోర్టల్". Archived from the original on 2010-10-15. Retrieved 2010-10-13.
- ↑ "ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్". Archived from the original on 2011-11-25. Retrieved 2010-10-08.
- ↑ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా
- ↑ ఐఇఇఇ
- National Society of Professional Engineers article on Licensure and Qualifications for the Practice of Engineering
- All Engineering Branch PDF Books
- American Society for Engineering Education (ASEE)
- The US Library of Congress Engineering in History bibliography
- ICES: Institute for Complex Engineered Systems, Carnegie Mellon University, Pittsburgh, PA Archived 2014-11-22 at the Wayback Machine
- History of engineering bibliography at University of Minnesota