ఆంధ్రప్రదేశ్ చరిత్ర


గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
• మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
• మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
• చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
• బ్రిటిషు రాజ్యము
• స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
• ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము • 21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

ఆంధ్రప్రదేశ్ లిఖితమైన చరిత్ర వేద కాలంనాటినుండి ప్రారంభమవుతుంది. సా.శ..పూ. 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ లో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది. ఆంధ్రులు ఉత్తర భారతదేశంలో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలియవస్తుంది.[1][2][3][4] ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారని, అస్సాక మహాజనపదం (సా.శ..పూ.700-300) ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ, మహాభారత ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది.[5]

అంధ్రప్రదేశ్ చరిత్రను తొలుత చరిత్ర పూర్వయుగము, చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది సామాన్య శక పూర్వం మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. సామాన్య శక పూర్వం మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము, ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం), ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం) గా విభజిస్తారు.

చరిత్ర పూర్వయుగం

క్రీ.పూ. 10,000 - క్రీ.పూ. 8,000 - పాతరాతియుగం - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం అనిపిస్తున్నది. క్రీ.పూ. 8,000 - క్రీ.పూ. 6,000 - సూక్ష్మ రాతి యుగము కాలంలో చిన్న పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి.

క్రీ.పూ. 6,000 - క్రీ.పూ. 2,000 - కొత్తరాతియుగం - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. ఈ యుగంలో పెక్కు నూతన పరికరాలు వాడారు. పసువులను పెంచేవారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు. క్రీ.పూ. 2,000 - క్రీ.పూ. 1,000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి.

క్రీ.పూ. 1,000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగం - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అంతటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభివృద్ధి చెందింది.

ఆంధ్ర, తెలుగు జాతి

ఒక జాతి అనేది ఒక్కమారుగా ఉద్భవించిన సమూహం కాదు. చరిత్రలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ, ఆర్థిక, స్థానచలన, సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకొన్నాయి. ఆంధ్రుల జాతీయత గురించి లభించిన వివిధ (చాలా వరకు అస్పష్టమైన) ఆధారాల ద్వారా చరిత్రకారులు ఆంధ్రజాతి ఇలా ఏర్పడిందని భావిస్తున్నారు -

నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగులు, యక్షులు, శబరులవంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా, ప్రధానంగా భాషాపరంగా, కలసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకొంది. వీరిలో నాగులు పంజాబు ప్రాంతంలో (క్రీ.పూ. 600 నాటికి) ఉండి ఆర్యులను ప్రతిఘటించారు. ఆంధ్రులు మహాభారత యుద్ధకాలంలో యమునా నదితీరాన ఉండేవారు. యుద్ధానంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలనా, మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలనా క్రమంగా దక్షిణాపధానికి వలస వచ్చారు. యక్షులు భట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు, తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిరనివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు.[6]

క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభ కాలంనుండి ఈ దక్షిణాపధంలో అనన్యమయన ఆదరణ లభించింది. బౌద్ధమతం బోధించిన వర్ణరహిత జీవనం ఈ జాతుల మధ్య సహజీవనానికీ, సమాగమనానికీ మరింత ఊపునిచ్చింది. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చినవారుకారు. బ్రతుకు తెరువుకోసం వచ్చినవారు. అయితే అప్పటికే స్థిరనివాసం ఏర్పరచుకొన్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెందిఉండాలి. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు సాధించినా భాష మాత్రం తెలుగే నిలిచింది.[7] ఈ నేపథ్యంలోనే ఆంధ్రజాతి రూపు దిద్దుకొంది.

పూర్వ యుగం

Holy relic sites map of Andhra Pradesh

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉంది.[8]

క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం. మొదటినుండి ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం), ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉంది. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి.

మౌర్యకాలము క్రీ.పూ.322 - 184

చంద్ర గుప్తుడు క్రీ.పూ. 322లో మౌర్య వంశం స్థాపించాడుచంద్రగుప్తుడు నంద రాజుల కుమారుడు.క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి" క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 అశోకుని పాలన కాలం. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. క్రీ.పూ.400 - 200 సమయంలో బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది. ఈ సమయంలో ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది దేశం సుభిక్షమయ్యింది. ఉత్తర దేశంనుండి సింహళానికి వెళ్లేమార్గంలో ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉండేది.

శాతవాహనులు - క్రీ.పూ.200 - సా.శ..200

మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి పాలన క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి సా.శ..2వ శతాబ్ది వరకు సుమారు 400 సంవత్సరాలు సాగింది. సుమారు క్రీ.పూ. 271-248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటి ఆంధ్రరాజ్యాలనన్నింటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట కావచ్చును. తరువాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం (ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్) కు రాజధాని మార్చబడింది. వీరిలో ఆరవ రాజైన రెండవ శాతకర్ణి (క్రీ.పూ.184) గొప్ప రాజు. నందులు, మౌర్యులు, శుంగులు, కణ్వులు తరువాత విశాల భారత సామ్రాజ్యాన్ని శాతవాహనులు సాధించగలిగారు. సా.శ..62లో అధికారానికి వచ్చిన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనుల ప్రాభవం తిరిగి పుంజుకుంది. నాసిక్ శాసనం ప్రకారం ఇతని రాజ్యంలో అసిక, అస్సక, ములక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకర, అవంతి దేశాలూ, వింధ్య, అచవత, పారియాత్ర, సహ్య, కన్హగిరి, సిరితన, మలయ, మహేంద్ర, శత, చకోర పర్వతాలూ ఉన్నాయి (దక్షిణ ప్రాంతమే కాక గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిషా ప్రాంతాలు). అతని రాజ్యం తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు విస్తరించింది. సా.శ.. 2వ శతాబ్దానికి శాతవాహనుల సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యింది.

శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. రాజులు వైదిక మతాన్ని అవలంబించినా గాని బౌద్ధం కూడా వర్ధిల్లింది. రెండు మతాలనూ రాజులు ఆదరించారు. అనేక గొప్ప చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మింపబడ్డాయి. సాహిత్యం, శిల్పం కూడా ప్రభవించాయి. ఈ కాలంలో బౌద్ధమతంలో జరిగిన మరొక విశేష తత్వశాస్త్ర వికాసం ఆచార్య నాగార్జునుడు బోధించిన మహాయానం.

కళింగులు క్రీ.పూ. 200 - సా.శ..420

మహానది, గోదావరి నదుల ముఖ ద్వారాల మధ్య భాగాన్ని కళింగ దేశమని చెప్పవచ్చును. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాలను పాలించిన రాజులు.

తొలి శాతవాహనులకు సమకాలికులుగా కళింగ దేశాన్ని ఛేది (సద) రాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు. అశొకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత సా.శ.. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. ఖారవేలుడు జైన మతస్థుడు. వృషభ లాంఛనుడు. సమర్ధుడైన పాలకుడు. రాజ్యవిస్తరణ చేశాడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం. ఖారవేలునికి శాతవాహనులలో సమకాలీనుడు శాతకర్ణి. వారి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో "పిథుండ" నగరాన్ని ఖారవేలుడు నాశవం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది.

ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. తరువాతి కాలంలో కొంతకాలం పిష్ఠపురంలో మాఠరులు అధికారంలో ఉన్నారు (సా.శ..400-450). దేవపురిలో వాసిష్ఠులు పాలించారు (క్రీ. శ. 300-450).

ఇక్ష్వాకులు క్రీ. శ. 225 - 300

శాతవాహనుల పతనం తరువాత తీరాంధ్రప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ఇక్ష్వాకులు సా.శ..225 ప్రాంతంలో విజృంభించారు. మొదటివాడైన శ్రీ శంతమూలుడు (క్రీ. శ. 225-245) గొప్ప వీరుడు. ఇతడు రాజనీతిపరుడు. ఇతని కాలంలో వైదికమతం పునరుద్ధరణ పుంజుకొంది. తరువాత వీరపురుషదత్త (క్రీ. శ. 245-265) కాలం ఆంధ్రబౌద్ధ చరిత్రలో సువర్ణఘట్టం. అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పెద్దయెత్తున బౌద్ధారామాలకు దానాలు చేశారు. ఆ కాలంలో శ్రీపర్వతం (నాగార్జునకొండ) గొప్ప బౌద్ధక్షేత్రంగా విలసిల్లి దూరదేశాలనుండి యాత్రికులను ఆకర్షించింది. సింహళం, చైనా, కాశ్మీరం, గాంధారం, తొసలి, వనవాస, అపరాంతం, వంగ, యవన, తమిళ దేశాలనుండి వచ్చే యాత్రికులకోసం వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. మాహదేవుడనే బౌద్ధభిక్షువు పల్లవబొగ్గ (పలనాడు) లో చాలాకాలం ప్రచారం చేసి, 14లక్షల 60వేల మంది భిక్షువులతో కలిసి సింహళదేశం వెళ్ళాడని మహావంశం అనే బౌద్ధగ్రంధంలో ఉంది. ఇక్ష్వాకుల శాసనాలు శాతవాహనుల శాసనాలవలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నాగాని వాటిలో తెలుగు పదాల వినియోగం హెచ్చింది. సంస్కృతం కూడా చోటు చేసుకోసాగింది.

బృహత్పలాయనులు - సా.శ.. 275 ప్రాంతం

ఇక్ష్వాకుల రాజ్యము అంతరించిన తరువాత క్రీ. శ. నాలుగవ శతాబ్ది ప్రథమ పాదములో కృష్ణానది ఉత్తర తటప్రాంతమును బృహత్పలాయనులు పాలించారు. కొండముదిలో దొరికిన ప్రాకృత శాసనము ప్రకారము జయవర్మ కూదూరు (కృష్ణా జిల్లా, మచిలీపట్నం తాలూకా లోని గూడూరు) రాజధానిగా పాలించాడు. ఇతని మహాసైన్యాధిపతి భాపహానవర్మ "మహాతలవర", "మహాదండనాయక" అని చెప్పబడ్డాడు. నాగార్జునకొండ వద్ద దొరికిన ఒక ఇక్ష్వాకుల శాసనములో "బహఫల సగోత్తాయ సిరివమ్మ భటాయా" అని ఉంది. ఈమె కుటుంబమువాడే జయవర్మ అయిఉండవచ్చును. జయవర్మ తరువాత బృహత్పలాయన సగోత్రులు ఎవరైనా రాజ్యము చేశారేమో తెలియదు. వీరి రాజ్యము శాలంకాయనుల విజృంభణ వల్ల అంతరించి ఉండవచ్చును.

అనందగోత్రికులు సా.శ.. 295 - 620

చేజెర్లలో దొరికిన ఐదవ శతాబ్ది చివరికాలపు సంస్కృత శాసనము ప్రకారము అనంద మహర్షి గోత్రీకుడగు కందరరాజు ధాన్యకటక యుద్ధములో శత్రువులను జయించి త్రికూటపతి అయ్యాడు. ఈతని రాజ్యము కృష్ణానది దక్షిణ తీరము నుండి త్రికూట పర్వతము (కోటప్పకొండ) వరకు వ్యాపించి ఉంది. రాజధాని కందరపురము. ఇది గుంటూరు జిల్లా నర్సారావుపేట వద్దనున్న చేజెర్ల, చేబ్రోలు, కంతేరు లలో ఒకటి కావచ్చును. తరువాతి రాజులు దామోదరవర్మ, హస్తివర్మలు. వీరు వైదికమతాభిమానులైనను బౌద్ధమును ఆదరించారు. బౌద్ధమత క్షీణదశ అప్పటికి ప్రారంభము కాలేదు. వీరికి పల్లవులతో యుద్ధాలు జరిగాయి. చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేశి యొక్క సేనాపతి పృథ్వీయువరాజు దండెత్తినపుడు కందారరాజు చేత ఓడిపోయాడు. కాని తరువాతి దండయాత్రలో పులకేశి తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడు స్థానిక రాజులందరిని ఓడించి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. తరువాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండలం ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు. క్రీ. శ. అయిదవ శతాబ్ది చివరకు శాలంకాయనుల ధాటికి వీరి రాజ్యము అంతరించింది.

శాలంకాయనులు క్రీ. శ.300 - 420

"శాలంకాయన" అనేది గోత్రనామము. వీరు వేంగి రాజధానిగా గోదావరి, కృష్ణా జిల్లాలను పాలించారు. వీరు ఆనంద గోత్రికులకు ఇంచుమించు సమకాలికులు. వీరికాలంలో వేంగి నగరం గొప్ప విజ్ఞానకేంద్రంగా ఉండేది. వీరు వేంగిలో చిత్రరధస్వామిని ఆరాధించారు. గుంటుపల్లెలోని ఆరామాలకు భూరి విరాళాలిచ్చారు. హస్తివర్మ సా.శ..320లో విజృంభించి వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాకులను ఓడించి రాజ్యపాలన ప్రారంభించి ఉండవచ్చును. సముద్ర గుప్తుని దక్షిణదేశ దండయాత్రలగురించి అలహాబాదు ప్రశస్తిలో చెప్పబడిన వైగేయిక హస్తివర్మ ఇతడే. అంతర్యుద్ధాలవల్ల, ఉత్తరాన పిష్ఠపురంలో మాఠరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండినులు బలవంతులై తరచు యుద్ధాలు చేయడం వలన శాలంకాయనుల రాజ్యం పతనమయ్యింది. ఈ కాలంలో బౌద్ధం భారత దేశంలో క్షీణిస్తూ ఇతర దేశాలలో విస్తరించడం ప్రాంభమైంది.

విష్ణుకుండినులు క్రీ. శ. 375-613

శాలంకాయనులతరువాత వేంగీదేశమును విష్ణుకుండినులు క్రీ. శ. 375 నుండి క్రీ. శ. 613వరకు పాలించారు. విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పడమట గుంటూరు వరకును, నైరుతిన గోలకొండ వరకు విస్తరించిఉన్నది. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. భారతదేశములో ఇలాంటి నాణెములు తొలుతగా ప్రవేశబెట్టినవారు విష్ణుకుండినులు. విష్ణుకుండినుల రాజధాని "ఇంద్రపురం" ప్రస్తుత నల్గొండ జిల్లా (రామన్నపేట తాలూకా) ఇంద్రపాలగుట్ట కావచ్చునని ఒక అభిప్రాయం.

క్రీ. శ. 514 నాటికి గోదావరికి ఉత్తరాన కళింగ రాజ్యం వేరయ్యింది. కృష్ణానది దక్షిణ భాగం పల్లవుల వశమయ్యింది. కృష్ణా గోదావరి మధ్యభాగం విష్ణుకుండినుల పాలనలో ఉంది. పశ్చిమాన ప్రస్తుత తెలంగాణా ప్రాంతం వాకాటకుల పాలనలో ఉంది. ఈ పరిస్థితి 7వ శతాబ్దం వరకు కొనసాగింది.

పల్లవులు

సాతవాహనాంతరికులలో తక్కిన రాజవంశములలో వైశాల్యమున అధికతరమగు రాజ్యమును దీర్ఘ కాలము పాలించిన వారు పల్లవులు. ఉచ్చదశలో కృష్ణానది ఉత్తరపు ఎల్లగా, కావేరీనది దక్షిణపు సరిహద్దుగా వర్తించాయి. ఆంధ్ర-తమిళ ప్రాంతమునే గాక కర్ణాట ప్రాంతముపై కూడా కొంతకాలము ఆధిపత్యము నిర్వహించారు.

పూర్వమధ్య యుగము

మహాపల్లవులు

6వ శతాబ్దం చివరి భాగంలో పల్లవుల రాజ్యం తిరిగి బలపడింది. కంచి కేంద్రంగా సింహవిష్ణు నాయకత్వంలో వర్ధిల్లిన ఈ వంశాన్ని అనంతర పల్లవులు లేదా "మహా పల్లవులు" అంటారు. వీరిలో వీరకుర్చుడు మొదటి రాజు. త్రిలోచన పల్లవుడు అందరికంటే ప్రసిద్ధుడు. మంచికల్లు (మాచర్ల వద్ద) లభించిన శాసనం పల్లవుల గురించి తెలిపే మొదటి ఆధారం. క్రీ. శ. 600-630 ప్రాంతంలో సింహవిష్ణు కొడుకైన మహేంద్రవర్మ కృష్ణానది దక్షిణ భాగాన్నంతటినీ జయించాడు. విస్తరణ దశలో ఉన్నరెండు వంశాలైన పల్లవులకూ, చాళుక్యులకూ మధ్య అధిపత్యం కొరకు తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. కాని బాదామి చాళుక్యుల రాజ్యాన్ని పశ్చిమాన రాష్ట్రకూటులు అంతం చేయడంతో పల్లవుల రాజ్యం సుస్థిరమయ్యే అవకాశం లభించింది. 9వ శతాబ్దం వరకు పల్లవుల పాలన సాగింది. తరువాత తంజావూరు చోళులు వారిని జయించి కాంచీపురాన్ని ఆక్రమించారు.

రేనాటి చో (డు) ళులు

రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలంలోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు మండలంలోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగములో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. క్రీ. శ. ఆరవ శతాబ్దమునుండి తొమ్మిదవ శతాబ్దము వరకు చోళవంశమునకు చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు.

చాళుక్యులు

వీరు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజులకడ సామంతులుగా వుండి రాయలసీమ ప్రాంతమములోని చాళుక్యవిషయమును పరిపాలించారు.[9] తూర్పుననున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాట రాజ్యము ప్రవేశించి కదంబులనోడించి ఒక మహాసామ్రాజ్యసంభూతులైరి. చాళుక్యులకెల్ల మూలమైనది బాదామి రాజవంశము. సా.శ.. 624 సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించి, కమ్మనాడు వైపు మరలి చిరకాలశత్రువులగు పల్లవులను దక్షిణమునకు తరిమివేశాడు. క్రీ. శ. 755లో చాళుక్యసామ్రాజ్యమంతరించువరకు పల్లవులతో ఎడతెగని యుద్ధాలు సాగాయి. ఆంధ్రదేశములో మాత్రము తూర్పు చాళుక్యులపేర క్రీ. శ. 1076 వరకు స్థిరముగా పాలించారు.

ప్రధానమైన చాళుక్య రాజ్యాలే కాకుండా ప్రస్తుత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలోని ప్రాంతాన్ని వేములవాడ రాజధానిగా పాలించిన వంశాన్ని వేములవాడ చాళుక్యులు అంటారు. 755-968 మధ్య కాలంలో వీరు రాష్ట్రకూటులకు నామమాత్రపు సామంతులుగా ఉన్నారు. మిగిలిన చాళుక్యులు చంద్రవంశపు రాజులమని చెప్పుకొనేవారు. కాని వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులలాగా తమది సూర్యవంశమని చెప్పుకొన్నారు.

రాష్ట్రకూటులు

రాష్ట్రకూట వంశము బహు ప్రాచీనమైనది. సా.శ.. 6వ శతాబ్దము నుండియు ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశమున పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానములు స్థాపించి పాలన చేయుచుండిరి. వీరు తొలుత చాళుక్యులకు సామంతులు. ఇప్పటి మహారాష్ట్ర లోని ఎల్లోరా ప్రాంతమునేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యము చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడా అంటారు. అద్వితీయ బల పరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. సా.శ.. 758లో యుద్ధములో మరణించాడు. రాజ్యము చేసిన కొద్దికాలములోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశములను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశమునకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు.

పూర్వ చాళుక్యులు

తూర్పుచాళుక్యులు వేంగి రాజధానిగా 7వ శతాబ్దములో తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశము. ప్రసిద్ధి గాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి (సా.శ..608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని (ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) సా.శ.. 616 సంవత్సరంలో, విష్ణుకుండినులను ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అక్కడ తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యం ఆరంభించాడు. క్రమంగా సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యగలిగారు. తరువాతి కాలంలో కుటుంబ కలహాల వల్ల,, పొరుగు రాజ్యాలతో - ముఖ్యంగా రాష్ట్రకూటులు, కళింగులతోను తరువాత చోళులతోను యుద్ధాలవల్ల వేంగి రాజ్యం క్రమంగా క్షీణించింది.

తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దంలో కవిత్రయంలో మొదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించాడు. ఇది తెలుగు సాహితీ రంగంలో ఒక సువర్ణ ఘట్టం. శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంచేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించారు.

పూర్వ గాంగులు

వేంగిలో తూర్పు చాళుక్యుల రాజ్యానికి సమాంతరంగా ఈశాన్యాన తూర్పు (పూర్వ) గాంగులు, దక్షిణాన పల్లవులు పరిపాలించారు. పూర్వ గాంగులు 5వ శతాబ్దం చివరలో ఒడిషా ప్రాంతంలో పాలకులుగా ఉన్నారు. ఆధారాలు లభించినంత వరకు ఆంధ్ర ప్రాంతపు మొదటి రాజు అనబడుతున్న ఇంద్రవర్మ (6వ శతాబ్దం) రాజధాని "దంతిపురం". తరువాత రాజధానిని కళింగ నగరం (శ్రీకాకుళం వద్దనున్న ముఖలింగం) కు మార్చబడింది. సుమారు 5 వందల సంవత్సరాలు గాంగుల పాలన ఈ ప్రాంతంలో సాగింది. తరువాత 11వ శతాబ్దం చివరిలో వారి రాజ్యానికి ఒడిషాలోని కటక్ ప్రధాన కేంద్రమయ్యింది.

చాళుక్య చోళులు

1వ రాజరాజ చోళుని (క్రీ. శ. 985 - 1016) నాయకత్వంలో దక్షిణాన చోళులు బలవంతమైన పాలకులయ్యారు. తూర్పు చాళుక్యుల అంతఃకలహాల కారణంగా శక్తివర్మ అనే రాజు వేంగి సింహాసనం సాధించడానికి రాజరాజచోళుని సహాయం అర్ధించాడు. ఇది అవకాశంగా రాజరాజు వేంగిని జయించి శక్తివర్మను వేంగికి పాలకుడిగా చేశాడు. తరువాత చోళులకు, కళ్యాణీ చాళుక్యులకు వేంగి రాజ్యం యుద్ధరంగమయ్యింది. వేంగి చాళుక్యులతో చోళులు వివాహ సంబంధాలు ఏర్పరచుకొన్నాక వారిని చాళుక్యచోళులు అని వ్యవహరిస్తున్నారు. చాళుక్య చోళ రాజు రాజేంద్రుడు క్రీ. శ. 1070లో 1వ కులోత్తుంగ చోళునిగా చోళసింహాసనం అధిష్టించాడు. క్రీ. శ. 1076వరకు వేంగిలో చాళుక్యచోళుల పాలన (చోళుల రక్షణ, అధీనంలో) సాగింది.

కాకతీయులు

కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులోక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారంపొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించారు. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).

కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి

  • క్రీ. శ. 1000 - 1158 - తెలంగాణ విమోచన: ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్ర నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగానే ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడి స్తబ్దంగా మారింది. ప్రజలలో పుట్టి కష్ట సుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వతంత్రతతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఒక్కమారుగా ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్యనీటివనరులు.
  • క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం : ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయలసీమ, తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలు ఒక పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గురు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి. కాని కులాల మధ్య విద్వేషాలు ఈ కాలంలో పెరగ సాగాయి.
  • క్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్ధులైన ప్రభువులు, యుద్ధ కోవిదులు, కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ఉత్తర దేశపు దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్య పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.
అర్వాచీన గాంగులు

12వ శతాబ్దంలో అంతటా గందరగోళం నెలకొంది. కళ్యాణి చాళుక్యులు తూర్పు చాళుక్యులను జయించారు. 17 సంవత్సరాల తరువాత కళ్యాణి చాళుక్యులను చోళులు, వారి స్థానిక మిత్రులు కలిసి జయించారు. చందవోలు (గుంటూరు) ప్రాంతాన్ని చోళుల సామంతులు అయిన వెలనాటి చోళులు పాలించారు. క్రీ. శ. 1135-1206 కాలంలో వెలనాటి చోళుల నామమాత్రపు అధిపత్యంలో ఆంధ్రదేశాన్ని అనేక చిన్నచిన్న రాజకుటుంబాలు పాలించాయి. రాజకీయ, సాంఘిక కారణాల వల్ల వారి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధమే పల్నాటి యుద్ధం.

ఉత్తరమధ్య యుగం

ఇక్ష్వాకులు, ఛాగి, పరిచ్చేదులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, కోటవంశస్తులు, కాకతీయులు పతనానంతరం వారి వద్ద సేనానులుగా పనిచేసిన కమ్మ, రెడ్డి, వెలమ కులస్తులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకున్నారు.

ముసునూరి నాయకులు

ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి, కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా కమ్మ ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1324 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో ముసునూరి నాయకులు సఫలమయ్యారు. ప్రోలయ నాయకుని మరణానంతరం క్రీ. శ. 1333లో కమ్మ కాపయ నాయకుడు మళ్ళీ ఓరుగల్లు రాజయ్యాడు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.

ఓఢ్ర గజపతులు, రేచెర్ల వెలమలు, కొండవీటి రాజ్యము, రాజమహేంద్రవర రాజ్యము

ఇవన్నీ దాదాపు ఆంధ్ర దేశపు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో నడచిన రాజ్యాలు. ముసునూరు కమ్మ నాయకులను తొలగించి రేచెర్ల నాయకులు రాజులయ్యారు. క్రీ. శ. 1325 నుండి 1474 వరకు తెలంగాణా వారి అధీనంలో ఉంది. రాజధాని రాచకొండ. తీరాంధ్ర దేశం క్రీ. శ. 1325 - 1424 మధ్య కాలంలో కొండవీటి రెడ్ల పాలనలో ఉంది. మొదట వారి రాజధాని అద్దంకి. తరువాత కొండవీటికి మార్చబడింది. అదే సమయంలో రాజమండ్రి ప్రాంతం ఇతర రెడ్ల పాలనలోకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతం గజపతుల అధీనంలో ఉంది. ఒడిషా కటక్‌నుండి పాలిస్తున్న గజపతులు క్రీ. శ. 1448లో రాజమండ్రి రెడ్లను జయించారు. కాని క్రమంగా అన్ని ప్రాంతాలు విజయనగర రాజుల అధీనంలోకి వెళ్ళాయి. కొండవీటి రెడ్ల కాలంలోని ముఖ్య కవులు శ్రీనాధుడు, ఎర్రా ప్రగడ.

బహమనీ రాజ్యము

క్రీ. శ. 1323లో ఓరుగల్లు పతనానంతరం ఆంధ్రులు మొట్టమొదటి సారిగా ముస్లిముల పాలనలోకి వచ్చారు. క్రీ. శ. 1347లో ఢిల్లీ సుల్తానుల నుండి ముసునూరి కమ్మ నాయకుల సహాయంతో స్వాతంత్ర్యం ప్రకటించుకొని అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ రాజ్యం స్థాపించాడు. క్రీ. శ. 1347 నుండి దాదాపు క్రీ. శ. 1425 వరకు బహమనీల రాజధాని ఎహసానాబాద్‌ (గుల్బర్గా). ఆ తరువాత రాజధానిని మహమ్మదాబాద్‌ (బీదర్‌) కు తరలించారు. బహమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యముతో పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్‌ గవాన్ యొక్క వజీరియతులో (క్రీ. శ. 1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. క్రీ. శ. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్ (నిజాం షాహి), బీరార్ (ఇమాద్ షాహి), బీదర్ (బారిద్ షాహి), బీజాపూర్ (అహమ్మద్ షాహి),, గోలకొండ (కుతుబ్ షాహి) - ఇవి దక్కన్‌ సుల్తనత్ లుగా పేరు పొందాయి. వీటిలో కుతుబ్ షాహి వంశం ఆంధ్రుల చరిత్రలో ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంది.

విజయనగర సామ్రాజ్యము

విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క), బుక్క అనే అన్నదమ్ములు ముసునూరి కమ్మ నాయకుల విప్లవ పోరాటాల స్ఫూర్తితో క్రీ. శ. 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు.

తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొంది. ఒక బలీయమైన శక్తిగా నిలబడింది. శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. కళింగుల అధీనంలో గల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.

క్రీ. శ. 1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. క్రీ. శ. 1542 లో రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. క్రీ. శ. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని సుల్తానుల సమాఖ్య చిత్తుగా ఓడించారు. రాజధానిని ఆరు నెలలబాటు కొల్లగొట్టి, నేలమట్టం చేశారు. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, ఆర్థిక పుష్టి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు. విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.

ఆధునిక యుగం

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014


అరవీటి వంశం
గోలకొండ రాజ్యం
నిజాము రాజ్యం
బ్రిటిషు రాజ్యం
స్వాతంత్ర్యోద్యమం

ఆంధ్రోద్యమములు

మధ్య యుగంలో కాకతీయులు, ముసునూరి కమ్మ నాయకులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, కుతుబ్ షాహీలు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ 19 వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, కొంత నిజాము నవాబు ఏలుబడిలోను ఉంది. సర్కారులు గాను, రాయలసీమ గాను, హైదరాబాదు (నైజాం) గాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది.

బ్రిటిషు పరిపాలనా కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేవి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ జిల్లాలు ఉండేవి. - శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు.

మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభా లోను, విస్తీర్ణం లోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలన లోను, ఆర్థిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు.

1912లో ఆధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలయింది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారథ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం, విధ్వంసానికి దారితీసిన ప్రజల కోపం తరువాత 1952 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.

హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాము ఏలుబడిలో ఉన్న ప్రజలు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాము యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం.

1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు నిజాము పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము, తన ఆలోచనకు తగినట్లుగా ప్రయత్నాలు చేసాడు. ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలికి సమస్యను నివేదించడం, సైన్యం, ఆయుధాల సమీకరణ వంటి ప్రయత్నాలు వీటిలో కొన్ని. దీనికి తోడు రజాకార్ల హింస పెచ్చుమీరడంతో, హైదరాబాదు ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు.

పరిస్థితి విషమిస్తున్న దశలో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13 న పోలీసు చర్యకు దిగింది. భారత సైన్యం హైదరాబాదును ముట్టడించి, నిజామును ఓడించింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబరు 18 న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయింది.

మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజామును రాజ్‌ ప్రముఖ్‌గా ప్రకటించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది.

విశాలాంధ్ర, ఏకీకృత ఆంధ్రప్రదేశ్

1953 డిసెంబరు‌లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్థించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.

కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ విభజన, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన ఉద్యమం 2009 నవంబరు 29 అతను నిరాహారదీక్ష చెయ్యడంతో తీవ్రరూపం సంతరించుకుంది. దాంతో 2009 డిసెంబరు 9 న భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు. అయితే ఆంధ్ర ప్రాంత ఎంపీలు దీనికి నిరసనగా ఉద్యమించడంతో ఆ ప్రతిపాదనను కేంద్రం తాత్కాలికంగా విరమించింది. తెలంగాణ ఉద్యమం కొనసాగింది. 2013, అక్టోబరు 3 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.2013, డిసెంబరు 5 న తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించగా, 2014, జనవరి 7 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

2014, ఫిబ్రవరి 18 న లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20 న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందగా, మార్చి 1 న రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.

చివరకు అప్పటి కేంద్రం ప్రభుత్వం (UPA) తెలంగాణా ప్రాంతాన్ని విడదీసి నవ్యాంధ్రప్రదేశ్ ను పది సంవత్సరాలు హైదరాబాద్ ను తెలంగాణాతో పాటు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసింది.2014 సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణాలో తెలంగాణారాష్ట్రసమితి (TRS) పార్టీకి చెందిన కల్వకుంట్లచంద్రశేఖర రావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. వారిద్దరూ తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రులు అయ్యారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా హైదరాబాదులోనే ఉంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిని నవ్యాంధ్రప్రదేశ్ కు మార్చాడు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. నిర్ణయించిన తరువాత త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభించి సంవత్సర కాలంలోనే అమరావతిలో శాసనసభను ప్రారంభించారు. అలాగే అన్ని రకాల భవనాలకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ప్రజల అనుమతితో 30 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి సమీకరించారు. 2015 అక్టోబర్ 22 న అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమరావతి మహానగరాన్ని నవ నగరాలుగా నిర్మించ తలపెట్టాడు.

2017 మార్చి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కేంద్రంగా జరగడం ప్రారంభించాయి 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పని చేయడం ప్రారంభించింది. ఇది అమరావతి ప్రాంతంలో నేలపాడు గ్రామానికి దగ్గరలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి ఐదు సంవత్సరాలు ఇ.ఎస్.ఎల్. నరసింహన్ తెలంగాణకు, నవ్యాంధ్రప్రదేశ్ కూ గవర్నరుగా పనిచేసాడు. 2019 జరిగిన ఎన్నకలలో వైఎ్సార్సీపీకి 151ఎమ్మెల్యేతో వై.ఎస్,జగన్మోహన్ రెడ్డి ముఖ్యమత్రి అయ్యాడు. నవ్యాంధ్రప్రదేశ్ కు ఒడిశాకు చెందిన బీజేపీ నేత బిశ్వభూషణ్ హరిచందన్‌ను గవర్నరుగా నియమించారు. 2019 జూలై 23 న విజయవాడ కేంద్రంగా బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్గా రాజ్ భవన్ పనిచేయడం ప్రారంభించింది. మునుపటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని అన్ని హంగులతో రాజభవన్ గా అధికారులు రూపొందించారు.

కాలరేఖ

సాహిత్యంలో పొగడ్తలు

అమరావతీ పట్టణమున బౌద్ధులు
విశ్వవిద్యాలయములు స్థాపించు నాఁడు

ఓరుగల్లున రాజవీర లాంఛనములుగాఁ
బలు శస్త్రశాలలు నిలుపునాఁడు
విద్యానగర రాజ వీధులఁ గవితకు
పెండ్లి పందిళ్ళు కప్పించు నాఁడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
దిగ్జయ స్తంభమెత్తించునాఁడు

ఆంధ్ర సంతతికే మహితాభిమాన
దివ్యదీక్షా సుఖస్పూర్తి తీవరించె
నా మహావేశ మర్ధించి యాంధ్రులార!
చల్లుఁడాంధ్ర లోకమున నక్షతలు నేఁడు!

-- రాయప్రోలు సుబ్బారావు


బయటి లింకులు

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  • విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • Sir V Ramesam (retired Judge of Madras High Court) - Andra Chronology (90-1800 A.C.) Published 1946 - [1]
  • Dr. M. Rama Rao - Select Andhra Temples - Published by Govt. of Andhra Pradesh - [2]
  • చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర - మూడవ భాగము - ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ప్రచురణ - 1916 - [3]
  • మల్లంపల్లి సోమశేఖర శర్మ - అమరావతీ స్తూపము - [4]
  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - బౌద్ధము-ఆంధ్రము - [5]
  • కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల - [6]
  • Dr.K Gopalachari - Early_History_Of_The_Andhra_Country - Madras University Doctorate Thesis - 1946 - [7]
  • ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీనాంధ్ర నగరములు - మొదటి భాగము - ఆంధ్రచంద్రికా గ్రంథమాల ప్రచురణ - 1950 - [8]

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ప్రభుత్వ వెబ్ సైట్

మూలాలు

  1. Devi, Ragini (1990). Dance Dialects of India (in ఇంగ్లీష్). Motilal Banarsidass Publ. p. 66. ISBN 978-81-208-0674-0.
  2. "APonline - History and Culture-History". 16 July 2012. Archived from the original on 16 July 2012. Retrieved 26 April 2020.
  3. "History of Andhra Pradesh". Government of Andhra Pradesh. Associated Press. Archived from the original on 16 July 2012. Retrieved 22 July 2012.
  4. Ancient and medieval history of Andhra Pradesh. Sterling Publishers, 1993. 1993. p. iv. ISBN 9788120714953. Retrieved 9 June 2014. {cite book}: |work= ignored (help)
  5. Proceedings of the Andhra Pradesh Oriental Conference: Fourth Session, Nagarjuna University, Guntur, 3rd to 5th March 1984 (in ఇంగ్లీష్). The Conference. 1987.
  6. ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర
  7. బి.ఎస్.ఎల్._హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - ప్రచురణ:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  8. చిలుకూరి, వీరభద్రరావు (1910). Wikisource link to ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము. విజ్ఞాన చంద్రికా జ్ఞాన మండలి. వికీసోర్స్. 
  9. History of the Andhras, G. Durga Prasad, 1988, Page 86; P.G. Publishers, Guntur (http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf Archived 2007-03-13 at the Wayback Machine)