ఐక్యరాజ్య సమితి
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా , ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటిగా అమెరికా అధ్యక్షుడు ప్రాంక్లిన్ డి. రూజ్వెల్డ్ సూచించారు. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను జాన్ క్రిస్టియన్ రూపొందించారు ఈయన దక్షిణా ఆఫ్రికా కు చెందిన వారు
సమితి ఆవిర్భావం
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్‌వెల్ట్ , బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అట్లాంటిక్ ఛార్టర్ అంటారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.[1]
తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబరు 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.
సమితి ఆశయాలు
- యుద్ధాలు జరగకుండా చూడటం,
- అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం,
- దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం,
- అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం,
- సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.
సమితి ప్రధాన అంగాలు
ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు ఉన్నాయి.
సర్వ ప్రతినిధి సభ
ఈ సభలో సభ్యదేశాలన్నింటికీ ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక్క ఓటు ఉంటుంది. సమావేశాలకు ప్రతి సభ్యదేశం గరిష్ఠంగా 5 గురు సభ్యులను పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒక పర్యాయం, సాధారణంగా సెప్టెంబరు మాసంలో, సమావేశమౌతుంది. సమావేశానికి అధ్యక్షుడిగా సభ్యదేశాలు ఎన్నిక చేస్తాయి. కొత్త సభ్యదేశాలకు ప్రవేశం కల్పించడానికి, భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నిక చేయుటలో ఈ సభకే అధికారముంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్యదేశాలను తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంది. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. ఈ సభ మూడింట రెండు వంతులు (2/3) మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది.
భద్రతా మండలి
సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్యదేశాలు. అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సులు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం కూడా ఉంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేసారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను 10 కి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ ఐరోపా నుండి ఇద్దరు, తూర్పు ఐరోపానుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి మాసము మారుతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.
సచివాలయం
ఇది ఐ.రా.స. వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులో పది వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. సచివాలయానికి ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. ఐ.రా.స.కీ, దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవుసరమైన సమాచారము, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలో నిర్వహింపబడుతాయి. ఉద్యోగుల ప్రతిభ, నిజాయితీ, పనితనం , వివిధ ప్రాంతాలకు ఉచితమైన ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ ఉద్యోగుల ఎంపికలో ముఖ్యమైన విషయాలని ఐ.రా.స. ఛార్టర్‌లో వ్రాయబడింది. ఐ.రా.స శాంతి సైనిక దళాలను Blue helmets అంటారు.
ధర్మ కర్తృత్వ మండలి
కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయంపాలనకు లేదా స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశమవుతుంది. ఇందులో మూడు రకాల సభ్యత్వాలు ఉన్నాయి
- ధర్మ కర్తలుగా కొన్ని దేశాలను పాలిస్తున్న దేశాలు
- భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు.
- మూడేళ్ళ కాల పరిమితికి ఎన్నికైనవి.
ఆర్థిక, సాంఘిక మండలి
ఇది సాధారణ సభ అధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులుంటారు. ఈ మండలి ఏటా రెండుసార్లు సమావేశమవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగు పరచడం, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవ హక్కులను సమర్ధించడం వంటివి ఈ మండలి ఆశయాలు.
అంతర్జాతీయ న్యాయస్థానం
అంతర్జాతీయ న్యాయస్థానం (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం"గా పిలువబడుతుంది); ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాథమిక తీర్పులను ప్రకటించే అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధంలో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం , తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం , అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి ఉంది.1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ వారసురాలు.[2]
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు
ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పనిచేస్తుంటాయి. ఐక్య రాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది.
- ఐక్య రాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ – యునెస్కో (UNESCO) - ఈ సంస్థను 1946 నవంబరు 4 స స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్లో ఉంది. విద్య, విజ్ఞానం, సంస్కృతి రంగాలలో అంతర్జాతీయ సహకారానికి, ప్రగతికి, శాంతియుత సంబంధాలకు ఈ సంస్థ కృషి చేస్తుంది. దీని ప్రధాన అంగాలు మూడు, ఇవి తన పాలసీల తయారీ కొరకు, అధికార చెలామణి కొరకు, , దైనందిన కార్యక్రమాలకొరకు పాటుపడుతాయి. (1) సాధారణ సభ (జనరల్ కాన్ఫరెన్సు) (2) కార్యనిర్వాహక బోర్డు (ఎక్సిక్యూటివ్ బోర్డు) (3) మంత్రాలయం (సెక్రటేరియట్) - కార్యనిర్వాహక బోర్డు, సాధారణ సభచే నాలుగేండ్లకొరకు ఎన్నుకోబడుతుంది. మంత్రాలయం, దైనందిన కార్యక్రమాలను, , దీని పరిపాలనా బాధ్యతలను చేపడుతుంది. దీని డైరెక్టర్ జనరల్ నాలుగేండ్ల కాల పరిమితికి ఎన్నుకోబడతాడు. దీనిలో 2100 మంది సిబ్బంది ఉంటారు. మూడింట రెండువంతు సిబ్బంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో గల యునెస్కో కార్యాలయాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కావలసిన శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధిని యునెస్కో ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం న్యూఢిల్లీ, కైరో, జకార్తా, మాంటెవిడియో, వెనిస్ లలో కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం యునెస్కోలో 192 దేశాలకు సభ్యత్వం ఉంది.
- ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి లేదా ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి- యునిసెఫ్ (UNICEF లేదా UNCF) – 1946 డిసెంబరు 11న ఈ సంస్థ ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరంలో ఉంది. ప్రస్తుతం దీని పేరులో "అంతర్జాతీయ ", "అత్యవసర " అనే పేర్లను తొలగించి ఐక్య రాజ్య సమితి బాలల నిధి అని వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నది.
- ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం – (UNDP) - ఈ సంస్థ 1965 నవంబరు 22న స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరంలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి సంపదను వృద్ధి చేసుకొనేందుకు అవుసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది. 1990 నుండి యు.ఎన్.డి.పి. యేటా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తున్నది.
- ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం – (UNEP) స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్లో 1972 జూన్ 5 న నిర్వహించిన పర్యావరణ సదస్సు ఫలితంగా యు.ఎన్.ఇ.పి. రూపుదిద్దుకొంది.
- ఆహార , వ్యవసాయ సంస్థ – (FAO) - ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో ఉంది. 1945 అక్టోబరు 16న కెనడా దేశపు నగరం క్విబెక్లో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే యేటా అక్టోబరు 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిమి, పంపిణీని మెరుగు పరచడం ఈ సంస్థలక్ష్యాలు.
- అంతర్జాతీయ కార్మిక సంస్థ – (ILO) - ఈ సంస్థ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో ఉంది. 1919 ఏప్రిల్ 11న నానా జాతి సమితి అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటయ్యింది. అనంతరం ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపు దిద్దుకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాలు స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేశ్తున్నది. 1969లో ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ – (WHO) – 1948 ఏప్రిల 7న ఈ సంస్థ ప్రారంభమైంది. దీని కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో ఉంది. ఇంకా అలెగ్జాండ్రియా, బ్రజవిల్లే, కోపెన్ హాగెన్, మనీలా, న్యూఢిల్లీన వాషింగ్టన్ నగరాలలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, అంటు వ్యాధుల నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మలేరియా, క్షయ, మశూచి వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేసింది. ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి ప్రస్తుతం చాలా కృషి చేస్తున్నది.
- ఐక్య రాజ్య సమితి ఫారిశ్రామిక అభివృద్ధి సంస్థ – (UNIDO) - ఈ సంస్థ ఐక్య రాజ్య సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబరు 17న ఏర్పాటయ్యింది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా దేశపు వియన్నాలో ఉంది. అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలిసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది.
- ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్ – (UNHCR)) – 1951 జనవరి 1నుండి ఈ సంస్థ పని చేయసాగింది. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. శరణార్ధుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ సంస్థకు 1954, 1981 సంవత్సరాలలో వోబెల్ శాంతి బహుమతి లభించింది.
- విశ్వ తపాలా సంఘం – యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) - ప్రధాన కార్యాలయం బెర్న్ (స్విట్జర్లాండు)లో ఉంది. 1874 అక్టోబరు 9న బెర్న్‌లో జరిగిన పోస్టల్ కాంగ్రెస్ సమావేశంలో "యూనివర్సల్ పోస్టల్ కన్వెన్షన్"ను ఆమోదించారు. అలా ఏర్పడిన యు.పి.యు., 1875 జూలై1 నుండి అమలులోకి వచ్చింది. 1947 నవంబరు 15న సమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. ప్రతి యేటా అక్టోబర్ 9 తేదీని ప్రపంచ తపాలా దినోత్సవంగా నిర్వహిస్తారు. వివిధ రకాల తపాలా సేవల నిర్వహణ ద్వారా ప్రపంచ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణ నిర్వహణకు ఈ సంస్థ కృషి చేస్తుంది.
- ప్రపంచ వాతావరణ సంస్థ - వరల్డ్ మీటియొరలాజికల్ ఆర్గనైజేషన్ (WMO) – 1873లో ఏర్పడిన అంతర్జాతీయ వాతావరణ సంస్థ నిర్వహించిన సదస్సులో కుదిరిన ఒప్పందం ప్రకారం 1947 వాషింగ్టన్ సమావేశంలో ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పడింది. 1950 మార్చి 23 నుండి ఈ సంస్థ పని చేయడం ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. 1951లో సమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. వాతావరణంలో సంభవించే మార్పుల గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం, సమాచారాన్ని అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేయడం, త్వరితంగా వాతావరణ సమాచారాన్ని అందించడం ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలు.
- అంతర్జాతీయ అణుశక్తి సంస్థ – (IAEA) – 1953లో అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ చేసిన "శాంతి కోసం అణుశక్తి" ప్రసంగం ఈ సంస్థ ఆవిర్భావానికి నాంది. 1957 జూలై 29న ఈ సంస్థ ప్రారంభమైంది. అణుశక్తిని కేవలం శాంతియుత కార్యక్రమాలకు ఉపయోగపడేలా చేయడం ఈ సంస్థ లక్ష్యం. దీని రాజధాని వియన్నాలో ఉంది. 2005లో ఈ సంస్థకు, దాని అధ్యక్షుడు మహమ్మద్ అల్-బరాదీకి సంయక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
- ఐక్య రాజ్య సమితి వాణిజ్య అభినృద్ధి సదస్సు- (UNCTAD) – 1964లో డిసెంబరు 30న దీన్ని నెలకొలిపారు. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది.
- అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) – 1865లో ప్యారిస్‌లో ఏర్పటిన ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్, 1906లో బెర్లిన్‌లో ఏర్పడిన ఇంటర్నేషనల్ రేడియో-టెలిగ్రాఫ్ యూనియన్లు మాడ్రిడ్ ఒప్పందం ప్రకారం విలీనమై 1932లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్‌గా అవతరించాయి. 1947నుండి ఈ సంస్థ ఐ.రా.స. అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. కేంద్ర కార్యాలయం జెనీవాలో ఉంది.
- అంతర్జాతీయ పునర్వ్యవస్థీకరణ, అభివృద్ధి బ్యాంకు లేదా ప్రపంచ బ్యాంకు (IBRD or World Bank) – 1944 జూన్ 22న అమెరికాలోని "బ్రెట్టన్‌వుడ్"లో జరిగిన సమావేశంలో ఏర్పాటయిన ఈ సంస్థ "ప్రపంచ బ్యాంకు" అనే పేరుతో పిలువబడుతున్నది. ఐ.ఎమ్.ఎఫ్. కూడా ఈ సమావేశంతోనే ఏర్పడింది. 1946 జూన్ 25నుండి ప్రపంచ బ్యాంకు కార్యకలాపాలు ఆరంభించింది. కేంద్ర కార్యాలయం వాషింగ్టన్ డి.సి.లో ఉంది. ఈ సంస్థ నిధులు , సాంకేతిక సహాయం అందించడం ద్వారాను, పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారాను సభ్య దేశాల ఉన్నతికి సహకరిస్తుంది. అదే విధంగా అంతర్జాతీయ వాణిజ్యం పెంపొందించేందుకు, చెల్లింపుల సమతుల్యతను కాపాడేందుకు కృషి చేస్తుంది. ప్రపంచ బ్యాంకుకు మూడు అనుబంధ సంస్థలున్నాయి.
- ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐ.డి.ఎ.)
- ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐ.ఎఫ్.సి.)
- మల్టిలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ (ఎమ్.ఐ.జి.ఎ.)
- అంతర్జాతీయ ద్రవ్య నిధి – ఐ.ఎమ్.ఎఫ్. (IMF) – 1947 మార్చి 1 నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. దీని కేంద్ర కార్యాలయం కూడా వాషింగ్టన్ డి.సి.లో ఉంది. అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని అందించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం దీని ముఖ్య లక్ష్యాలు.
- మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ‘యూఎన్ ఉమెన్’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రకటించారు. ఈ సంస్థకు చిలీ మాజీ అధ్యక్షురాలు మిషెల్ బాచ్లెట్ నేతృత్వం వహిస్తారన్నారు.[3]
ఇవికూడా చూడండి
మూలాలు
- ↑ Atlantic Charter
- ↑ "Statute of the International Court of Justice". Archived from the original on 2011-06-29. Retrieved 2009-02-09.
- ↑ "Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today".
వనరులు
- 2008 డిసెంబరు 5 – ఈనాడు పత్రిక "ప్రతిభ ప్లస్" శీర్షికలో - ఎం. వెంకటేశ్వర్లు వ్యాసం
- 2009 ఫిబ్రవరి 2 – "ఈనాడు" పత్రిక ప్రతిభ శీర్షికలో - సీ.హెచ్. కృష్ణప్రసాద్ వ్యాసం
- నందగోపాల్ సర్ నోట్స్
మూస:నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు 2001–2025
బయటి లింకులు
- అధికారిక వెబ్‌సైటులు
- ఐ.రా.స. అధికారిక హోమ్ పేజి
- ఐ.రా.స. సంస్థల మధ్య సంబంధాలు
- ఐ.రా.స. గురించి
- ఐ.రా.స. అజెండాలో భౌగోళిక సమస్యలు
- ఐ.రా.స. మీటింగుల జర్నల్.
- ఐ.రా.స. ప్రాదేశిక సమాచార కేంద్రం (UNRIC)
- ఐ.రా.స. పత్రిక
- ఐ.రా.స. ఆర్గనైజేషన్ చార్టు
- ఐ.రా.స. కార్యక్రమాలు
- ఐ.రా.స. చార్టర్ -
- ఐ.రా.స. డైరెక్టరీ
- ఐ.రా.స. భద్రతా మండలి రిజల్యూషన్లు
- ఐ.రా.స. స్వచ్ఛంద కార్యకర్తలు
- విశ్వ మానవ హక్కుల ప్రకటన
- ఐ.రా.స. వెబ్ సైటులు, కేంద్రాల మ్యాప్
- ఇతరాలు
- యుద్ధ నేరాల గురించి, జాతుల నిర్మూలనా ఘటనల గురించి వివరాలు
- Eye on the U.N. – A Project of the Hudson Institute New York and the Touro Law Center Institute for Human Rights
- Outcomes of the 2005 World Summit PDF (82.9 KB)
- Permanent Missions To The United Nations
- Task Force on United Nations – U.S. Institute of Peace
- U.N. watch - ఐ.రా.స. కార్యక్రమాలను పరిశిలించే సంస్థ.
- United Nations eLearning Unit created by ISRG – University of Innsbruck